విమానాశ్రయానికి కసరత్తు
- జిల్లాలో 1,591 ఎకరాల భూమి గుర్తింపు
- ప్రభుత్వానికి నివేదించనున్న జిల్లా యంత్రాంగం
- నేడు సీఎం కేసీఆర్ సమీక్షలో చర్చ
కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు మొదలైంది. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని గుర్తించిన అధికార యంత్రాంగం అదే పనిగా ముందుకు సాగడంతో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఖానాపూర్, అనుకుంట, కచ్‌కంటి, తంతోలి గ్రామాల శివార్లలోని 1,591.45 ఎకరాల స్థలం గుర్తించారు.
విమానాశ్రయం ఏర్పాటులో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమి అధికంగా ఉండడంతో భూములు కోల్పోనున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అనుకుంట, కచ్‌కంటి, తంతోలి, ఖానాపూర్ శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమిని గుర్తించగా, కచ్‌కంటి గ్రామ శివారులోని సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి లేదు. విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం వివరాల జాబితాను అధికార యంత్రాంగం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనుంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే గుర్తించిన భూమిని సేకరించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
భూమి గుర్తింపు ఇలా..
జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి 1,591.45 ఎకరాలు అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 89.44 ఎకరాలు ఉండగా, వ్యవసాయ భూమి 1,502.01 ఎకరాల ఉంది. అయితే ఖానాపూర్ శివారులోని 29, 68 సర్వే నంబర్లలో 50.20 ఎకరాలు, అనుకుంట గ్రామ శివారులోని 106 సర్వే నంబర్లో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులోని 44 సర్వే నంబర్లో 5.20 ఎకరాలు, ఖానాపూర్ గ్రామ శివారులోని 9,10,11,20,29,30,31,42 నుంచి 64 సర్వే నంబర్లలోని 431.36 ఎకరాల వ్యవసాయ భూమి, అనుకుంట గ్రామ శివారులోని 1,3 నుంచి 14,75 నుంచి 91 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 501.34 ఎకరాల వ్యవసాయ భూమి, కచ్‌కంటి గ్రామ శివారులోని 37 నుంచి 51 సర్వే నంబర్లలోని 313.24 ఎకరాల వ్యవసాయ భూమి, తంతోలి గ్రామ శివారులోని 34,35, 42 నుంచి 55 సర్వే నంబర్లలో ఉన్న 256.07 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. ఖానాపూర్, అనుకుంట, కచ్‌కంటి, తంతోలి నాలుగు గ్రామాల్లో భూములు గుర్తించగా, కచ్‌కంటి గ్రామ శివారులో గుర్తించిన సర్వే నంబర్లలో మాత్రం ప్రభుత్వ భూమి లేదు.
ఆందోళనలో రైతులు.. నేడు సీఎంతో సమీక్ష..
జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు విషయమై ప్రజల్లో ఆనందం కన్పిస్తున్నా ఏర్పాటులో వ్యవసాయ భూములు కోల్పోయే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఏర్పాటుకు సుమారు 1,591 ఎకరాల్లో అవసరం కావడంతో పంట భూములు కోల్పోవాల్సి వస్తుంది. తంతోలి, అనుకుంట, కచ్‌కంటి గ్రామాల రైతులు సుమారు 1,100 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు.
అయితే ఏర్పాటుకు గుర్తించినంత మాత్రాన భూమి కోల్పోయినట్లు కాదని, అవసరమైతే గుర్తించిన భూమిని సేకరించవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా, హైదరాబాద్‌లోని మావన వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో సోమవారం జిల్లాల సంయుక్త కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది. సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంశమైన మొదటగా విమానాశ్రయంపై చర్చించనున్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం గుర్తింపు, భూమి సేకరణకు అనువైన మార్గదర్శకాలు తదితర వాటిపై సీఎంతో చర్చించనున్నారు.