పాలమూరులో ఎయిర్‌పోర్ట్‌ | CM KCR Announced Airport For Palamuru | Sakshi
Sakshi News home page

పాలమూరులో ఎయిర్‌పోర్ట్‌

Published Wed, Mar 28 2018 9:30 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

CM KCR Announced Airport For Palamuru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  పాలమూరు జిల్లా కీర్తికిరీటంలో మరో మణిపూస చేరనుంది. జిల్లాలోని అడ్డాకుల వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాలోని అడ్డాకుల మండల కేంద్రం వద్ద ఎయిర్‌పోర్టు చేసేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాలమూరు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌–44), అతిపొడవైన రైల్వే మార్గం జిల్లాలో ఉన్నాయి. తాజాగా ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనతో జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్నో ఏళ్ల కల... 
జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. పారిశ్రామికంగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన రవాణా సౌకర్యాల విషయమై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అలాగే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి దేశీయ విమానాలు నడిపేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ విధానం, హైదరాబాద్‌కు అతి చేరువలో జిల్లా ఉన్న నేపథ్యంలో పలు కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్‌లు ఏర్పాటుచేయడానికి క్యూ కడుతున్నాయి. జిల్లాలో పుష్కలమైన మానవ వనరులకు తోడు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉన్న నేపథ్యంలో యాజమాన్యాలు సానుకూల స్పందన కనబరుస్తున్నాయి.

ఇందులో భాగంగా జాతీయ రహదారి పొడవున బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూరు, అడ్డాకల్‌ వరకు అనేక కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. అలాగే దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం భూసేకరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో పలు మార్లు ఎయిర్‌పోర్టు అంశం ప్రస్తావనకు రావడంతో. జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో సర్వే కూడా నిర్వహించారు. కానీ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి జడ్చర్ల పట్టణం అతి చేరువగా ఉండటంతో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. శంషాబాద్‌ నుంచి కనీసం 100 కి.మీ దూరంలో ఉండాలన్న నిబంధనతో ప్రభుత్వం అడ్డాకల్‌ వద్ద ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.

దశ మారనున్న అడ్డాకుల 
జిల్లాలో భారీ ఉపాధి అవకాశాల కల్పన కోసం అడ్డాకల్‌ వద్ద డ్రై పోర్ట్‌ ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యంత పొడవైన జాతీయ రహదారి మార్గం ఉంది. సరకు రవాణాకు అత్యంత సులువుగా ఉండటం కోసం డ్రై పోర్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే అంశాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సానుకూలత వ్యక్తం చేశారు. తాజాగా అడ్డాకల్‌లో ఎయిర్‌పోర్టు అంశాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించడంతో అడ్డాకుల మండలం అభివృద్ధిలో దూసుకుపోనుందని చెప్పొచ్చు. 

సీఎంకు కృతజ్ఞతలు.. 
పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌ చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు. కరువు, కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయమై రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అగ్రస్థానం కేటాయించారు. అదే విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా జిల్లాలోని అడ్డాకుల వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు  సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే డ్రైపోర్ట్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement