Sree Padmanabha Swamy temple
-
ఉత్సవం కోసం ఎయిర్పోర్ట్ మూసివేత
సాక్షి, తిరువనంతపురం : ఆలయంలో జరిగే ఉత్సవం కోసం ఎయిర్‌పోర్టును మూసేయటం ఎక్కడైనా చూశారా? అయితే ఇలా ఓ ఈవెంట్ కోసం ఎయిర్ పోర్టును మూసేయడం తరచుగా జరిగేది మరెక్కడో కాదు కేరళలో. ప్రపంచ ప్రసిద్ధ శ్రీపద్మనాభస్వామి ఆలయంలో జరిగే ఉత్సవం కోసం తిరువనంతపురం ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు జరిగే ఈ ఆరట్టు ఉత్సవం కోసం విమానాల రాకపోకల షెడ్యూల్‌ను కూడా సవరించుకోవటం దశాబ్ధాలుగా జరుగుతోంది. పద్మనాభస్వామి ఆలయంలో పది రోజుల పాటు జరిగే పైన్కుని, అల్పస్సి ఉత్సవాల చివరి రోజు ఆరట్టు జరుగుతుంది. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగే ఆరట్టు సందర్భంగా రన్‌వే మీదుగా ఆలయ విగ్రహాలను ఊరేగింపుగా షన్గుముఘమ్ బీచ్‌కు తీసుకెళ్లి పవిత్ర స్నానాలు చేయిస్తారు. అనంతరం తిరిగి ఇదే దారిలో విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఊరేగింపు కోసమే శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్థానిక ఎయిర్‌పోర్టును మూసివేస్తామని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జార్జి జి.థాకరన్ వెల్లడించారు. నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మన్) హెచ్చరికలను ఉత్సవానికి వారం రోజుల ముందుగానే జారీ చేస్తామని, ఆ మేరకు ఆయా విమానయాన సంస్థలు తమ షెడ్యూల్లో మార్పులు చేసుకుంటాయని వివరించారు. ఉత్సవం కోసం రాకపోకలను ఆపేయటం వంటి ఆనవాయితీ ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నట్లు తమకు తెలియదన్నారు. రన్‌వేను పూర్తిగా మూసివేస్తామని, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా విమానయాన సంస్థలకు ఈ మేరకు షెడ్యూల్లో మార్పులు చేసుకోవాలని సమాచారం పంపించామన్నారు. ఈ ఆరట్టు ఉత్సవంలో పాల్గొనే వారి పేర్లతో ఆలయ అధికారులు ఇచ్చిన జాబితా మేరకు ఆలయ యాజమాన్యం జారీ చేసిన పాసులున్న వారినే లోపలికి అనుమతిస్తామన్నారు. కేరళ పోలీసులతోపాటు సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేపడుతాయని చెప్పారు. విమానాశ్రయ రన్‌వే పరిసరాలను రాత్రి 8.45గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయాలన్న నోటమ్ మేరకు తిరిగి 9 గంటల సమయానికి విమానాల రాకపోకలు ప్రారంభించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు చేసిన విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కన్నుల విందుగా సాగే ఈ ఊరేగింపులో అంబారీ ఏనుగులతోపాటు ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు, పురోహితులు, పోలీస్ బాస్‌లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రాచకుటుంబ పెద్ద అయిన మూలమ్ తిరునాల్ రామ వర్మ ఈ ఉత్సవానికి నేతృత్వం వహిస్తారు. సంప్రదాయబద్ధంగా పచ్చని తలపాగా, రాజరిక చిహ్నాలు, కరవాలం చేతబూని ఆయన ముందు నడుస్తారు. 1932లో విమానాశ్రయాన్ని ప్రారంభించకముందు నుంచే ఇక్కడ ఆరట్టు ఉత్సవం నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. -
ఏసుదాస్ కల నెరవేరబోతోంది..
తిరువనంతపురం : ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాస్ కల నెరవేరబోతోంది. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రవేశానికి, ప్రత్యేక పూజలకు పూజలకు అవకాశం కల్పించాలని జన్మతః క్రైస్తవుడైన ఏసుదాస్ ఆలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తనకు హిందూమతంపై పూర్తి విశ్వాసం ఉందని, పద్మనాభుని దర్శించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు నియమించిన ఆలయ వ్యవహారాల మండలి దీనిపై సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఏసుదాస్‌ను ఆలయంలోకి అనుమతించాలని తీర్మానించింది. ఆయన ఎప్పుడైనా ఆలయంలోకి రావచ్చని ఈ సందర్భంగా మండలి తెలిపింది. అయితే, ఈ నెల 30వ తేదీన( దసరా రోజు) ఆయన పద్మనాభుని దర్శించుకుంటారని ఏసుదాస్ తరపు ప్రతినిధి తెలిపారు. హిందూమతంపై విశ్వాసం ప్రకటించే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కర్ణాటకలోని మూకాంబిక ఆలయానికి, శబరిమలైలోని అయ్యప్పస్వామి ఆలయానికి ఆయన ఏటా వెళ్లి పూజలు చేస్తుంటారు. అయితే, మలప్పురంలోని కదంప్పుజా దేవి ఆలయం, గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలోనికి ఆయన ప్రవేశాన్ని అక్కడి అధికారులు నిరాకరించారు. అందుకే ఏసుదాస్ పద్మనాభస్వామి ఆలయ అధికారులకు ముందుగా విజ్ఞాపన పంపారు. ఏసుదాస్ వందలాదిగా హిందూ సంప్రదాయ కీర్తనలు, గీతాలు ఆలపించారు. -
ఏసుదాస్ కల నెరబోతోంది..
