![వికసించిన పద్మాలు](/styles/webp/s3/article_images/2017/09/5/81485377236_625x300.jpg.webp?itok=RLxOwSao)
వికసించిన పద్మాలు
• యేసుదాసు, జోషి, పవార్‌సహా ఏడుగురికి విభూషణ్
• మరో ఏడుగురికి పద్మభూషణ్
• ఇన్నాళ్లూ వెలుగులోకి రానివారికే ఈసారి పట్టం
• జాబితాలో 19 మంది మహిళలు సహా 89 మంది
న్యూఢిల్లీ: సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి (బీజేపీ), శరద్ పవార్ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్ జాబితాలో ఉన్నారు.
వివిధ భాషల్లో 50వేలకు పైగా సినిమా పాటలు పాడిన యేసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాలకూ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలో.. దేశానికి, సమాజానికి విశేష సేవలందిస్తున్నా.. ఇన్నాళ్లుగా గుర్తింపునకు నోచుకోని గొప్పవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 18 వేల నామినేషన్లు (4వేలు ఆన్‌లైన్లో వచ్చాయి) రాగా అందులోనుంచి 89 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఈసారి పద్మ అవార్డుల్లో మహిళలు 19 మంది, విదేశీయులు–ఎన్నారైలు ఐదుగురుండగా.. మరణానంతరం అవార్డులకు ఎంపికైనవారు ఆరుగురున్నారు. వైద్య, సామాజిక రంగంలో కృషిచేసినవారితోపాటు సంగీత దర్శకులు, గాయకులకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రామీ అవార్డు విజేత, మ్యుజీషియన్ విశ్వ మోహన్ భట్ పద్మ భూషణ్‌కు, గాయకులు కైలాశ్ ఖేర్, అనురాధ పౌడ్వాల్‌లను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. భారత శాస్త్రీయ సంగీతంలో భట్‌కు ప్రత్యేక స్థానముంది. పద్మశ్రీకి ఎంపికవటం పట్ల కైలాశ్ ఖేర్, పౌడ్వాల్‌లు హర్షం వ్యక్తం చేశారు.
పండిట్ రవిశంకర్ శిష్యుడైన భట్ ‘మోహన వీణ’ అనే కొత్త రాగాన్ని సృష్టించారు. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులెవరికీ ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు సంజీవ్ కపూర్, కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్యకారుడు చెమంచేరి కున్హిరామన్ నాయర్ (100) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రియో ఒలింపిక్స్ తారలు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌లూ పద్మశ్రీ అందుకోనున్నారు.
పద్మ విభూషణ్
1. యేసుదాసు. 2. సద్గురు జగ్గీ వాసుదేవ్, 3. శరద్ పవార్, 4. మురళీ మనోహర్ జోషి, 5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, 6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం), 7. పీఏ సంగ్మా (మరణానంతరం)
పద్మ భూషణ్
1. విశ్వమోహన్ భట్, 2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, 3. తెహంతోన్ ఉద్వాదియా, 4. రత్న సుందర్ మహారాజ్, 5. స్వామి నిరంజనానంద సరస్వతి, 6. చో రామస్వామి (మరణానంతరం), 7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్)
మట్టిలో మాణిక్యాలు
కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కార విజేతల్లో అనేక మంది ఇప్పటివరకు మనకు పెద్దగా పరిచయం లేని వారే. పేరు, ప్రతిష్టల కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో, అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్న వీరి వివరాలు క్లుప్తంగా...
⇔ కరీముల్ హక్ (52 ఏళ్లు): పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడి జిల్లాకు చెందిన ఈయన అంబులెన్స్ దాదాగా గుర్తింపు పొందారు. తేయాకు తోటల్లో పనిచేసే హక్ తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చారు. ఆపదలో ఉన్న వారికి 24 గీ7 సాయం అందిస్తున్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్సు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తలచి, అర్థించిన వారికి సాయం చేస్తున్నారు.
⇔ గిరీష్ భరద్వాజ్ (66 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈయన సామాజిక కార్యకర్త. మారుమూల గ్రామాల్లో నూటికి పైగా చిన్న చిన్న వంతెనలను నిర్మించి పల్లెలను పట్టణాలతో అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించి ‘సేతు బంధు’గా పేరు తెచ్చుకున్నారు.
⇔ అనురాధా కొయిరాలా (67 ఏళ్లు): నేపాల్‌కు చెందిన ఈమె 12 వేల మంది మహిళలను వ్యభిచార ముఠాల చెరల నుంచి విడిపించి, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరో 45 వేల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురి కాకుండా అడ్డుకోగలిగారు.
⇔ డా. సుబ్రతో దాస్ (51 ఏళ్లు): ‘హైవే మీసయ్య’గా పేరొందిన దాస్ గుజరాత్‌కు చెందిన వారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి వైద్య సేవలు అందించడానికి బాటలు వేసిన వారిలో ఈయన ఒకరు. లైఫ్‌లైన్ ఫౌండేషన్‌ను స్థాపించి 4 వేల కి.మీ జాతీయ రహదారుల పరిధిలో కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు.
⇔ మీనాక్షి అమ్మ (76 ఏళ్లు): కేరళకు చెందిన మీనాక్షి ఏడేళ్ల వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకుని గత 68 ఏళ్లుగా ఇతరులకు నేర్పిస్తున్నారు. ‘కలరిపయట్టు’అనే యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు.
⇔డా. మాపుస్కర్ (88 ఏళ్లు) : మహారాష్ట్రలోని పుణెకు దగ్గర్లోని దెహు గ్రామానికి చెందిన ఈయన 1960ల నుంచే ఆ పల్లెను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేశారు. ఈయనకు ‘స్వచ్ఛతా దూత్’అనే పేరుంది.
⇔ గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ (52 ఏళ్లు): గుజరాత్‌కు చెందిన ఈయన దివ్యాంగుడైన రైతు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆయన గ్రామం నేడు దానిమ్మ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీన్ని సాధించడానికి గెనాభాయ్ ఎనలేని కృషి చేశారు. అందుకే ఈయనకు ‘అనార్ దాదా’అనే పేరు కూడా ఉంది.
⇔ బల్వీర్ సింగ్ సీచేవాల్ (51 ఏళ్లు): పంజాబ్‌కు చెందిన బల్వీర్ సామాజిక కార్యకర్త. 160 కి.మీ పొడవైన కాలీ బీన్ అనే నదికి పునరుజ్జీవం తీసుకురావడానికి అక్కడి యువత, స్వచ్ఛంద సేవకులను ఆయన కదిలించారు. ఈయనకు రస్తేవాలే బాబా. సడకన్‌వాలే బాబా, ఎకో బాబా లాంటి పలు పేర్లున్నాయి.
⇔ బిపిన్ గంటారా (59 ఏళ్లు): ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలో గత 40 ఏళ్లుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.బిపిన్ సోదరుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్నారు.
⇔ సునితి సాలమన్: చెన్నైకి చెందిన వైద్యురాలైన ఈమె దేశంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించారు. 2015లో మరణించారు. ఆమె స్మృత్యర్థం కేంద్రం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది.
⇔ భక్తి యాదవ్ (91 ఏళ్లు): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన తొలి మహిళ ఈమె. గత 68 ఏళ్లుగా ఇండోర్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి వేల మంది గర్భిణులకు కాన్పులు చేశారు.
⇔ సుక్రీ బొమ్మగౌడ (58 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈమె జానపద గాయకురాలు.
‘నైటింగేల్ ఆఫ్ హళక్కి’గా గుర్తింపు పొందారు.
⇔ జితేంద్ర హరిపాల్: ఒడిశాకు చెందిన ఈయన ‘రంగబతీ కీ ఆవాజ్’పేరుతో ప్రాచుర్యం పొందారు. ఒడిశాలో బాగా పాపులర్ అయిన రంగబతీ పాట కోసం ఈయన ఎంతో శ్రమించారు. కోస్లి–సంబాల్‌పురి సంగీతానికి ఎనలేని సేవ చేస్తున్నారు.
⇔ ఎలా అహ్మద్ (81 ఏళ్లు): అస్సాంకు చెందిన వీరు 1970 నుంచి మహిళల కోసం ప్రత్యేక మేగజీన్ నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఒకే ఒక్క మహిళా మేగజీన్ ఇదే.