అధ్యక్షుడు మదురో గెలిచినట్టు ఈసీ ప్రకటన
మేమే గెలిచాం, ఫలితాల్ని మార్చేశారు: విపక్షాల ఆరోపణ
బూత్‌లవారీగా ఫలితాల వెల్లడికి డిమాండ్, ఈసీ ససేమిరా
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్‌ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్‌ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు.
మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్‌ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్‌ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది.
మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.
ఫలితాలపై దేశాల పెదవి విరుపు
వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment