అనంతుడి ఆలయంలో బంగారు కుండలు మాయం
కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం.. అనంత మహిమలకే కాదు, అంతులేని సంపద కూడా ప్రతీకనే. లక్షల కోట్ల విలువైన బంగారం ఉన్న ఈ ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్టు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మాజీ ఫైనాన్సియల్ సెక్రటరీ వినోద్ రాయ్ సమర్పించిన నివేదికలో వెల్లడైనట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వాటి విలువ సుమారు రూ.186 కోట్లగా వెల్లడించింది. వినోద్ రాయ్ సమర్పించిన బంగారు కుండల మిస్సింగ్ నివేదికను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టీ.ఎస్ థాకూర్ నేతృత్వంలోని బెంచ్ త్వరలోనే విచారించనుంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ మిస్సింగ్ జరిగినట్టు వెల్లడైంది.
2002 జూలై వరకు ఈ బంగారు కుండలు సీరియల్ నెంబర్లు 1 నుంచి 1000 వరకు వేర్వేరు సంఖ్యలలో ఉన్నట్టు రాయ్ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం కుండలకు 1000 నుంచి సీరియల్ సంఖ్యలు ఉన్నాయని, 2011 ఏప్రిల్ తర్వాత ఓ కుండను పరిశీలించినప్పుడు 1988 సీరియల్ సంఖ్య వచ్చినట్టు రిపోర్టులో తెలిపారు. దీనిప్రకారం కనీసం 1988ల బంగారు కుండలు వివిధ కలారస్లో ఉండాలని చెప్పారు. ఒకవేళ ఆలయ అధికారిక కమిటీ లెక్కలు ప్రకారం 822 బంగారు కుండలను ఆభరణాల తయారీకి కరిగించినా.. 1,166 బంగారు కుండలు ఉండాల్సి ఉందన్నారు.
కానీ కేవలం 397 వరకు సీరియల్ సంఖ్య ఉన్న బంగారు కుండలను మాత్రమే తమ పరిశీలనలో తేలినట్టు వినోద్ రాయ్ నివేదిక పేర్కొంది. 769 కుండలు దేవుని ఆలయం నుంచి మిస్ అయినట్టు తెలిపింది. టెంపుల్ అధికారిక కమిటీ బలహీనంగా ఉన్నందున, కొత్త కమిటీని నియమించి దీనిపై లోతుగావిచారించాలని వినోద్ రాయ్ ప్రతిపాదించారు. ఆ కమిటీకి ప్రభుత్వ సెక్రటరీ ర్యాంకింగ్ లో ఉన్న ఆల్ ఇండియా సర్వీసు ఆఫీసర్ బాధ్యత వహించాలని, కేరళ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సభ్యులను ప్యానెల్కు తప్పక ప్రతినిధులుగా వ్యవహరించాలని సూచించారు.