Yesudas
-
60 ఏళ్ల క్రితం తండ్రికి ఇచ్చిన మాట.. ఇప్పటికీ దాటని ఏసుదాస్
సినిమాకు ఆరో ప్రాణం పాట. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతి ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళి. గాయకుడుగా సర్వభాషి. ఈయన పాడారంటే ఆ చిత్రం ప్రత్యేకత సంతరించుకుంటుంది. తన మధురమైన కంఠంతో ఇప్పటి వరకు 40వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుది. 1980 ప్రాంతంలో ఈయన అత్యధికంగా పాటలను పాడారు. ఒక సమయంలో ఏసుదాస్ పాడని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదు. 8 జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులకు పొందారు. బుధవారం తన 84వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన చర్చకు ఆయన స్పందించారు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ముఖ్యంగా సంగీత రంగానికి చెందిన ఇళయరాజా కూడా ఓ జాతీయ పార్టీలో చేరారని, అలాంటిది ఇన్నేళ్లుగా ప్రఖ్యాత గాయకుడిగా రాణిస్తున్న మీరు రాజకీయ రంగ ప్రవేశం చేరకుండా పోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఏసుదాస్ బదులిచ్చారు. నిజం చెప్పాలంటే పలు రాజకీయ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. అయితే చిన్న వయసులోనే తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్లవద్దని గట్టిగా చెప్పారన్నారు. అప్పుడే తాను ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వెళ్లనని మాట ఇచ్చానన్నారు. అలా తన తండ్రికి ఇచ్చిన మాటను మీర దలుచుకోలేదని చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. కొందరు తన పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారని, తాను తోసిపుచ్చినట్లు చెప్పారు. ఇంకా చెప్పాలంటే తనకు ఇప్పటికే సోషల్ మీడియా ఖాతా కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. -
యేసుదాస్ కొడుకు ఇంట్లో చోరీ.. బంగారు, వజ్రాభరణాలు మాయం
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ యేసుదాసు ఇంట్లో భారీగా చోరీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ నివాసంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై విజయ్ భార్య దర్శన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నారు. -
స్వరరాగ గంగా ప్రవాహం
-
ఈ నెల 20న హైదరాబాద్‌లో ఏసుదాస్ పాటల కార్యక్రమం
-
పూసిందే ఆ పూల మాను నీ దీపంలో...
చిత్రం: నిరీక్షణ రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇళయరాజా గానం: కె. జె. ఏసుదాసు బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. అన్ని పాటల్లోకీ ‘సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే/ ఇన్ని యేల సుక్కల్లో నిన్ను నేనెతికానే’ నాకు బాగా నచ్చిన పాట. ఈ పాట షూటింగ్ బెంగళూరు జైలు అధికారుల అనుమతితో అక్కడ చేశాం. జైలు అధికారులు మాకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అక్కడి ఖైదీలు ఏయే పనులు ఎలా చేస్తారో దగ్గర నుంచి గమనించాక చిత్రం తీశారు బాలు మహేంద్ర.నేరస్థులంతా రాత్రుళ్లు జైలు లోపల ఉంటారు. పగటిపూట పనులు చేస్తుంటారు. కొందరు రాళ్లు కొడతారు, కొందరు చెట్లు నరుకుతారు, కొందరు సిమెంట్ పని చేస్తారు, కొందరేమో పనిచేస్తున్నవారికి గార్డ్స్‌తో పాటు మంచి నీళ్లు, ఆహారం సప్లయి చేస్తుంటారు. అవన్నీ దగ్గరుండి గమనించాం. అక్కడి ఖైదీల కథలు మా మనసులను కదిలించాయి, ఖైదీలంతా వారి స్వవిషయాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. ఎవరో చేసిన నేరానికి మేం బలయ్యామని వారు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ఏ నేరం చేయకుండా కూడా చాలామంది యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్నారు. భార్య వచ్చి ఏడాదికోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది. వారి గురించి ఎవరు పోరాడతారో అర్థం కాదు. ఈ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే కావడం యాదృచ్ఛికం. వాళ్లతో కలిసిపోయినట్లు ఉండటం కోసం నేను, బాలు మహేంద్రగారు జైలులో వారు ఆ రోజు ఏది తింటున్నారో తెలుసుకుని, అదే వంటకం చేయించుకుని తెచ్చుకుని తినేవాళ్లం. వారంతా దీపావళి పండుగ చేసుకున్నట్లే అనుభూతి చెందారు.‘పూసిందే ఆ పూలమాను నీ దీపంలో/ దాగిందే నా పేద గుండె నీ తాపంలో/ఊగానే నీ పాటలో ఉయ్యాలై/ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై/ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్లకు చేరం/తీరందీ నేరం’ అనే మొదటి చరణంలో తన ప్రియురాలిని తలచుకుంటూ కుమిలిపోతాడు కథానాయకుడు. ఆత్రేయ గారు స్వయంగా ఈ పాత్రలో ప్రవేశించి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో నేను దిగంబరంగా నటించడం చూసి కొందరు ఖైదీలు కన్నీరు కార్చారు. ‘అయ్యో! ఇంత పెద్ద ఆర్టిస్టు అయి ఉండి మీరు ఇలా నటించడమేంటి. ఏ తప్పూ చేయకుండా మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించారు. వాస్తవానికి దగ్గరగా ఉండటం కోసం చేస్తున్నానని చెబితే, వారు ‘మీలాగ ఏ హీరో కూడా నటించరండి’ అని వారు అనడం నాకు ఇంకా బాగా గుర్తు. ఆ జైలులో తెలుగు వారు, తమిళులు ఎక్కువగా ఉండటం వల్ల వారు నన్ను తేలికగా గుర్తించారు. అదొక చెప్పరాని అనుభూతి. వాళ్ల కష్టాలతో పోలిస్తే మనం చాలా హాయిగా ఉన్నట్లే అనుకున్నాను. జైలులో బయటివారికి రాత్రుళ్లు అనుమతి ఇవ్వరు కనుక, జైలు సీన్లన్నీ పగటిపూటే తీశారు. బాలు మహేంద్రగారి గురించి ఒక పూట కాదు ఒక పుస్తకం కూడా చాలదు చెప్పడానికి. ఆయన మంచి నటుడు కూడా. ఆయనకు ఆయనే సాటి. పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బంగారు పతకం సాధించిన బాలు మహేంద్ర కెమెరాతో మాయమంత్రాలు చేస్తారు. ‘తానాలే చేశాను నేను నీ స్నేహంలో/ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో/ఆనాటి నీ కళ్లలో నా కళ్లే / ఈనాటి నా కళ్లలో కన్నీళ్లే / ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగ వ్యర్థం/ చట్టందే న్యాయం’ అనే చరణంలో కథానాయిక అర్చనను ఒక బ్లాక్ క్రియోపాత్రాలాగ సృష్టించారు బాలూమహేంద్ర. కెమెరాలో నుంచి బయటకు వచ్చేస్తే, మామూలుగా ఉంది అర్చన. కెమెరాలో నుంచి చూస్తే మనం వివరించలేం.ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఊటీలో షూటింగ్ జరుగుతుండగా, మద్రాసు నుంచి ఒక పార్సిల్ వచ్చింది. జేసుదాసు స్వరంలో రికార్డు చేసిన ‘సుక్కల్లే తోచావే’ పాట క్యాసెట్ అది. ఆ పాట జేసుదాసు గొంతులో వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్యాసెట్టుతో పాటు ఒక ఉత్తరం ఉంది. బాలూ మహేంద్రగారిని ఉద్దేశిస్తూ, ‘డియర్ బాలూ, నేను నా జీవితంలో అద్భుతమైన పాటను నా శక్తి వంచన లేకుండా హార్ట్ అండ్ సోల్ పెట్టి పాడాను. మీరు చిత్రంలో అంతే అందంగా చూపించండి. నేను సినిమా చూస్తాను’ అని రాశారు. ఆ మాటలకు బాలు మహేంద్ర ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒక్క క్షణం పాటు కదలకుండా నిశ్చలంగా ఉండిపోయారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
సెల్ఫీ కాదు సెల్ఫిష్
స్మార్ట్ ఫోన్ యుగంలో అందరికీ ఫాస్ట్‌గా కనెక్ట్ అయిన ట్రెండ్ సెల్ఫీ. ఇదివరకు సెలబ్రిటీలు కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు. ఇప్పుడంతా సెల్ఫీమయం. కానీ స్టార్ సింగర్ ఏసుదాస్‌కి ఈ సెల్ఫీ ట్రెండ్ నచ్చినట్టు లేదు. అందుకేనేమో ‘సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారాయన. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ఏసుదాస్. ఆయన కనపడటంతో మీడియా, అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఓ అభిమాని తన ఫేవరెట్ సింగర్‌తో ఓ సెల్ఫీ తీసుకుందాం అనుకుని సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే ఏసుదాస్ ఆ సెల్ఫీ తీసుకున్న అభిమానిని ఫొటో డిలిట్ చేయమని అడిగారు. అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఆ ఫొటో డిలిట్ చేస్తూ ‘ఇది సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారు. దీన్నిబట్టి ఏసుదాస్‌కి సెల్ఫీ అంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. -
గాన కోవిదుడు ఏసుదాస్ ఆవేదన
-
ఆ ఆలయంలో పాడేందుకు అనుమతించండి: యేసుదాసు
సాక్షి, తిరువనంతపురం: లెజెండరీ సినీ గాయకుడు కేజే యేసుదాసు కేరళలోని ప్రఖ్యాత శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో తన గానామృతాన్ని పంచాలనుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో స్వరార్చన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దేవాలయ అధికారులకు లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీన దసరా పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ రోమన్-క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన యేసుదాసు ప్రత్యేక దూత ద్వారా తన లేఖను అధికారులకు పంపారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆలయ కమిటీ తీసుకోనుంది. హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారికి ఆలయంలో ప్రవేశముంటుందని ఆలయ కమిటీ చెప్తోంది. ఇక త్రిశూర్ జిల్లాలోని గురువాయూరప్పన్ ఆలయంలోకి ప్రవేశం కోసం సైతం యేసుదాసు ఎదురుచూస్తున్నారు. శ్రీకృష్ణుడైన గురువాయూరప్పపై అనేక పాటలు పాడినప్పటికీ.. ఇప్పటికీ తనకు ఆలయంలో ప్రవేశం కల్పించడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. గురువాయూరప్ప ఆలయంలో అన్యమతస్తులకు ప్రవేశం నిషిద్ధం. తన గాన గాంధర్వంతో సినీ సంగీతాన్ని ఏలిన యేసుదాసు 14 భాషల్లో లక్షకుపైగా పాటలను పాడారు. అయ్యప్ప స్వామి మొదలు అనేక మంది దేవుళ్లపై ఆయన పాడిన పాటలు శ్రోతలకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించాయి. -
వికసించిన పద్మాలు
-
వికసించిన పద్మాలు
• యేసుదాసు, జోషి, పవార్సహా ఏడుగురికి విభూషణ్ • మరో ఏడుగురికి పద్మభూషణ్ • ఇన్నాళ్లూ వెలుగులోకి రానివారికే ఈసారి పట్టం • జాబితాలో 19 మంది మహిళలు సహా 89 మంది న్యూఢిల్లీ: సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి (బీజేపీ), శరద్ పవార్ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్ జాబితాలో ఉన్నారు. వివిధ భాషల్లో 50వేలకు పైగా సినిమా పాటలు పాడిన యేసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాలకూ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలో.. దేశానికి, సమాజానికి విశేష సేవలందిస్తున్నా.. ఇన్నాళ్లుగా గుర్తింపునకు నోచుకోని గొప్పవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 18 వేల నామినేషన్లు (4వేలు ఆన్లైన్లో వచ్చాయి) రాగా అందులోనుంచి 89 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈసారి పద్మ అవార్డుల్లో మహిళలు 19 మంది, విదేశీయులు–ఎన్నారైలు ఐదుగురుండగా.. మరణానంతరం అవార్డులకు ఎంపికైనవారు ఆరుగురున్నారు. వైద్య, సామాజిక రంగంలో కృషిచేసినవారితోపాటు సంగీత దర్శకులు, గాయకులకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రామీ అవార్డు విజేత, మ్యుజీషియన్ విశ్వ మోహన్ భట్ పద్మ భూషణ్‌కు, గాయకులు కైలాశ్ ఖేర్, అనురాధ పౌడ్వాల్లను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. భారత శాస్త్రీయ సంగీతంలో భట్‌కు ప్రత్యేక స్థానముంది. పద్మశ్రీకి ఎంపికవటం పట్ల కైలాశ్ ఖేర్, పౌడ్వాల్‌లు హర్షం వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ శిష్యుడైన భట్ ‘మోహన వీణ’ అనే కొత్త రాగాన్ని సృష్టించారు. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులెవరికీ ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు సంజీవ్ కపూర్, కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్యకారుడు చెమంచేరి కున్హిరామన్ నాయర్ (100) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రియో ఒలింపిక్స్ తారలు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్లూ పద్మశ్రీ అందుకోనున్నారు. పద్మ విభూషణ్ 1. యేసుదాసు. 2. సద్గురు జగ్గీ వాసుదేవ్, 3. శరద్ పవార్, 4. మురళీ మనోహర్ జోషి, 5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, 6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం), 7. పీఏ సంగ్మా (మరణానంతరం) పద్మ భూషణ్ 1. విశ్వమోహన్ భట్, 2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, 3. తెహంతోన్ ఉద్వాదియా, 4. రత్న సుందర్ మహారాజ్, 5. స్వామి నిరంజనానంద సరస్వతి, 6. చో రామస్వామి (మరణానంతరం), 7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్) మట్టిలో మాణిక్యాలు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కార విజేతల్లో అనేక మంది ఇప్పటివరకు మనకు పెద్దగా పరిచయం లేని వారే. పేరు, ప్రతిష్టల కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో, అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్న వీరి వివరాలు క్లుప్తంగా... ⇔ కరీముల్ హక్ (52 ఏళ్లు): పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గుడి జిల్లాకు చెందిన ఈయన అంబులెన్స్ దాదాగా గుర్తింపు పొందారు. తేయాకు తోటల్లో పనిచేసే హక్ తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చారు. ఆపదలో ఉన్న వారికి 24 గీ7 సాయం అందిస్తున్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్సు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తలచి, అర్థించిన వారికి సాయం చేస్తున్నారు. ⇔ గిరీష్ భరద్వాజ్ (66 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈయన సామాజిక కార్యకర్త. మారుమూల గ్రామాల్లో నూటికి పైగా చిన్న చిన్న వంతెనలను నిర్మించి పల్లెలను పట్టణాలతో అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించి ‘సేతు బంధు’గా పేరు తెచ్చుకున్నారు. ⇔ అనురాధా కొయిరాలా (67 ఏళ్లు): నేపాల్‌కు చెందిన ఈమె 12 వేల మంది మహిళలను వ్యభిచార ముఠాల చెరల నుంచి విడిపించి, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరో 45 వేల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురి కాకుండా అడ్డుకోగలిగారు. ⇔ డా. సుబ్రతో దాస్ (51 ఏళ్లు): ‘హైవే మీసయ్య’గా పేరొందిన దాస్ గుజరాత్‌కు చెందిన వారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి వైద్య సేవలు అందించడానికి బాటలు వేసిన వారిలో ఈయన ఒకరు. లైఫ్‌లైన్ ఫౌండేషన్‌ను స్థాపించి 4 వేల కి.మీ జాతీయ రహదారుల పరిధిలో కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. ⇔ మీనాక్షి అమ్మ (76 ఏళ్లు): కేరళకు చెందిన మీనాక్షి ఏడేళ్ల వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకుని గత 68 ఏళ్లుగా ఇతరులకు నేర్పిస్తున్నారు. ‘కలరిపయట్టు’అనే యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు. ⇔ డా. మాపుస్కర్ (88 ఏళ్లు) : మహారాష్ట్రలోని పుణెకు దగ్గర్లోని దెహు గ్రామానికి చెందిన ఈయన 1960ల నుంచే ఆ పల్లెను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేశారు. ఈయనకు ‘స్వచ్ఛతా దూత్’అనే పేరుంది. ⇔ గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ (52 ఏళ్లు): గుజరాత్‌కు చెందిన ఈయన దివ్యాంగుడైన రైతు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆయన గ్రామం నేడు దానిమ్మ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీన్ని సాధించడానికి గెనాభాయ్ ఎనలేని కృషి చేశారు. అందుకే ఈయనకు ‘అనార్ దాదా’అనే పేరు కూడా ఉంది. ⇔ బల్వీర్ సింగ్ సీచేవాల్ (51 ఏళ్లు): పంజాబ్‌కు చెందిన బల్వీర్ సామాజిక కార్యకర్త. 160 కి.మీ పొడవైన కాలీ బీన్ అనే నదికి పునరుజ్జీవం తీసుకురావడానికి అక్కడి యువత, స్వచ్ఛంద సేవకులను ఆయన కదిలించారు. ఈయనకు రస్తేవాలే బాబా. సడకన్వాలే బాబా, ఎకో బాబా లాంటి పలు పేర్లున్నాయి. ⇔ బిపిన్ గంటారా (59 ఏళ్లు): ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలో గత 40 ఏళ్లుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.బిపిన్ సోదరుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్నారు. ⇔ సునితి సాలమన్: చెన్నైకి చెందిన వైద్యురాలైన ఈమె దేశంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించారు. 2015లో మరణించారు. ఆమె స్మృత్యర్థం కేంద్రం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. ⇔ భక్తి యాదవ్ (91 ఏళ్లు): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన తొలి మహిళ ఈమె. గత 68 ఏళ్లుగా ఇండోర్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి వేల మంది గర్భిణులకు కాన్పులు చేశారు. ⇔ సుక్రీ బొమ్మగౌడ (58 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈమె జానపద గాయకురాలు. ‘నైటింగేల్ ఆఫ్ హళక్కి’గా గుర్తింపు పొందారు. ⇔ జితేంద్ర హరిపాల్: ఒడిశాకు చెందిన ఈయన ‘రంగబతీ కీ ఆవాజ్’పేరుతో ప్రాచుర్యం పొందారు. ఒడిశాలో బాగా పాపులర్ అయిన రంగబతీ పాట కోసం ఈయన ఎంతో శ్రమించారు. కోస్లి–సంబాల్‌పురి సంగీతానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ⇔ ఎలా అహ్మద్ (81 ఏళ్లు): అస్సాంకు చెందిన వీరు 1970 నుంచి మహిళల కోసం ప్రత్యేక మేగజీన్ నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఒకే ఒక్క మహిళా మేగజీన్ ఇదే. -
సెంచరీలతో చెలరేగిన యేసుదాస్, స్వామి
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఎంపీ బ్లూస్ బ్యాట్స్‌మెన్ యేసుదాస్ (102), జె. స్వామి (124) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో యూత్ సీసీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎంపీ బ్లూస్ జట్టు 175 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ బ్లూస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 315 పరుగులు చేసింది. యేసుదాస్, స్వామి సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో వినోద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 316 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూత్‌సీసీ జట్టు 30 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రాజ్ కుమార్ (31) టాప్ స్కోరర్. ఎంపీ బ్లూస్ బౌలర్లలో వెంకట్ 3 వికెట్లు తీసుకోగా... సిద్ధార్థ్, సునీల్, యేసుదాస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
అయ్యప్ప పాదాల చెంత జేసుదాసు..!
ప్రఖ్యాత శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ గాయకుడు జేసుదాసు గురువారం 'హరిహరాసనం' పాటను ఆలపించారు. ఓనం పండుగ చివరిరోజు సందర్భంగా 'కన్నీ' వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుడు జేసుదాసు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు ఆ స్వామి మూర్తి ముందు 'హరిహరాసనం' పాటను పాడారు. ఆయనతోపాటు ఇతర భక్తులు జతకలిసి గానం చేశారు. ఆలయం సంప్రదాయంలో భాగంగా అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు 'హరివరాసనం' గీతాన్ని ఆలపిస్తారు. 1950లో కుంబకుడి కులథూర్ అయ్యర్ అనే రచయిత ఈ 'హరిహరసుధాష్టకాన్ని' రచించారు. ఈ గీతాన్ని ఎంతోమంది గాయకులు పాడినప్పటికీ, జేసుదాసు తన మధురగానంతో భక్తిసుధలో ఓలలాడించారు. ఆయనకు 'హరిహరాసనం' పాట అజరామరమైన కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ పాట పూర్తి పాఠం ఇలా ఉంటుంది.. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహరాసనం స్వామి విశ్వమోహనం హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శరణకీర్తనం స్వామి శక్తిమానసం భరణతోలుకం స్వామి నర్తనాలసం ఆరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || తుర్గవాహనం స్వామి సుందరానానం వరగదాయుధం స్వామి దేవవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళావాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || కలమృదుస్మీతం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || -
నేను విద్వాంసుణ్ణి కాదు.. నిత్య విద్యార్థిని : కేజే ఏసుదాసు
‘‘మా నాన్నే నా తొలి గురువు. ఐదో ఏట సంగీత సాధన ప్రారంభించా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ఎప్పుడైతే మనకన్నీ తెలుసనుకుంటామో అక్కడితో మన వృద్ధి ఆగినట్లే. నేను నిత్య విద్యార్థినే.. విద్వాంసుణ్ణి కాదు. ఇతర భాషల సంస్కృతి నేర్చుకున్నప్పటికీ.. మన భారతీయ సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి. మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి’’ అని ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు అన్నారు. ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మనలో ఒకడు’. గురజాల జగన్మోహన్ నిర్మాత. ఆర్పీనే స్వరకర్త. పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో తిరుపతిలో మిలియన్ క్లిక్స్ వేడుక పేరుతో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఏసుదాసు హాజరయ్యారు. ‘‘ఇప్పుడు ప్రేక్షకులు సీడీల కంటే క్లిక్స్కి అలవాటు పడ్డారు. మిలియన్ క్లిక్స్ అంటే రెండున్నర లక్షల సీడీలు అమ్ముడ యినట్లే’’ అని ఆర్పీ అన్నారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్ర నిర్మాత జగన్మోహన్, పాటల రచయితలు చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు ఉమేశ్గౌడ, బాలసుబ్రమణ్యం, క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మనలో ఒక్కడు కోసం ఏసుదాస్
ఆర్పీ పట్నాయక్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మనలో ఒకడు’. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హీరోయిన్. ఆర్పీనే స్వరకర్త. ఈ నెల 27న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత గానగంధర్వుడు కేజే ఏసుదాస్ మా సినిమాలో ఓ పాట పాడడం ఆనందంగా ఉంది. ఆయన పాడిన ‘కలి కలి కలికాలం..’ పాటను వనమాలి రాశారు’’ అన్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ పాత్రలో ఆర్పీ నటిస్తున్నారు. ఆర్పీ ‘బ్రోకర్’ని మించేలా ఉంటుందీ సినిమా’’ అని జీసీ జగన్మోహన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, పాటలు: వనమాలి, చైతన్యప్రసాద్, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్ధ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రమణ్యం. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఏసుదాసు(47) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని రోజులుగా భార్య రత్నమ్మతో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్ ఏసుదాస్‌కు నో చెప్పా
మారి చిత్రంలో ప్రఖ్యాత గాయకుడు ఏసుదాస్ వారసుడు విజయ్ ఏసుదాస్‌ను నటుడిగా ఎంపిక చేద్దాం అంటే నేను వద్దు అన్నానని నటుడు ధనుష్ తెలిపారు. ఈయన నటించిన తాజా చిత్రం మారి. మ్యాజిక్ ప్రేమ్స్ ఉండర్‌బార్ ఫిలింస్ సంస్థలపై శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో నటుడు ధనుష్ పాలు పంచుకోవడం గమనార్హం. వాయై మూడి పేసవుం చిత్రం ఫేమ్ బాలాజీ మోహన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా గురువారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు ధనుష్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం దర్శకుడు బాలాజీ మోహన్ మూడు స్క్రిప్టులను తనకు ఇచ్చి ఏదినచ్చితే ఆ కథతో చిత్రం చేద్దాం అన్నారన్నారు. అందులో తాను ఎంపిక చేసుకున్న కథే ఈ మారి చిత్రం అన్నారు. బాలాజి మోహన్ ఇంతకుముందు లవ్ తదితర చిత్రాలు చేశారన్నారు. అయితే ఆయనతో పూర్తి కమర్షియల్ దర్శకుడు ఉన్నాడన్నది మారి చిత్రంతో రుజువవుతుందన్నారు. నిజం చెప్పాలంటే తాను ఇంటి కథ కోసం చాలాకాలంగా ఎదురు చూశానని అన్నారు. అనిరుధ్ సంగీతం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. పాటల కన్నా నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ కాజల్‌కు నటనకు అవకాశం ఉన్న పాత్ర అని ఆమె చక్కగా నటించారని కితాబిచ్చారు. ఇక ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రకు దర్శకుడు విజయ్ ఏసుదాస్‌ను ఎంపిక చేద్దాం అన్నప్పుడు తానువద్దని చెప్పానన్నారు. ఆయన తనకు చాలా కాలంగా తెలుసు. చాలా సాఫ్ట్‌గా ఉంటారు. చిత్రంలో పాత్రకు నప్పుతారని అన్నారన్నారు. అయినా ఒకసారి ఆలోచించండి అని దర్శకుడు అన్నారన్నారు. అయితే చిత్రం చూసిన తరువాత దర్శకుడి ఆలోచనలు ఎంత కరెక్ట్‌గా ఉంటాయో అర్థమైంది. చిత్రంలో విజయ్ ఏసుదాస్ చాలా బాగా నటించారని ఆయన తెలిపారు. సమావేశంలో దర్శకుడు బాలాజీమోహన్, విజయ్ ఏసుదాస్, అనిరుధ్, శరత్ కుమార్ పాల్గొన్నారు. -
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా...యేసుదాసు
-
స్వర ప్రవాహం
-
ఖగోళ అవిశ్వాసి
దైవికం కేసీఆర్‌కి, కేజే యేసుదాస్కీ, స్టీఫెన్ హాకింగ్కీ ఏం సంబంధం లేదు. లేదా మనకు తెలియకుండా ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ ఎప్పుడైనా ఏకాంతంలో యేసుదాస్ పాటలు విని ఉండొచ్చు. యేసుదాస్ ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో సమయం దొరికినప్పుడు స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పుస్తకం పేజీలు తిప్పి ఉండొచ్చు. స్టీఫెన్కైతే అలాంటి సంబంధం కూడా ఉండే అవకాశం లేదు. కేసీఆర్ మాటలు, యేసుదాస్ పాటలు వినే సందర్భం స్టీఫెన్ జీవితంలో ఎప్పుడైనా ఏర్పడి ఉంటుందని అనుకోలేం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. యేసుదాస్ దివ్య గాయకుడు. స్టీఫెన్ హాకింగ్ విశ్వరహస్యాలు ఛేదిస్తున్న ఖగోళ శాస్త్రవేత్త. అయితే ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని ఈ మూడు రంగాల వారు ఇటీవల తమ మాటల కారణంగా అంతెత్తునుంచి కిందపడి మామూలు మనుషులుగా అవతరించారు! ‘కిందపడడం’ అనే విషయంలో ఒకరితో ఒకరు సంబంధం ఉన్నవారయ్యారు. ‘‘ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తా’’ అన్నారు కేసీఆర్! మంచిమాటే.. ఆకతాయిల్ని భయపెట్టడానికి. కానీ అంతకంటే (మాటలకంటే) మంచివైన చట్టాలు ఉన్నాయి కదా మనకు. వాటిని కచ్చితంగా అమలు చేస్తాం అనో, మరింత కఠినమైన చట్టాల్ని తెస్తాం అనో అనాలి నిజానికైతే. చట్టాలు ఉన్నప్పుడు, ఆ చట్టాల్లో లేని శిక్షలు విధిస్తాం అనడంలోని అంతర్యం ఏమిటి? ఏమీ లేకపోవచ్చు. కేసీఆర్ మాటలు వినబుద్ధేస్తాయి. ఆ సంగతి ఆయనకూ తెలుసు కాబట్టే అలా మాట్లాడారేమో! ఇక యేసుదాస్. ‘‘ఆడపిల్లలు జీన్స్ వేసుకోవడం తగదు’’ అని ఇటీవల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంగీతాన్ని వదిలేసి సంప్రదాయాల గొడవల్లోకి వచ్చి పడ్డారు పాపం ఆయన. దేవరాగాన్ని ఒలికించే ఆ స్వరంలో దెయ్యపు పలుకులేమిటని దక్షిణ భారతదేశం నివ్వెరపోయింది. ‘‘కళ్లు పీకేయిస్తా’’ అని కేసీఆర్ అన్న మాటలాంటిదే ఇది కూడా. ‘మన సంస్కృతీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే కళ్లుపోతాయి’ అన్నంతగా యేసుదాస్ మాటల్లో ఆందోళన వ్యక్తమయింది! యేసుదాస్ అనగానే ఇప్పుడు స్వరాలకు బదులు వస్త్రాలు గుర్తొచ్చేస్తున్నాయందుకే. స్టీఫెన్ హాకింగ్ పరిధి వేరు. అది విస్తృతమైనది. విశ్వవ్యాప్తమైనది. కేసీఆర్‌లా, యేసుదాస్లా కాదు. ఆయన మరింత బాధ్యతగా మాట్లాడాలి. గతంలో చాలాసార్లు ఆయన ‘‘నాకు దేవుడు లేడు’’ అన్నాడు కానీ, ‘‘దేవుడు లేడు’’ అనలేదు. కానీ ఇటీవల ఆ మాట కూడా అనేశారు! ‘‘సైన్స్ అర్థమయ్యే దాకా దేవుడిపై మనిషికి నమ్మకం ఉండడం సహజమే’’ అని కానరీ ఐలండ్స్ (స్పెయిన్)లో ఈమధ్య జరిగిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర ఉత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ స్టీఫెన్ అన్నారని అమెరికా నుంచి వెలువడే ‘హఫింగ్టన్ పోస్ట్’ అనే ఆన్లైన్ వార్తా కూడలి ప్రచురించగానే ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ పని చేయలేని వారు సున్నితమైన మాటలతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేవుడితో పోల్చిచూస్తే, విశ్వానికి సంబంధించిన సందేహాలకు సైన్స్ ఎంతో నమ్మశక్యమైన సమాధానాలను ఇస్తోంది’’ అని స్టీఫెన్ అనడం కూడా భక్తిపరులను బాధించింది. అంటే దేవుడు లేడనా, ఉన్నా సమాధానాలు ఇవ్వలేడనా అని వారి ప్రశ్న. స్టీఫెన్ అక్కడితో ఆగలేదు. 1988నాటి తన పుస్తకం ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’లోని ‘వియ్ వుడ్ నో ద మైండ్ ఆఫ్ గాడ్’ అనే వాక్యం ఉన్న భాగానికి అర్థ వివరణ ఇస్తూ, ‘‘దేవుడు గనుక ఉన్నట్లయితే, దేవుడికి తెలిసిన ప్రతిదీ మనుషులకు తెలిసి తీరుతుంది. అయితే దేవుడు లేడు’’ అన్నారు. ‘‘దేవుణ్ణి నమ్మను’’అని ఎప్పటిలా ఒక్క మాటతో సరిపెట్టి ఉంటే స్టీఫెన్ గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. విశ్వం గురించి ఇంత తెలుసుకున్న ఈ థియరిటికల్ ఫిజిసిస్టు, దేవుడిపై మనిషి విశ్వాసాన్ని ఆ విశ్వంలో ఒక భాగంగా ఎందుకు చూడలేకపోయారో? బహుశా విశ్వాసం కూడా ఒక గోళంగా కనిపించాలేమో ఈయనకు ఆకాశంలో. ‘‘మైండ్‌తో కాదు మై డియర్ భౌతిక శాస్త్రవేత్తా... హృదయంతో ఆలోచించు. అప్పుడు దేవుడు కనిపిస్తాడు’’ అని ఎవరో సలహా ఇచ్చారు స్టీఫెన్ హాకింగ్కి. కళ్లు పీకేయిస్తానని కేసీఆర్, జీన్స్ తొడుక్కోవద్దని యేసుదాస్ అన్నందు వల్ల పెద్ద నష్టం లేదు. కానీ స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లు అలా మాట్లాడకూడదు. మనిషి మేధస్సుకు దీర్ఘకాలిక విలువ లేదేమోనని ఒకప్పుడు అనుమానంలో పడిన స్టీఫెన్, ఐక్య క్షేత్రీయ సిద్ధాంతం (యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ) తో దేవుడి ఉనికిని, ఉద్దేశాలను కనిపెట్టేందుకు ప్రయత్నించిన స్టీఫెన్... చివరికొచ్చేసరికి మనుషుల నమ్మకాలను, విశ్వాసాలను తేలికపరిచే వ్యాఖ్యలు చేయడమంటే ‘సైన్సును నమ్మకుంటే దేవుడు క్షమించడు’ అని బెదిరించడమే! - మాధవ్ శింగరాజు -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - యేసుదాస్
-
దేవుడు తప్ప ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు..!
భక్తి పాట, సినిమా పాట... ఏ పాటకైనా ఏసుదాస్ గాత్రం ఇట్టే ప్రాణం పోసేస్తుంది. ఇక ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఆయన ఉచ్చారణ ఉంటుంది. స్వతహాగా క్రైస్తవుడు అయినా, ఆయన పాడిన హైందవ భక్తి గీతాలను వింటే, ఎవరికైనా భక్తిభావం పుట్టుకు రావాల్సిందే. 16 భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఏసుదాస్ది. గత 50 ఏళ్లుగా సంగీత ప్రపంచంలో తిరుగులేని గాయకునిగా విరాజిల్లుతున్న ఈ గంధర్వ గాయకుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఏసుదాస్ మనోభావాలు ఈ విధంగా... 1961 నవంబర్ 14ని నేనెప్పటికీ మర్చిపోలేను. చెన్నయ్‌లోని భరణి స్టూడియోలో నా తొలి సినిమా పాట రికార్డ్ చేసిన రోజది. సంగీతదర్శకుడు ఎం.బి. శ్రీనివాసన్‌గారు స్వరపరచిన పాటను పాడాను. అదొక ప్రేమ పాట. ఎవరైనా సులువుగా పాడొచ్చు. కానీ, నాకంత ఈజీ అవ్వలేదు. ఎందుకంటే, అప్పుడు నాకు టైఫాయిడ్. దానివల్ల గొంతులో సన్నని వణుకు. దాంతో శ్రీనివాసన్‌గారు రిహార్సల్ చేయమన్నారు. అప్పటికి నాకు రిహార్సల్ అంటే ఏంటో కూడా తెలియదు. అది ఓ శ్లోకంలా ఉంది. మళ్లీ పాడాను. అద్భుతంగా వచ్చింది. శ్రీనివాసన్‌గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మొదటిసారి పాడుతున్నట్లు నాకనిపించలేదు. అందుకని పాడేశాను. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. నాకు చిన్నప్పట్నుంచీ ‘కల్యాణి’ రాగం అంటే ఇష్టం. ఎవరైనా పాట పాడమని అడిగితే, అదే పాడేవాణ్ణి. కానీ, ప్రతి రాగానికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుందని ఆ తర్వాత తెలుసుకున్నాను. అప్పట్నుంచీ అన్ని రాగాలూ పాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు నేనెలాంటి భయం లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో 72 మేళకర్త రాగాలు పాడగలను. దేవుడు తప్ప ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కానీ, ఓ సింగర్‌కి పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే.. ఓ పాట పాడుతున్నప్పుడు తను పాడుతున్నానని మర్చిపోగలిగినప్పుడు. ఓ పాట పాడుతున్నప్పుడు నేను స్వరాలలో లీనమైపోతాను. ఓ పర్టిక్యులర్ వైబ్రేషన్ నాలో కలుగుతుంది. ఆ సమయంలో నేనా దేవుడికి దగ్గరవుతా. అప్పుడు లభించే సంతృప్తిని దేనితోనూ వెలకట్టలేం. మనమంతా భారతీయులం. మానవులుగా పుట్టాం. నేను పుట్టినప్పుడు ఏమీ కాను. ఒక పసిపిల్లాణ్ణి. ఓసారి మా అమ్మానాన్న నన్ను చర్చికి తీసుకెళితే, ఫాదర్ నన్ను ఆశీర్వదించారు. ఓసారి మా చర్చి ఫాదర్ క్రిస్టియన్లు మాత్రమే స్వర్గానికి వెళతారని చెప్పారు. అప్పుడు చంద్రన్, తిలకన్.. ఇలా ఇతర మతాలకు చెందిన నా స్నేహితులు స్వర్గానికి వెళ్లరా? అనిపించింది. కాలక్రమేణా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే, ఏ మతమైతే ఏంటి? అనిపించేంత మానసిక పరిపక్వత వచ్చింది. కేరళలోని తిరుపునితురాలో మధురై మణిగారి కచ్చేరీలు జరిగేవి. అప్పుడు నాకు శబరి టెంపుల్‌కి వెళ్లి ఆయన పాటలు వినాలని ఉండేది. కానీ, గుడి లోపలికి అడుగుపెట్టకూడదని ఓ స్నేహితుడు అనడంతో బయట నిలబడే పాటలు విన్నాను. ఆ తర్వాత గుడి అధికారులకు నేను గుడిలోకి రావాలనుకుంటున్నానని లేఖ రాశాను. ఉపవాస దీక్షలు చేసినవారెవరైనా రావచ్చన్నారు. ఆ అయ్యప్ప ఓ అద్వైత మూర్తి. తనకు భేదభావాలు లేవు. అందుకేనేమో నేను ఆయన గుడికి వెళ్లగలిగాను. నేను నిత్యవిద్యార్థిని. సంగీతానికి సంబంధించిన సమస్తమూ నేర్చుకోవడానికి ఒక్క జన్మ సరిపోదు. నాకు మరుజన్మ ఉంటే అప్పుడూ సంగీత సాధనలోనే ఉండాలని కోరుకుంటున్నా. అదికూడా ఈ జన్మలో ఎక్కడైతే నా సంగీతం ముగిసిందో అక్కణ్ణుంచి మరుజన్మ మొదలవ్వాలి. అలా కాకుండా మళ్లీ మొదట్నుంచీ మొదలుపెట్టేలా ఆ దేవుడు నిర్ణయిస్తే ఇంకో జన్మ వద్దనుకుంటున్నా.