దేవుడిని నవ్వించేవాళ్లు! | God is so funny! | Sakshi
Sakshi News home page

దేవుడిని నవ్వించేవాళ్లు!

Published Thu, Jul 17 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

God is so funny!

 దైవికం
 
మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా?
 
ఇఫ్ యు వాంట్ మేక్ గాడ్ లాఫ్, టెల్ హిమ్ అబౌట్ యువర్ ప్లాన్స్ - అంటాడు ఊడీ ఆలెన్. దేవుణ్ణి నవ్వించాలనుకుంటే, మన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయనకు చెబితే సరిపోతుందట. ఊడీ అమెరికన్ దర్శకుడు. నాలుగు ఆస్కార్‌ల విజేత. ఇదొక్కటే ఊడీ ప్రతిభ కాదు. మంచి రచయిత, న టుడు, జాస్ సంగీతకారుడు, కమెడియన్, నాటక కర్త, గొప్ప సెటైరిస్టు. మనిషికి 78 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నారు. ఇంతా చేసి ఆయన అఫీయిస్ట్ (నాస్తికుడు). దేవుడి మీద కూడా సెటైర్లు వేస్తుంటాడు. కానీ అవి దేవుడికి కోపం తెప్పించేవి కాదు. దేవుణ్ని, మనిషినీ ఇద్దర్నీ నవ్వించేవి.  
 
మన దగ్గర కూడా కొందరు అప్పుడప్పుడు తమకు తెలియకుండానే దేవుణ్ణి నవ్విస్తుంటారు... ‘మా దేవుడు గ్రేట్’ అంటే, ‘మా దేవుడు గ్రేట్’ అని. ఈ మధ్య అలా దేవుణ్ణి నవ్వించిన పెద్ద మనిషి ద్వారకపీఠం శంకరాచార్యులు స్వామీ స్వరూపానంద.

షిర్డీ సాయిబాబా ముస్లిం అని, ఆయన్ని హిందువులు ఆరాధించకూడదని; బాబా ఏనాడూ పవిత్ర గంగా నదిలో స్నానమాచరించలేదు కనుక ఆయన్ని ఆరాధించేవారికి గంగలో మునిగే యోగ్యత ఉండదని ఇటీవలి  ప్రసంగంలో స్వరూపానంద సెలవిచ్చారు. ఈ మాటలన్నీ ఆయన కేంద్ర మంత్రి ఉమాభారతిని ఉద్దేశించి అన్నవి. ‘సాధ్వి’ ఉమాభారతి కూడా సాయిబాబాను ఆరాధించడమేమిటన్నది ఆయన ప్రశ్న. లేదా ప్రశ్నార్థకంతో కూడిన ఆశ్చర్యం.

ఇదే మాటను ఆయన గతంలో ఉమాభారతిని దృష్టిలో పెట్టుకుని అన్నప్పుడు ‘‘ఆరాధన  అన్నది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది’’ అని ఒక్క మాటతో ఆమె సరిపుచ్చారు. ఇప్పుడు కూడా స్వరూపానంద వ్యాఖ్యలపై ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడక పోవడం కూడా ఆయనకు కోపం తెప్పించినట్లుంది. ‘‘ఉమాభారతి రంగులు మార్చి సాయిబాబాను కొలుస్తున్నారు. బాబా ముస్లిం. ఆ సంగతి తెలిసీ ఆయన్ని కొలుస్తున్నారంటే, ఇక ఆమెపై ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎలా కురుస్తాయి’’ అని అన్నారు.
 
ఈ మాటలు ఆ భగవానుడికి నవ్వు తెప్పించకుండా ఎలా ఉంటాయి?! మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఒకరిని వరం కోరుకుంటే, మనకెందుకులే అని ఇంకొకరు పట్టనట్లు ఉండిపోతారా? బాబా అంటే శ్రీరామచంద్రుడు పలక్కండా పోతాడా? రామా అంటే జీసెస్ రాకుండా ఉంటాడా? అల్లా అంటే ఆ పరమాత్ముడికి వినిపించకుండా ఉంటుందా?! మనుషుల్లోనే దేవుడు ఉంటాడంటారు కదా రమణ మహర్షి, అలాంటప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉంటేనేం? ఏ పేరుతో ఉంటేనేం? ఏ రూపంలో ఉంటేనేం? అసలు ఏ రూపంలోనూ లేకపోతేనేం?
 
దేవుడి గురించి పొసెసివ్‌గా (‘అమ్మా...నా దేవుడు’ అన్నట్లు) గొడవ పడడం అన్నది ‘మా ఇంట్లో దేవుడి పటానికి నువ్వెందుకు దండం పెడుతున్నావ్?’ అని అడగడం లాంటిది. లేదా ‘మా వీధిలో గుడికి నువ్వెందుకొచ్చావ్’ అని తగాదా పడడం లాంటిది.
 
స్వామీ స్వరూపానందకు ఇవన్నీ తెలీదనుకోవాలా? లేక సచిన్‌ని దేవుడిలా భావించే ఒక సాధారణ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఆయన చేత ఈ మాటలన్నీ అనిపించిందా? రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నప్పుడు సచిన్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు! ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ గురించి తెలీదా అని విస్తుపోయారు. కొందరైతే ‘‘పోనీయండి పాపం, దేవుడి గురించి తెలీదంటే ఆమె నాస్తికురాలు అయ్యుండాలి’’ అని పెద్దమనసు చేసుకున్నారు. కనీసం అలాగైనా పెద్దమనసు చేసుకోలేకపోయారా స్వరూపానంద!!
 
- మాధవ్ శింగరాజు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement