నేను విద్వాంసుణ్ణి కాదు.. నిత్య విద్యార్థిని : కేజే ఏసుదాసు
‘‘మా నాన్నే నా తొలి గురువు. ఐదో ఏట సంగీత సాధన ప్రారంభించా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ఎప్పుడైతే మనకన్నీ తెలుసనుకుంటామో అక్కడితో మన వృద్ధి ఆగినట్లే. నేను నిత్య విద్యార్థినే.. విద్వాంసుణ్ణి కాదు. ఇతర భాషల సంస్కృతి నేర్చుకున్నప్పటికీ.. మన భారతీయ సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి. మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి’’ అని ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు అన్నారు. ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మనలో ఒకడు’.
గురజాల జగన్‌మోహన్ నిర్మాత. ఆర్పీనే స్వరకర్త. పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో తిరుపతిలో మిలియన్ క్లిక్స్ వేడుక పేరుతో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఏసుదాసు హాజరయ్యారు. ‘‘ఇప్పుడు ప్రేక్షకులు సీడీల కంటే క్లిక్స్‌కి అలవాటు పడ్డారు. మిలియన్ క్లిక్స్ అంటే రెండున్నర లక్షల సీడీలు అమ్ముడ యినట్లే’’ అని ఆర్పీ అన్నారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్ర నిర్మాత జగన్‌మోహన్, పాటల రచయితలు చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు ఉమేశ్‌గౌడ, బాలసుబ్రమణ్యం, క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.