సాక్షి, తిరువనంతపురం : ఆలయంలో జరిగే ఉత్సవం కోసం ఎయిర్‌పోర్టును మూసేయటం ఎక్కడైనా చూశారా? అయితే ఇలా ఓ ఈవెంట్ కోసం ఎయిర్ పోర్టును మూసేయడం తరచుగా జరిగేది మరెక్కడో కాదు కేరళలో. ప్రపంచ ప్రసిద్ధ శ్రీపద్మనాభస్వామి ఆలయంలో జరిగే ఉత్సవం కోసం తిరువనంతపురం ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు జరిగే ఈ ఆరట్టు ఉత్సవం కోసం విమానాల రాకపోకల షెడ్యూల్‌ను కూడా సవరించుకోవటం దశాబ్ధాలుగా జరుగుతోంది. పద్మనాభస్వామి ఆలయంలో పది రోజుల పాటు జరిగే పైన్‌కుని, అల్‌పస్సి ఉత్సవాల చివరి రోజు ఆరట్టు జరుగుతుంది.
దాదాపు ఐదు గంటలపాటు కొనసాగే ఆరట్టు సందర్భంగా రన్‌వే మీదుగా ఆలయ విగ్రహాలను ఊరేగింపుగా షన్‌గుముఘమ్ బీచ్‌కు తీసుకెళ్లి పవిత్ర స్నానాలు చేయిస్తారు. అనంతరం తిరిగి ఇదే దారిలో విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఊరేగింపు కోసమే శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్థానిక ఎయిర్‌పోర్టును మూసివేస్తామని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జార్జి జి.థాకరన్ వెల్లడించారు. నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మన్) హెచ్చరికలను ఉత్సవానికి వారం రోజుల ముందుగానే జారీ చేస్తామని, ఆ మేరకు ఆయా విమానయాన సంస్థలు తమ షెడ్యూల్‌లో మార్పులు చేసుకుంటాయని వివరించారు.
ఉత్సవం కోసం రాకపోకలను ఆపేయటం వంటి ఆనవాయితీ ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నట్లు తమకు తెలియదన్నారు. రన్‌వేను పూర్తిగా మూసివేస్తామని, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా విమానయాన సంస్థలకు ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవాలని సమాచారం పంపించామన్నారు. ఈ ఆరట్టు ఉత్సవంలో పాల్గొనే వారి పేర్లతో ఆలయ అధికారులు ఇచ్చిన జాబితా మేరకు ఆలయ యాజమాన్యం జారీ చేసిన పాసులున్న వారినే లోపలికి అనుమతిస్తామన్నారు. కేరళ పోలీసులతోపాటు సీఐఎస్‌ఎఫ్ తనిఖీలు చేపడుతాయని చెప్పారు.
విమానాశ్రయ రన్‌వే పరిసరాలను రాత్రి 8.45గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయాలన్న నోటమ్ మేరకు తిరిగి 9 గంటల సమయానికి విమానాల రాకపోకలు ప్రారంభించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు చేసిన విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కన్నుల విందుగా సాగే ఈ ఊరేగింపులో అంబారీ ఏనుగులతోపాటు ట్రావెన్‌కోర్ రాజకుటుంబీకులు, పురోహితులు, పోలీస్ బాస్‌లు, పెద్ద సంఖ‍్యలో భక్తులు పాల్గొంటారు. రాచకుటుంబ పెద్ద అయిన మూలమ్ తిరునాల్ రామ వర్మ ఈ ఉత్సవానికి నేతృత్వం వహిస్తారు. సంప్రదాయబద్ధంగా పచ్చని తలపాగా, రాజరిక చిహ్నాలు, కరవాలం చేతబూని ఆయన ముందు నడుస్తారు. 1932లో విమానాశ్రయాన్ని ప్రారంభించకముందు నుంచే ఇక్కడ ఆరట్టు ఉత్సవం నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment