తిండిపై తక్కువ ఖర్చు చేసే దేశాలు అవేనట!
తిండిపై తక్కువ ఖర్చు చేసే దేశాలు అవేనట!
Published Sat, Dec 10 2016 4:13 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
న్యూయార్క్: తిండి కలిగితే కండ కలుగునోయ్, కండ కలిగిన వాడేను మనుజోయ్! అన్నది ఓ కవి వాక్కు. ఈ వాక్కు ప్రకారం ప్రపంచంలోని ఎన్ని దేశాలు తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయో పరిశీలిస్తే అవాక్కవ్వాల్సిందే. అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా తిని పారేస్తున్నాయన్నది మన పొరపాటు అభిప్రాయం. దేశాలు ఎంత అభివృద్ధి చెందితే తిండిపై అంత తక్కువగా ఖర్చుపెడతాయన్న నిజం అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధనలో తేలింది.
ఇంటి ఆదాయంలో పది శాతం కన్నా తక్కువ ఆదాయాన్ని తిండిపై వెచ్చిస్తున్న దేశాలు ప్రపంచంలో ఎనిమిది దేశాలున్నాయని అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధన తెలిపింది. వాటిలో నాలుగు యూరప్ దేశాలు కాగా, మిగిలిన నాలుగు దేశాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని పేర్కొంది. వీటిలో అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉంది. అమెరికన్లు తమ ఇంటి ఆదాయంలో సరాసరి సగటున 6.4 శాతం ఆదాయాన్ని తిండి కోసం ఖర్చు చేస్తారట. అమెరికా తర్వాత ఇంటి ఆదాయంలో 6.7 శాతం ఖర్చుతో సింగపూర్ ద్వితీయ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్(8.2 శాతం), స్విట్జర్లాండ్(8.7 శాతం), కెనడా(9.1 శాతం), ఐర్లాండ్(9.6 శాతం), ఆస్ట్రేలియా(9.8 శాతం) ఆస్ట్రియా(9.9 శాతం) లు నిలిచాయి.
ఓ ఇంటికొచ్చే ఆదాయంలో సగానికి పైగా ఆదాయాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్న దేశాల్లో ఎక్కువగా పేద దేశాలే ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా నైజీరియానే తిండికోసం ఎక్కువ ఆదాయాన్ని ఖర్చుపెడుతోందని తేలింది. అక్కడి ప్రజలు తమ ఆదాయంలో 56.4 శాతం ఆదాయాన్ని తిండిపై ఖర్చు పెడుతుండగా, 46.7 శాతంతో కెన్యా, 45.6 శాతంతో కామెరూన్, 42.5 శాతంతో అల్జీరియా, 43 శాతంతో కజకిస్థాన్, 41.9 శాతంతో ఫిలిప్పీన్స్, 40.9 శాతంతో పాకిస్థాన్, 40.6 శాతంతో గౌతమాల, 40.1 శాతంతో అజర్బైజాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.
అమెరికన్ల కన్నా నైజీరియా ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్నారంటే వారు తిండిబోతులనో లేదా అక్కడ తిండి ధరలు ఎక్కువనో భావించరాదు. ఓ ఇంటికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం వల్లనే పేద దేశాలు బతకడం కోసం తిండికే ఎక్కువ ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. వాస్తవానికి ఓ అమెరికన్ ఏడాదికి సగటున తిండిపై 2,392 డాలర్లు ఖర్చు పెడుతుంటే నైజీరియా మనిషి సగటున 1,132 డాలర్లను ఖర్చు పెడుతున్నారు. కెన్యా పౌరుడైతే తిండిపై ఏడాదికి సగటున 543 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు.
అమెరికాలో కూడా ధనవంతుడికి, పేదవాడికి మధ్యన తిండి ఖర్చు విషయంలో వ్యత్యాసం ఉంది. 20 శాతం మంది పేదవాళ్లు గత పాతికేళ్లలో ఆహారంపై తమ ఆదాయంలో 28.8 నుంచి 42.6 శాతాన్ని ఖర్చు చేయగా, అదే 20 శాతం మంది ధనవంతులు గత పాతికేళ్ల కాలానికి తమ ఆదాయంలో 6.5 నుంచి 9.2 శాతాన్నే ఆహారంపై ఖర్చు పెట్టారు.
Advertisement