న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment