ఆ ఆలయంలో పాడేందుకు అనుమతించండి: యేసుదాసు
సాక్షి, తిరువనంతపురం: లెజెండరీ సినీ గాయకుడు కేజే యేసుదాసు కేరళలోని ప్రఖ్యాత శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో తన గానామృతాన్ని పంచాలనుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో స్వరార్చన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దేవాలయ అధికారులకు లేఖ రాశారు.
ఈ నెల 30వ తేదీన దసరా పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ రోమన్-క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన యేసుదాసు ప్రత్యేక దూత ద్వారా తన లేఖను అధికారులకు పంపారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆలయ కమిటీ తీసుకోనుంది. హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారికి ఆలయంలో ప్రవేశముంటుందని ఆలయ కమిటీ చెప్తోంది. ఇక త్రిశూర్ జిల్లాలోని గురువాయూరప్పన్ ఆలయంలోకి ప్రవేశం కోసం సైతం యేసుదాసు ఎదురుచూస్తున్నారు. శ్రీకృష్ణుడైన గురువాయూరప్పపై అనేక పాటలు పాడినప్పటికీ.. ఇప్పటికీ తనకు ఆలయంలో ప్రవేశం కల్పించడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. గురువాయూరప్ప ఆలయంలో అన్యమతస్తులకు ప్రవేశం నిషిద్ధం.
తన గాన గాంధర్వంతో సినీ సంగీతాన్ని ఏలిన యేసుదాసు 14 భాషల్లో లక్షకుపైగా పాటలను పాడారు. అయ్యప్ప స్వామి మొదలు అనేక మంది దేవుళ్లపై ఆయన పాడిన పాటలు శ్రోతలకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించాయి.