ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు
ప్రముఖ దర్శకుడి ఇంట్లో రూ. 1.2 కోట్లు దోచేశాడు
దొంగతనం ద్వారా వచ్చే డబ్బు పేదలకు పంచేస్తాడు
మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా జోషికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు అభిలాష్ కూడా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నివాసంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్శకుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెళ్లడించారు. బిహార్‌కు చెందిన ఇర్ఫాన్ ఒక గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించగా పరారీలో ఉన్న అతడిని కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లియర్‌గా కనిపించడంతో అతన్ని పట్టుకోవడం సులభం అయిందని కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు.
ఆ కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇర్ఫాన్ పక్కా ప్లాన్‌తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ధనవంతుల నివాసాలే టార్గెట్ చేస్తున్నాడు. దొంగతనంలో భాగంగా డబ్బులు, నగలు దొంగిలించి బిహార్‌లోని పేద ప్రజలకు పంచుతున్నాడని సమాచారం.. ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం వారి నుంచి రాలేదు. తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతనెలలోనే జైలు నుంచి ఆయన విడుదలయ్యారని వారు తెలిపారు.
ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడని తెలిపారు. నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాల గురించి ఆరా తీసి ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు జోషీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనం తెల్లవారుజామున జరగడంతో వారు నిద్రలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment