'మహిళలు జీన్స్ ధరించడం సంస్కృతికి విరుద్ధం'
తిరువనంతపురం: మహిళల వస్త్రధారణకు సంబంధించి ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాసు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీజయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యేసుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు జీన్స్ ధరించడాన్ని తప్పుబట్టారు. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు.
నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. యేసుదాసు వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛను హరించడం కిందకే వస్తాయని ఆరోపించారు. యేసుదాసు దేశం గర్వించదగ్గ గాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమన్నారు.