ఖగోళ అవిశ్వాసి
దైవికం
కేసీఆర్‌కి, కేజే యేసుదాస్‌కీ, స్టీఫెన్ హాకింగ్‌కీ ఏం సంబంధం లేదు. లేదా మనకు తెలియకుండా ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ ఎప్పుడైనా ఏకాంతంలో యేసుదాస్ పాటలు విని ఉండొచ్చు. యేసుదాస్ ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో సమయం దొరికినప్పుడు స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పుస్తకం పేజీలు తిప్పి ఉండొచ్చు. స్టీఫెన్‌కైతే అలాంటి సంబంధం కూడా ఉండే అవకాశం లేదు. కేసీఆర్ మాటలు, యేసుదాస్ పాటలు వినే సందర్భం స్టీఫెన్ జీవితంలో ఎప్పుడైనా ఏర్పడి ఉంటుందని అనుకోలేం.
కేసీఆర్ ఉద్యమ నాయకుడు. యేసుదాస్ దివ్య గాయకుడు. స్టీఫెన్ హాకింగ్ విశ్వరహస్యాలు ఛేదిస్తున్న ఖగోళ శాస్త్రవేత్త. అయితే ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని ఈ మూడు రంగాల వారు ఇటీవల తమ మాటల కారణంగా అంతెత్తునుంచి కిందపడి మామూలు మనుషులుగా అవతరించారు! ‘కిందపడడం’ అనే విషయంలో ఒకరితో ఒకరు సంబంధం ఉన్నవారయ్యారు. ‘‘ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తా’’ అన్నారు కేసీఆర్! మంచిమాటే.. ఆకతాయిల్ని భయపెట్టడానికి. కానీ అంతకంటే (మాటలకంటే) మంచివైన చట్టాలు ఉన్నాయి కదా మనకు. వాటిని కచ్చితంగా అమలు చేస్తాం అనో, మరింత కఠినమైన చట్టాల్ని తెస్తాం అనో అనాలి నిజానికైతే. చట్టాలు ఉన్నప్పుడు, ఆ చట్టాల్లో లేని శిక్షలు విధిస్తాం అనడంలోని అంతర్యం ఏమిటి? ఏమీ లేకపోవచ్చు. కేసీఆర్ మాటలు వినబుద్ధేస్తాయి. ఆ సంగతి ఆయనకూ తెలుసు కాబట్టే అలా మాట్లాడారేమో!
ఇక యేసుదాస్. ‘‘ఆడపిల్లలు జీన్స్ వేసుకోవడం తగదు’’ అని ఇటీవల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంగీతాన్ని వదిలేసి సంప్రదాయాల గొడవల్లోకి వచ్చి పడ్డారు పాపం ఆయన. దేవరాగాన్ని ఒలికించే ఆ స్వరంలో దెయ్యపు పలుకులేమిటని దక్షిణ భారతదేశం నివ్వెరపోయింది.
‘‘కళ్లు పీకేయిస్తా’’ అని కేసీఆర్ అన్న మాటలాంటిదే ఇది కూడా. ‘మన సంస్కృతీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే కళ్లుపోతాయి’ అన్నంతగా యేసుదాస్ మాటల్లో ఆందోళన వ్యక్తమయింది! యేసుదాస్ అనగానే ఇప్పుడు స్వరాలకు బదులు వస్త్రాలు గుర్తొచ్చేస్తున్నాయందుకే.
స్టీఫెన్ హాకింగ్ పరిధి వేరు. అది విస్తృతమైనది. విశ్వవ్యాప్తమైనది. కేసీఆర్‌లా, యేసుదాస్‌లా కాదు. ఆయన మరింత బాధ్యతగా మాట్లాడాలి. గతంలో చాలాసార్లు ఆయన ‘‘నాకు దేవుడు లేడు’’ అన్నాడు కానీ, ‘‘దేవుడు లేడు’’ అనలేదు. కానీ ఇటీవల ఆ మాట కూడా అనేశారు! ‘‘సైన్స్ అర్థమయ్యే దాకా దేవుడిపై మనిషికి నమ్మకం ఉండడం సహజమే’’ అని కానరీ ఐలండ్స్ (స్పెయిన్)లో ఈమధ్య జరిగిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర ఉత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ స్టీఫెన్ అన్నారని అమెరికా నుంచి వెలువడే ‘హఫింగ్టన్ పోస్ట్’ అనే ఆన్‌లైన్ వార్తా కూడలి ప్రచురించగానే ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ పని చేయలేని వారు సున్నితమైన మాటలతో ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘దేవుడితో పోల్చిచూస్తే, విశ్వానికి సంబంధించిన సందేహాలకు సైన్స్ ఎంతో నమ్మశక్యమైన సమాధానాలను ఇస్తోంది’’ అని స్టీఫెన్ అనడం కూడా భక్తిపరులను బాధించింది. అంటే దేవుడు లేడనా, ఉన్నా సమాధానాలు ఇవ్వలేడనా అని వారి ప్రశ్న. స్టీఫెన్ అక్కడితో ఆగలేదు. 1988నాటి తన పుస్తకం ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’లోని ‘వియ్ వుడ్ నో ద మైండ్ ఆఫ్ గాడ్’ అనే వాక్యం ఉన్న భాగానికి అర్థ వివరణ ఇస్తూ, ‘‘దేవుడు గనుక ఉన్నట్లయితే, దేవుడికి తెలిసిన ప్రతిదీ మనుషులకు తెలిసి తీరుతుంది. అయితే దేవుడు లేడు’’ అన్నారు.
‘‘దేవుణ్ణి నమ్మను’’అని ఎప్పటిలా ఒక్క మాటతో సరిపెట్టి ఉంటే స్టీఫెన్ గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. విశ్వం గురించి ఇంత తెలుసుకున్న ఈ థియరిటికల్ ఫిజిసిస్టు, దేవుడిపై మనిషి విశ్వాసాన్ని ఆ విశ్వంలో ఒక భాగంగా ఎందుకు చూడలేకపోయారో? బహుశా విశ్వాసం కూడా ఒక గోళంగా కనిపించాలేమో ఈయనకు ఆకాశంలో. ‘‘మైండ్‌తో కాదు మై డియర్ భౌతిక శాస్త్రవేత్తా... హృదయంతో ఆలోచించు. అప్పుడు దేవుడు కనిపిస్తాడు’’ అని ఎవరో సలహా ఇచ్చారు స్టీఫెన్ హాకింగ్‌కి.
కళ్లు పీకేయిస్తానని కేసీఆర్, జీన్స్ తొడుక్కోవద్దని యేసుదాస్ అన్నందు వల్ల పెద్ద నష్టం లేదు. కానీ స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లు అలా మాట్లాడకూడదు. మనిషి మేధస్సుకు దీర్ఘకాలిక విలువ లేదేమోనని ఒకప్పుడు అనుమానంలో పడిన స్టీఫెన్, ఐక్య క్షేత్రీయ సిద్ధాంతం (యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ) తో దేవుడి ఉనికిని, ఉద్దేశాలను కనిపెట్టేందుకు ప్రయత్నించిన స్టీఫెన్... చివరికొచ్చేసరికి మనుషుల నమ్మకాలను, విశ్వాసాలను తేలికపరిచే వ్యాఖ్యలు చేయడమంటే ‘సైన్సును నమ్మకుంటే దేవుడు క్షమించడు’ అని బెదిరించడమే!
- మాధవ్ శింగరాజు