మనలోనే మన ఎదుటే ఆనందం
దైవికం
ప్రపంచంలోనే అతి విషాదకరమైనదేదో తెలుసా? మనిషి ఆనందంగా ఉండటానికి పుట్టాడు. కానీ అతను సంతోషంగా లేకపోవడం.
మైఖేల్ ఆడమ్ దీనిని అందంగా చెప్పాడు
‘‘మనిషి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందుకోసం అతను నానా పాట్లు పడతాడు. ఈ ప్రయత్నమే అతని విషాదానికి కారణమవుతోంది. నేను ఆనందంగా ఉండాలని ఆశించాను. ఆశ అనేది సామాన్యమైనది కాదు. అందుకోసం అర్రులు చాచిన క్రమంలో ఆనందమనే పక్షి నా దగ్గరకు రానే లేదు. నేను ఆనందాన్ని పొందడం కోసం చాలా కాలం శ్రమించాను. నేను ఆనందాన్ని ఎక్కడో బహుదూరాన వెతికాను. ఆనందం అనేది ఒక నది మధ్యలో ఉన్నటువంటి దీవి అని ఎప్పుడూ అనుకునే వాడిని. అదే నదిగా ఉండి ఉండవచ్చు. ఆనందమనేది రహదారి చివ ర్లో ఉండే సత్రం పేరే అనుకున్నాను. అదే రహదారిగా ఉండి ఉండవచ్చు. ఆనందమనేది రేపు అనే అనుకున్నాను. కానీ అది ఇప్పుడే ఇక్కడే ఉండి ఉండవచ్చు కదా? నేను దానిని ఎక్కడో వెతికాను’’ అంటాడు మైఖేల్ ఆడమ్. ఆయన చేసిన తప్పు ఆనందాన్ని వెతకడమే. ఆనందం బయటెక్కడో లేదు. అది మనలోపలే ఉంది.
లోపల ఉన్నదానిని బయటెక్కడో వెతికితే ఎలా దొరుకుతుంది? ఉన్న చోటు విడిచిపెట్టి లేని చోట వెతికితే ఎలా దొరుకుతుంది?
ముల్లా నసీరుద్దీన్ ఒకసారి వీధిలో దీపం వెలుగులో ఏదో వెతుకుతున్నాడు. మిత్రుడొకడు ఆయనను చూసి ‘‘ఏం వెతుకుతున్నావు?’’ అని అడిగాడు.
నసీరుద్దీన్ ‘తాళాన్ని’ అని జవాబిచ్చాడు.
మిత్రుడు కూడా ఆయనతో కలిసి వెతికాడు. కానీ తాళం ఎంతసేపటికీ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని మిత్రుడు ‘‘ఇంతకీ తాళం ఎక్కడ పోగొట్టుకున్నావు?’’ అని అడిగాడు.
నసీరుద్దీన్ ‘‘ఇంటిముందర’’ అని అన్నాడు.
మిత్రుడు ‘‘మరి అక్కడ కాకుండా ఇక్కడ వెతుకుతున్నావేంటి?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు నసీరుద్దీన్ ‘‘ఇక్కడేగా వెలుగుంది’’ అని అన్నాడు.
మనిషి కూడా ఆనందాన్ని ఇలాగే వెతుకుతున్నాడు. కోల్పోయిన చోట కాకుండా మరెక్కడో వెతుకుతున్నాడు.
‘‘నేను ఆనందం పొందడం కోసం పడరాని పాట్లు పడ్డాను. కానీ ఏం లాభం? బాధే మిగిలింది’’ అని ఆడమ్ చెప్పాడు.
ఆడమ్ నది మధ్యలో ఉన్న దీవినే ఆనందం అనుకున్నాడు. ఇలా అనుకుంటే ఆ దీవిని చేరడానికి తీరం నుంచి దీవి వరకు మధ్య ఉన్న నదీజలాలను ఈదాలి. అది అంత సులభం కాదు. తీవ్రప్రయత్నం చేసే క్రమంలో ఆయనకు చివరకు మిగిలేది బాధే. నది కూడా ఆనందమే అని అనుకుంటే బాధపడాల్సి ఉండదు. ప్రయాణం అనేది కఠినతరమే. రహదారే ఆనందం అని అనుకుంటే నడవడమే ఆనందంగా ఉంటుంది.
అలాగే ఆశ కూడా ఆనందాన్ని దెబ్బ తీస్తుంది.
మనం ఏదో ఒక దానిపైనో లేక ఒక వ్యక్తిపైనో ఆశ పెట్టుకుంటాం. అనుకున్నది పొందితే ఆనందిస్తాం. లేకుంటే కలిగేది ఆవేదనే. మనం ఈ ఆవేదనను మనకు మనమే స్వాగతిస్తుంటాం. మితిమీరిన ఆశ కానివ్వండి ద్వేషం కానివ్వండి అవి ఆనందానికి శత్రువులే. అన్నింటినీ ఒకేలా ఇష్టంతో చూసుకుంటే ఆనందానికి లోటుండదు.
అన్నింటినీ ఆస్వాదించాలి. అప్పుడు జీవితం ఓ పండగవుతుంది. ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటాం. తీరా అలారం మోగినప్పుడు చిరాకుపడతాం. దాని తలమీద ఓ దెబ్బ వేస్తాం.
అలారాన్ని ఆస్వాదించండి. ఆనందానికి లోటుండదు. అన్నింటా ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించవచ్చు. అలా అనుభవించకుండా మనకు మనమే అడ్డుపడుతుంటాం. దానితో బాధలు మొదలు. భగవంతుడిలా ఆనందమూ ఎక్కడో లేదు మన ముందే మనలోనే ఉంది. అంతటా ఉంది. మనం చెయ్యవలసినదల్లా కళ్లు తెరచి చూడాలి.
- యామిజాల జగదీశ్