'నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదు'
తిరుచానూరు: తన ఐదో ఏట నుంచి ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నానని, తాను నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదని సీనీ నేపథ్యగాయకుడు, కర్ణాటక సంగీత విద్వాంసులు కేజే ఏసుదాస్ అన్నారు. యూనిక్రాఫ్ట్ బ్యానర్‌పై చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్ నిర్మించిన మనలో ఒకడు సినిమా మిలియన్ క్లిక్స్ డిస్క్‌ను సోమవారం సాయంత్రం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత, సినీ నేపథ్య గాయకులు కేజే ఏసుదాస్‌ను ఈ సందర్భంగా మనలో ఒకడు సినిమా యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతి రోజు సాధన చేయాలని, అలా చేసినప్పుడే భగవంతుని ఆశీస్సులు తోడై రాణించగలుగుతామన్నారు. గురువుల ఆశీర్వాదం, శ్రోతల అభిమానం, దేవుని ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు అంది, ఆయురారోగ్యం కలగాలని ప్రార్థిస్తూ పఠించిన శ్లోకం శ్రోతలను అలరించింది. అనంతరం ఏసుదాస్ చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు షీల్డ్‌లను అందజేశారు.
వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, వైఎస్సార్ సీపీ నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, నేపథ్య గాయనీగాయకులు సునీత, శ్రవణభార్గవి, హేమచంద్ర, సినిమా సహ నిర్మాతలు ఉమేష్‌గౌడ్, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.