-
ఆ ఆలయంలో పాడేందుకు అనుమతించండి: యేసుదాసు
సాక్షి, తిరువనంతపురం: లెజెండరీ సినీ గాయకుడు కేజే యేసుదాసు కేరళలోని ప్రఖ్యాత శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో తన గానామృతాన్ని పంచాలనుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో స్వరార్చన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దేవాలయ అధికారులకు లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీన దసరా పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ రోమన్-క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన యేసుదాసు ప్రత్యేక దూత ద్వారా తన లేఖను అధికారులకు పంపారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆలయ కమిటీ తీసుకోనుంది. హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారికి ఆలయంలో ప్రవేశముంటుందని ఆలయ కమిటీ చెప్తోంది. ఇక త్రిశూర్ జిల్లాలోని గురువాయూరప్పన్ ఆలయంలోకి ప్రవేశం కోసం సైతం యేసుదాసు ఎదురుచూస్తున్నారు. శ్రీకృష్ణుడైన గురువాయూరప్పపై అనేక పాటలు పాడినప్పటికీ.. ఇప్పటికీ తనకు ఆలయంలో ప్రవేశం కల్పించడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. గురువాయూరప్ప ఆలయంలో అన్యమతస్తులకు ప్రవేశం నిషిద్ధం. తన గాన గాంధర్వంతో సినీ సంగీతాన్ని ఏలిన యేసుదాసు 14 భాషల్లో లక్షకుపైగా పాటలను పాడారు. అయ్యప్ప స్వామి మొదలు అనేక మంది దేవుళ్లపై ఆయన పాడిన పాటలు శ్రోతలకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించాయి. -
అనంతుడి ఆలయంలో బంగారు కుండలు మాయం
కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం.. అనంత మహిమలకే కాదు, అంతులేని సంపద కూడా ప్రతీకనే. లక్షల కోట్ల విలువైన బంగారం ఉన్న ఈ ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్టు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మాజీ ఫైనాన్సియల్ సెక్రటరీ వినోద్ రాయ్ సమర్పించిన నివేదికలో వెల్లడైనట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వాటి విలువ సుమారు రూ.186 కోట్లగా వెల్లడించింది. వినోద్ రాయ్ సమర్పించిన బంగారు కుండల మిస్సింగ్ నివేదికను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టీ.ఎస్ థాకూర్ నేతృత్వంలోని బెంచ్ త్వరలోనే విచారించనుంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ మిస్సింగ్ జరిగినట్టు వెల్లడైంది. 2002 జూలై వరకు ఈ బంగారు కుండలు సీరియల్ నెంబర్లు 1 నుంచి 1000 వరకు వేర్వేరు సంఖ్యలలో ఉన్నట్టు రాయ్ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం కుండలకు 1000 నుంచి సీరియల్ సంఖ్యలు ఉన్నాయని, 2011 ఏప్రిల్ తర్వాత ఓ కుండను పరిశీలించినప్పుడు 1988 సీరియల్ సంఖ్య వచ్చినట్టు రిపోర్టులో తెలిపారు. దీనిప్రకారం కనీసం 1988ల బంగారు కుండలు వివిధ కలారస్లో ఉండాలని చెప్పారు. ఒకవేళ ఆలయ అధికారిక కమిటీ లెక్కలు ప్రకారం 822 బంగారు కుండలను ఆభరణాల తయారీకి కరిగించినా.. 1,166 బంగారు కుండలు ఉండాల్సి ఉందన్నారు. కానీ కేవలం 397 వరకు సీరియల్ సంఖ్య ఉన్న బంగారు కుండలను మాత్రమే తమ పరిశీలనలో తేలినట్టు వినోద్ రాయ్ నివేదిక పేర్కొంది. 769 కుండలు దేవుని ఆలయం నుంచి మిస్ అయినట్టు తెలిపింది. టెంపుల్ అధికారిక కమిటీ బలహీనంగా ఉన్నందున, కొత్త కమిటీని నియమించి దీనిపై లోతుగావిచారించాలని వినోద్ రాయ్ ప్రతిపాదించారు. ఆ కమిటీకి ప్రభుత్వ సెక్రటరీ ర్యాంకింగ్ లో ఉన్న ఆల్ ఇండియా సర్వీసు ఆఫీసర్ బాధ్యత వహించాలని, కేరళ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సభ్యులను ప్యానెల్‌కు తప్పక ప్రతినిధులుగా వ్యవహరించాలని సూచించారు. -
పద్మనాభుని సంపదపై ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయం సందపపై ప్రత్యేక ఆడిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తిరువనంతపురం జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొత్త కార్యనిర్వహక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఒకవేళ జిల్లా కోర్టు న్యాయమూర్తి హిందూ మతానికి చెందిన వ్యక్తికాకపోతే ఆయన తర్వాతి సీరియర్ జడ్జి కమిటీకి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆలయ సంపదను పరాధీనం చేయడం, అమ్మడం కానీ చేయరాదని స్పష్టం చేసింది. పద్మనాభ స్వామి ఆలయ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, ఆలయ సంపద వంటి అంశాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం ఈ నెల 15న సమర్పించిన నివేదికపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది.