
వాషింగ్టన్: పేద దేశాలకు సాయం చేసేందుకు అమెరికాకు మనసొప్పట్లేదు. ఆ దేశాల్లోని ప్రజలకు మేలు చేసే విధానాలు రూపొందించే విషయంలో ఆ దేశం మిగతా ధనిక దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. అభివృద్ధి నిబద్ధత సూచీ (కమిట్‌మెంట్ టు డెవలప్‌మెంట్ ఇండెక్స్)లో చివరి స్థానాల్లో ఒకటిగా నిలిచింది. విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాలను ఆధారంగా చేసుకుని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ (సీజీడీ) ఈ సూచీని విడుదల చేసింది.
మొత్తం 27 ధనిక దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు. ఇందులో స్వీడన్ మొదటి స్థానంలో నిలవగా, డెన్మార్క్ రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ, ఫిన్‌లాండ్‌లు మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాయి. అమెరికా 23వ స్థానంలో నిలిచింది. చివరి నాలుగు స్థానాల్లో పోలండ్, గ్రీస్, దక్షిణ కొరియా, జపాన్ మాత్రమే ఉన్నాయి. రక్షణ, వాణిజ్య రంగాల్లో మాత్రం అమెరికా మంచి స్కోరు సాధించినా.. నూతన పన్నుల విధానం వల్ల భవిష్యత్తులో ర్యాంకు మరింత పడిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది సూచీలో ఐరోపా దేశాలు తొలి 12 స్థానాలు దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment