Manalo Okkadu
-
నేను విద్వాంసుణ్ణి కాదు.. నిత్య విద్యార్థిని : కేజే ఏసుదాసు
‘‘మా నాన్నే నా తొలి గురువు. ఐదో ఏట సంగీత సాధన ప్రారంభించా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ఎప్పుడైతే మనకన్నీ తెలుసనుకుంటామో అక్కడితో మన వృద్ధి ఆగినట్లే. నేను నిత్య విద్యార్థినే.. విద్వాంసుణ్ణి కాదు. ఇతర భాషల సంస్కృతి నేర్చుకున్నప్పటికీ.. మన భారతీయ సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి. మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి’’ అని ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు అన్నారు. ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మనలో ఒకడు’. గురజాల జగన్మోహన్ నిర్మాత. ఆర్పీనే స్వరకర్త. పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో తిరుపతిలో మిలియన్ క్లిక్స్ వేడుక పేరుతో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఏసుదాసు హాజరయ్యారు. ‘‘ఇప్పుడు ప్రేక్షకులు సీడీల కంటే క్లిక్స్కి అలవాటు పడ్డారు. మిలియన్ క్లిక్స్ అంటే రెండున్నర లక్షల సీడీలు అమ్ముడ యినట్లే’’ అని ఆర్పీ అన్నారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్ర నిర్మాత జగన్మోహన్, పాటల రచయితలు చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు ఉమేశ్గౌడ, బాలసుబ్రమణ్యం, క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదు'
తిరుచానూరు: తన ఐదో ఏట నుంచి ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నానని, తాను నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదని సీనీ నేపథ్యగాయకుడు, కర్ణాటక సంగీత విద్వాంసులు కేజే ఏసుదాస్ అన్నారు. యూనిక్రాఫ్ట్ బ్యానర్‌పై చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్మోహన్ నిర్మించిన మనలో ఒకడు సినిమా మిలియన్ క్లిక్స్ డిస్క్‌ను సోమవారం సాయంత్రం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత, సినీ నేపథ్య గాయకులు కేజే ఏసుదాస్‌ను ఈ సందర్భంగా మనలో ఒకడు సినిమా యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతి రోజు సాధన చేయాలని, అలా చేసినప్పుడే భగవంతుని ఆశీస్సులు తోడై రాణించగలుగుతామన్నారు. గురువుల ఆశీర్వాదం, శ్రోతల అభిమానం, దేవుని ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు అంది, ఆయురారోగ్యం కలగాలని ప్రార్థిస్తూ పఠించిన శ్లోకం శ్రోతలను అలరించింది. అనంతరం ఏసుదాస్ చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు షీల్డ్‌లను అందజేశారు. వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, వైఎస్సార్ సీపీ నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, నేపథ్య గాయనీగాయకులు సునీత, శ్రవణభార్గవి, హేమచంద్ర, సినిమా సహ నిర్మాతలు ఉమేష్‌గౌడ్, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. -
వాస్తవాలను చూడటంలేదు
- ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరోసారి ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన చిత్రం ‘మనలో ఒకడు’. ‘నువ్వు నేను’ ఫేం అనిత కథానాయిక. జీసీ జగన్మోహన్ నిర్మాత. ఈ చిత్రం పాటల సీడీని ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. నటుడు గొల్లపూడి మారుతీ రావు మాట్లాడుతూ-‘‘ కత్తి కంటే కలం పదునైంది అంటారు. కానీ, ఆ రెండింటి కంటే సినిమా ఇంకా పదునైంది. మీడియాకు సామాజిక స్పృహ అన్నది ఓ బాధ్యత. ఇందులో వ్యాపారం కలిసి ఉండటం వల్ల ఆ బాధ్యత తగ్గుతోంది. దీన్ని కథాంశంగా తీసుకుని ప్రజలకు ఎత్తి చూపడం అభినందనీయం’’ అని పేర్కొన్నారు. ‘‘మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో కోణాన్ని చూపిస్తుంటారు. కానీ, వాస్తవాలను చూడడం లేదు. దీంతో మీడియాలో వచ్చేది న్యూస్ కాదు, వ్యూస్ అని అందరూ అనుకుంటున్నారు’’ అని ఎంపీ కె.కవిత అన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం మీడియాపై తీసినా చాలా మంది మీడియా మిత్రుల నుంచి అభినందనలు వచ్చాయి. మీడియా రంగంలోని ఈగో ఫ్యాక్టర్‌ను ప్రశ్నించాలని ఈ చిత్రం చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు జగన్మోహన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరోయిన్ అనిత, దర్శకుడు చంద్ర సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. -
మనలో ఒక్కడు కోసం ఏసుదాస్
ఆర్పీ పట్నాయక్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మనలో ఒకడు’. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హీరోయిన్. ఆర్పీనే స్వరకర్త. ఈ నెల 27న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత గానగంధర్వుడు కేజే ఏసుదాస్ మా సినిమాలో ఓ పాట పాడడం ఆనందంగా ఉంది. ఆయన పాడిన ‘కలి కలి కలికాలం..’ పాటను వనమాలి రాశారు’’ అన్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ పాత్రలో ఆర్పీ నటిస్తున్నారు. ఆర్పీ ‘బ్రోకర్’ని మించేలా ఉంటుందీ సినిమా’’ అని జీసీ జగన్మోహన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, పాటలు: వనమాలి, చైతన్యప్రసాద్, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్ధ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రమణ్యం.