K J Yesudas
-
ఏసుదాస్ కల నెరవేరబోతోంది..
తిరువనంతపురం : ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాస్ కల నెరవేరబోతోంది. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రవేశానికి, ప్రత్యేక పూజలకు పూజలకు అవకాశం కల్పించాలని జన్మతః క్రైస్తవుడైన ఏసుదాస్ ఆలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తనకు హిందూమతంపై పూర్తి విశ్వాసం ఉందని, పద్మనాభుని దర్శించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు నియమించిన ఆలయ వ్యవహారాల మండలి దీనిపై సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఏసుదాస్‌ను ఆలయంలోకి అనుమతించాలని తీర్మానించింది. ఆయన ఎప్పుడైనా ఆలయంలోకి రావచ్చని ఈ సందర్భంగా మండలి తెలిపింది. అయితే, ఈ నెల 30వ తేదీన( దసరా రోజు) ఆయన పద్మనాభుని దర్శించుకుంటారని ఏసుదాస్ తరపు ప్రతినిధి తెలిపారు. హిందూమతంపై విశ్వాసం ప్రకటించే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కర్ణాటకలోని మూకాంబిక ఆలయానికి, శబరిమలైలోని అయ్యప్పస్వామి ఆలయానికి ఆయన ఏటా వెళ్లి పూజలు చేస్తుంటారు. అయితే, మలప్పురంలోని కదంప్పుజా దేవి ఆలయం, గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలోనికి ఆయన ప్రవేశాన్ని అక్కడి అధికారులు నిరాకరించారు. అందుకే ఏసుదాస్ పద్మనాభస్వామి ఆలయ అధికారులకు ముందుగా విజ్ఞాపన పంపారు. ఏసుదాస్ వందలాదిగా హిందూ సంప్రదాయ కీర్తనలు, గీతాలు ఆలపించారు. -
ఏసుదాస్ కల నెరబోతోంది..
-
'నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదు'
తిరుచానూరు: తన ఐదో ఏట నుంచి ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నానని, తాను నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదని సీనీ నేపథ్యగాయకుడు, కర్ణాటక సంగీత విద్వాంసులు కేజే ఏసుదాస్ అన్నారు. యూనిక్రాఫ్ట్ బ్యానర్‌పై చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్మోహన్ నిర్మించిన మనలో ఒకడు సినిమా మిలియన్ క్లిక్స్ డిస్క్‌ను సోమవారం సాయంత్రం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత, సినీ నేపథ్య గాయకులు కేజే ఏసుదాస్‌ను ఈ సందర్భంగా మనలో ఒకడు సినిమా యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతి రోజు సాధన చేయాలని, అలా చేసినప్పుడే భగవంతుని ఆశీస్సులు తోడై రాణించగలుగుతామన్నారు. గురువుల ఆశీర్వాదం, శ్రోతల అభిమానం, దేవుని ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు అంది, ఆయురారోగ్యం కలగాలని ప్రార్థిస్తూ పఠించిన శ్లోకం శ్రోతలను అలరించింది. అనంతరం ఏసుదాస్ చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు షీల్డ్‌లను అందజేశారు. వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, వైఎస్సార్ సీపీ నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, నేపథ్య గాయనీగాయకులు సునీత, శ్రవణభార్గవి, హేమచంద్ర, సినిమా సహ నిర్మాతలు ఉమేష్‌గౌడ్, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. -
కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి
ఇండోర్:మహిళల వస్త్రధారణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడ్డారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలతో మహిళలను తక్కువ చేసినట్లేనని ఆమె విమర్శించారు.' ఇది నిజంగా దురదృష్టం. మహిళలు ఏది ధరించాలి. ఏది ధరించకూడదు' అని పేర్కొనడం సమాజానికే సిగ్గు చేటన్నారు. దేశం పురోగమనం సాధిస్తున్న దశలో ఈ వ్యాఖ్యలు ప్రముఖ స్థానంలో వ్యక్తి చేయడం బాధాకరమన్నారు. '21 టోపాన్ కీ సలామీ' చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేసిన నేహా ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు జీన్స్ ధరించడాన్ని యేసుదాసు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. -
'మహిళలు జీన్స్ ధరించడం సంస్కృతికి విరుద్ధం'
తిరువనంతపురం: మహిళల వస్త్రధారణకు సంబంధించి ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాసు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీజయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యేసుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు జీన్స్ ధరించడాన్ని తప్పుబట్టారు. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. యేసుదాసు వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛను హరించడం కిందకే వస్తాయని ఆరోపించారు. యేసుదాసు దేశం గర్వించదగ్గ గాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమన్నారు.