ఏసుదాస్ కల నెరవేరబోతోంది..
ఏసుదాస్ కల నెరవేరబోతోంది..
Published Tue, Sep 19 2017 4:13 PM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
తిరువనంతపురం : ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాస్ కల నెరవేరబోతోంది. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రవేశానికి, ప్రత్యేక పూజలకు పూజలకు అవకాశం కల్పించాలని జన్మతః క్రైస్తవుడైన ఏసుదాస్ ఆలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తనకు హిందూమతంపై పూర్తి విశ్వాసం ఉందని, పద్మనాభుని దర్శించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు నియమించిన ఆలయ వ్యవహారాల మండలి దీనిపై సోమవారం సమావేశమైంది.
ఈ సమావేశంలో ఏసుదాస్‌ను ఆలయంలోకి అనుమతించాలని తీర్మానించింది. ఆయన ఎప్పుడైనా ఆలయంలోకి రావచ్చని ఈ సందర్భంగా మండలి తెలిపింది. అయితే, ఈ నెల 30వ తేదీన( దసరా రోజు) ఆయన పద్మనాభుని దర్శించుకుంటారని ఏసుదాస్ తరపు ప్రతినిధి తెలిపారు. హిందూమతంపై విశ్వాసం ప్రకటించే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా కర్ణాటకలోని మూకాంబిక ఆలయానికి, శబరిమలైలోని అయ్యప్పస్వామి ఆలయానికి ఆయన ఏటా వెళ్లి పూజలు చేస్తుంటారు. అయితే, మలప్పురంలోని కదంప్పుజా దేవి ఆలయం, గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలోనికి ఆయన ప్రవేశాన్ని అక్కడి అధికారులు నిరాకరించారు. అందుకే ఏసుదాస్ పద్మనాభస్వామి ఆలయ అధికారులకు ముందుగా విజ్ఞాపన పంపారు. ఏసుదాస్ వందలాదిగా హిందూ సంప్రదాయ కీర్తనలు, గీతాలు ఆలపించారు.
Advertisement