developed countries
-
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
ఢిల్లీ జీ 20 దేనికి? దాని ఉద్దేశాలు ఏంటి?
సాక్షి, ఢిల్లీ: జీ 20 అంటే గ్రూప్ ఆఫ్ 20. పరస్పర ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూపు 1999లో అవతరించింది . 1999లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అగ్ర దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూప్ 20 ఏర్పాటు చేశారు . ఈ గ్రూపులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, టర్కీ, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా తోపాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నారు. అనతి కాలంలోనే , ఇది కేవలం ఆర్థిక అంశాలపైనే కాకుండా తన ఎజెండాను విస్తరించుకుంది. కొత్తగా వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు ఈ అంశాల పైన పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ జీ20 దేశాల గ్లోబల్ జిడిపి ప్రపంచంలో 85% గా ఉంది. ప్రపంచ వ్యాపారంలో 75 శాతం ఈ దేశాల వాటా ఉంది. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండో వంతు జనాభా జి-20 ఈ దేశాల్లోని నివసిస్తుంది. అందుకే ఈ దేశాల సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. లోపాలున్నాయ్ అయితే ఈ జీ 20 కి సొంత సచివాలయం లేకపోవడం ఒక పెద్ద మైనస్. 24 ఏళ్ల కిందట ఈ జీ 20 గ్రూప్ ను స్థాపించిన ఇప్పటికీ సెక్రటేరియట్ లేదు. ఈ గ్రూపు నిర్ణయాలను తప్పని సరిగా అమలు చేయాలని చట్టబద్ధత లేదు. ఈ సదస్సులో పరస్పర ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలను అమలు చేయకపోతే పెద్దగా ఎలాంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. వసుధైక కుటుంబం అనే జి-20 సదస్సుకు భారత నాయకత్వం వసుదైవక కుటుంబం అనే నినాదంతో జి20 సదస్సుకు భారత నాయకత్వం వహిస్తోంది. ప్రపంచమంతా కుటుంబం అనే భావన మన సంస్కృతిలో ఉంది అనే అంశాన్ని తెలియజేసే క్రమంలో భాగంగా ఈ నినాదాన్ని దీనికి ట్యాగ్‌లైన్ గా ఉంచారు. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంతో జి20 సదస్సును భారత నిర్వహిస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూనే ఈ ధరిత్రి సురక్షితంగా ఉంటుందని సందేశాన్ని భారత్ ఈ సందర్భంగా ప్రపంచానికి చాటుతోంది. ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో ఒక సభ్య దేశం g20 కి నాయకత్వం వహిస్తోంది. అందులో భాగంగా గత డిసెంబర్ నుంచి భారత్ ఈ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరిస్తోంది. భారత్ జి20 చైర్మన్‌గా కొనసాగుతూ సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సభ్య దేశాలతో ఏడాది పొడవున సమావేశాలు నిర్వహించింది. ఫైనల్ గా సెప్టెంబర్ 9 10 తేదీల్లో శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది. ఏడాది జి20 చైర్మన్‌గా భారత్ రెండు ట్రాక్ ల పై ప్రధానంగా పని చేసింది.. ఒకటి ఫైనాన్షియల్ ట్రాక్, రెండోది షేర్పా ట్రాక్. ఆర్థిక అంశాలపై ఆయా దేశాల ఆర్థిక మంత్రులు నేరుగా చర్చలు జరుపుతారు. షేర్పా ట్రాక్ వర్కింగ్ గ్రూప్ లో వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు ఏడాది పొడవున వివిధ సదస్సులు నిర్వహిస్తారు. ఇవే కాకుండా ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ద్వారా సివిల్ సొసైటీస్, పార్లమెంటేరియన్స్ ,బ్థింక్ ట్యాంక్స్, మహిళ ,యువత, లేబర్, బిజినెస్, రీసర్చ్ తో ఈ గ్రూప్ 20 చర్చలు జరుపుతుంది వీటిని ఎంగేజ్మెంట్ గ్రూప్స్ గా పిలుస్తారు. ఈ జీ20 సదస్సును భారత్ తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకునేందుకు ఉపయోగించుకుంటుంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ అతి త్వరలోనే మూడో స్థానానికి ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అవసరమైన సహకారాన్ని జి20 సదస్సు ద్వారా భారత్ పొందనుంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందిన భారత్, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రష్యా , చైనా దేశాల అధ్యక్షుల గైర్హాజరు దేనికి సంకేతం ? రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జి 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాకపోవడం వెనుక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాల వైఖరిపై అధ్యక్షుడు పుతిన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రష్యా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్న ఉక్రెయిన్ కు వెస్ట్ కంట్రీస్ అండగా నిలబడడంపై ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పుతిన్ పై యుద్ధ నేరాలకు గాను అరెస్ట్ ఆఫ్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు రష్యాలో సైతం అంతర్గతంగా పరిస్థితులు కత్తి మీద సాములా ఉన్నాయి. ఇటీవల పుతిన్ తిరుగుబాటుదారు ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఇలాంటి సున్నిత పరిస్థితుల మధ్యలో ఉతిన్ రష్యా దాటి బయటికి వచ్చే సాహసం చేయడం లేదు ఆయన బదులుగా విదేశాంగ శాఖ మంత్రి లాబ్రోస్ను G20 సదస్సుకు పంపుతున్నారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై జి20 డిక్లరేషన్ చేస్తే దాన్ని బ్లాక్ చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జింపింగ్ సైతం తన బదులు ప్రీమియర్ కి లియాంగును జి20 సదస్సుకు పంపుతున్నారు. ఈ రెండు ప్రముఖ దేశాల అధ్యక్షులు g20 సదస్సుకు డుమ్మా కొట్టడం వెనుక పాశ్చాత్య దేశాల వైఖరి కారణం అనే చర్చ జరుగుతుంది. అలాగే చైనా కూడా ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ ను తన మ్యాప్ లో చూపించడం, లద్దక్ సరిహద్దుల్లో దురాక్రమణులకు ప్రయత్నించడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఈ పరిణామాలు నేపథ్యంలో జిన్ పింగ్ జి20 సదస్సుకు ముఖం చాటేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ఢిల్లీ జి20 సదస్సుకు ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పచ్చదనం పరిశుభ్రత పెద్దపీట వేశారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జి20 సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నిటిని అలంకరించారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి భారత ప్రతిష్టను చాటేలా తయారు చేశారు. రోడ్లకు ఇరువైపులా జి20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళావైభవ చిహ్నాలు అన్నిటిని రోడ్ల ముఖ్య కూడలిలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను విమానాశ్రయం వద్ద ప్రదర్శన గా పెట్టారు. ఢిల్లీకి వచ్చే అతిధులకు కనుల విందుగా పరిసరాలన్నిటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ డెకరేషన్స్ చేశారు. జీ 20 సదస్సును ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు. కర్ణాటక బసవేశ్వరుడి అనుభవం మండపం స్ఫూర్తితో భారత మండపం అని నామకరణం చేశారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో ఈ భారత మండపం నిర్మాణం జరిగింది. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి కళా వైభవాన్ని ఉట్టిపడేలా భారత మండపాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 25 అడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహాన్ని ఈ మండపంలో ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఈ మండపం మొత్తానికి ఇదే ఒక పెద్ద హైలెట్‌గా నిలవబోతోంది. దీనితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ వైభవ చిహ్నాలను ఇందులో అమర్చారు. ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి లాంటిది అనే విషయానికి గుర్తుగా మన ఋగ్వేదంలో ఉన్న విషయాలను ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. బసవేశ్వరుడి అనుభవ మండపం కూడా ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని ఉద్దేశంతో ఆ పేరుతోనే ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కి నామకరణం చేశారు. సాంస్కృతిక వైభవంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అధునాతన సౌకర్యాలను ఈ భారత మండపంలో మేళవించారు. ఈ జీ20 సదస్సులో ఈ సమావేశ మందిరం భారత సంస్కృతికి ఒక ప్రతీక గా నిలవబోతోంది. జి 20 సదస్సుకు కనీవిని ఎరుగని భద్రత భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఏ చిన్న ఆటంకం అంతరాయం లేకుండా అతిధులకు సౌకర్యాలు కల్పించేందుకు సమావేశాలు విజయవంతంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. అతిధుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దాదాపు లక్షన్నరమంది సెక్యూరిటీ సిబ్బంది జి20 సదస్సు కోసం పనిచేస్తున్నారు. ప్రతి 100 అడుగులకు ఒక సాయుధ పోలీసును విధుల్లో ఉంచారు. సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉండనుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు , దుకాణాలు, మా, స్కూలు, కాలేజీలు అన్నిటిని మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ , బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా 24 దేశాధినేతలు సమావేశాలకు హాజరుకానున్నారు. వీరి భద్రత పోలీసులకు ఒక పెద్ద సవాల్ గా మారింది. ఇందుకోసం గత వారం రోజుల నుంచి పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఆ మూడు రోజులు ఢిల్లీ లాక్ డౌన్ ? సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లబోతోంది. ఢిల్లీకి వచ్చే దాదాపు 100కు పైగా రైళ్లను ఈ మూడు రోజుల్లో రద్దు చేశారు. అలాగే విమాన రాకపోకలు సైతం రద్దు చేశారు. ఈ మూడు రోజులపాటు పరిమిత సంఖ్యలోనే విమానాలు రైళ్ల రాకపోకలు ఢిల్లీలో కొనసాగుతాయి. కీలక దేశాధినేతల రాకపోకలు నేపథ్యంలో అనేక ఆంక్షలను అమలు చేస్తున్నారు. సామాన్య ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇక సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మారబోతోంది. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ మూడు రోజులపాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిట, ఖరీదైన కార్లకు గిరాకీ జి20 దేశాల అధినేతలు, ప్రపంచ ఆర్థిక సంస్థల నేతలు ఢిల్లీకి తరలి వస్తుండడంతో ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిటలాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌కు ఐటిసి మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేశాల ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఢిల్లీకి చేరుకొని తమ అధినేతల రాకపోకల ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సదస్సు కోసం ప్రత్యేకించి వేల సంఖ్యలో ఖరీదైన బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లను ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో కారు కోసం లక్ష రూపాయల అద్దె చెల్లించడానికి కూడా ప్రభుత్వం వెనకాడడం లేదు. హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలిగే డ్రైవర్లను ఇందులో నియమిస్తున్నారు. జి20 కి కోతల బెడద సెంట్రల్ ఢిల్లీ అంటేనే కోతుల బెడద అధికం. ఎంపీల ఇళ్ల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వేల సంఖ్యలో ఈ కోతులు నానా హంగామా చేస్తుంటాయి. జి20 సదస్సు కోసం ఢిల్లీని లాక్ డౌన్ చేస్తున్న కోతులను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. ఎందుకోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేల సంఖ్యలో ఉన్న కోతుల తండాను నియంత్రించేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపుతున్నారు. అలాగే కొండముచ్చుల అరిచే సిబ్బందిని వీటికోసం నియమించారు. హోటల్లు ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలు, వివిఐపీలు ఉండే నివాసస్థలాల దరిదాపుల్లోకి ఈ కోతులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించారు. సెంట్రల్ ఢిల్లీలో కోతులను శాశ్వతంగా పారదోలే ఉపాయం లేకపోవడంతో తాత్కాలికంగా కొండముచ్చులతో వాటిని బయటకు రాకుండా భయపెడుతున్నారు. :::నాగిళ్ళ వెంకటేష్ సాక్షి టీవీ డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, న్యూఢిల్లీ -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే బ్లూప్రింట్ వంటిదని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ప్రసంగంలో గత దశాబ్దంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ, 2047 నాటికి భారతదేశం ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మారేందుకు బ్లూప్రింట్‌ను రూపొందించిందని పరిశ్రమల సంఘం సీఐఐ తెలిపింది. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) భారత్‌ను మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న ప్రధాని దార్శనికత వచ్చే ఐదేళ్లలో సులువుగా ఫలించగలదని సీఐఐ విశ్వసిస్తోందని డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో వివరించిన విజయాలు, దార్శనికత అమృత్ కాలంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కావాల్సిన బలం, ధైర్యాన్ని అందిస్తాయి. ఇందుకు తగిన వేదికను ఏర్పాటు చేస్తాయి’’ అని ఆయన అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే జాతీయ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధన కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక బృందంగా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక ఉమ్మడి దార్శనికత(విజన్) అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు ‘గతిశక్తి పోర్టల్’ను ఉపయోగించాలని చెప్పారు. ‘వికసిత్ భారత్’ సాధనకు సుపరిపాలన కీలకమని వివరించారు. కీలక అంశాలపై చర్చ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఈ భేటీకి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొందరు సీఎంల తీరు ప్రజా వ్యతిరేకం: బీజేపీ నీతి ఆయోగ్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. వారి నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారహితం అని విమర్శించారు. దేశ అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందించడంలో నీతి ఆయోగ్ పాత్ర కీలకమని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారని ఆక్షేపించారు. 100 కీలక అంశాలపై చర్చించే గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రులు రాకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ రాష్ట్రాల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రధాని మోదీని ఇంకెంత కాలం ద్వేషిస్తారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మోదీని ద్వేషించడానికి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని, మరి ప్రజలకెందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. -
COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే
ఈజిప్టులో జరిగిన ‘కాప్ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ ఈసారి హాట్ టాపిక్! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్ ఓవర్‌డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే! ఈజిప్టులోని షర్మ్ అల్–షేఖ్లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైౖమేట్ ఛేంజెస్ (యూఎన్ఎఫ్సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్ ఓవర్‌డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్ ఎఫ్‌సీసీసీ ఆర్టికల్ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్ రెండున స్టాక్‌హోమ్+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్ఎఫ్సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి. ‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్ అవర్ ఎన్విరాన్ మెంటల్ ఫ్యూచర్’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. యూఎన్ఎఫ్సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాల ద్వారా యూఎన్ఎఫ్సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది. రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ద ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైౖమేట్ ఛేంజ్’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌కు చెందిన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా ప్యారిస్ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్ఎఫ్సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది. వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్ఎఫ్సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యూఎన్ ఎఫ్‌సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్ఎఫ్సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి. భరత్ హెచ్. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తిండిపై తక్కువ ఖర్చు చేసే దేశాలు అవేనట!
న్యూయార్క్: తిండి కలిగితే కండ కలుగునోయ్, కండ కలిగిన వాడేను మనుజోయ్! అన్నది ఓ కవి వాక్కు. ఈ వాక్కు ప్రకారం ప్రపంచంలోని ఎన్ని దేశాలు తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయో పరిశీలిస్తే అవాక్కవ్వాల్సిందే. అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా తిని పారేస్తున్నాయన్నది మన పొరపాటు అభిప్రాయం. దేశాలు ఎంత అభివృద్ధి చెందితే తిండిపై అంత తక్కువగా ఖర్చుపెడతాయన్న నిజం అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధనలో తేలింది. ఇంటి ఆదాయంలో పది శాతం కన్నా తక్కువ ఆదాయాన్ని తిండిపై వెచ్చిస్తున్న దేశాలు ప్రపంచంలో ఎనిమిది దేశాలున్నాయని అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధన తెలిపింది. వాటిలో నాలుగు యూరప్ దేశాలు కాగా, మిగిలిన నాలుగు దేశాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని పేర్కొంది. వీటిలో అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉంది. అమెరికన్లు తమ ఇంటి ఆదాయంలో సరాసరి సగటున 6.4 శాతం ఆదాయాన్ని తిండి కోసం ఖర్చు చేస్తారట. అమెరికా తర్వాత ఇంటి ఆదాయంలో 6.7 శాతం ఖర్చుతో సింగపూర్ ద్వితీయ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్(8.2 శాతం), స్విట్జర్లాండ్(8.7 శాతం), కెనడా(9.1 శాతం), ఐర్లాండ్(9.6 శాతం), ఆస్ట్రేలియా(9.8 శాతం) ఆస్ట్రియా(9.9 శాతం) లు నిలిచాయి. ఓ ఇంటికొచ్చే ఆదాయంలో సగానికి పైగా ఆదాయాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్న దేశాల్లో ఎక్కువగా పేద దేశాలే ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా నైజీరియానే తిండికోసం ఎక్కువ ఆదాయాన్ని ఖర్చుపెడుతోందని తేలింది. అక్కడి ప్రజలు తమ ఆదాయంలో 56.4 శాతం ఆదాయాన్ని తిండిపై ఖర్చు పెడుతుండగా, 46.7 శాతంతో కెన్యా, 45.6 శాతంతో కామెరూన్, 42.5 శాతంతో అల్జీరియా, 43 శాతంతో కజకిస్థాన్, 41.9 శాతంతో ఫిలిప్పీన్స్, 40.9 శాతంతో పాకిస్థాన్, 40.6 శాతంతో గౌతమాల, 40.1 శాతంతో అజర్బైజాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. అమెరికన్ల కన్నా నైజీరియా ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్నారంటే వారు తిండిబోతులనో లేదా అక్కడ తిండి ధరలు ఎక్కువనో భావించరాదు. ఓ ఇంటికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం వల్లనే పేద దేశాలు బతకడం కోసం తిండికే ఎక్కువ ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. వాస్తవానికి ఓ అమెరికన్ ఏడాదికి సగటున తిండిపై 2,392 డాలర్లు ఖర్చు పెడుతుంటే నైజీరియా మనిషి సగటున 1,132 డాలర్లను ఖర్చు పెడుతున్నారు. కెన్యా పౌరుడైతే తిండిపై ఏడాదికి సగటున 543 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో కూడా ధనవంతుడికి, పేదవాడికి మధ్యన తిండి ఖర్చు విషయంలో వ్యత్యాసం ఉంది. 20 శాతం మంది పేదవాళ్లు గత పాతికేళ్లలో ఆహారంపై తమ ఆదాయంలో 28.8 నుంచి 42.6 శాతాన్ని ఖర్చు చేయగా, అదే 20 శాతం మంది ధనవంతులు గత పాతికేళ్ల కాలానికి తమ ఆదాయంలో 6.5 నుంచి 9.2 శాతాన్నే ఆహారంపై ఖర్చు పెట్టారు. -
టాప్-10 సంపన్న దేశాల్లో భారత్
న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల (మొత్తం వ్యక్తులది) సంపదతో ఈ స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. దీని తర్వాత రెండు, మూడు స్థానాల్లో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. నాలుగు, ఐదు, ఆరవ స్థానాల్లో వరుసగా యునెటైడ్ కింగ్డమ్ (9,200 బిలియన్ డాలర్లు), జర్మనీ (9,100 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (6,600 బిలియన్ డాలర్లు) నిలిచాయి. ఇక కెనడా (4,700 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (4,500 బిలియన్ డాలర్లు), ఇటలీ (4,400 బిలియన్ డాలర్లు) దేశాలు భారత్ తర్వాత వరుసగా 8, 9, 10వ స్థానాల్లో ఉన్నాయి. న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ వ్యక్తి నికర ఆస్తులను సంపదగా పరిగణలోకి తీసుకుంది. మనకు జాబితాలో చోటు దక్కడానికి ప్రధాన కారణం మన దేశ జనాభానే. కాగా కేవలం 2.2 కోట్ల మంది జనాభాతో ఆస్ట్రేలియా జాబితాలో చోటుపొందటం విశేషం.