మలయాళ చిత్రపరిశ్రమపై 'జస్టిస్ హేమ కమిటీ' ఇచ్చిన రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. మలయాళ చిత్రపరిశ్రమలో పనిచేస్తున్న మహిళల పట్ల లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ రిపోర్ట్‌లో ఉంది. దీంతో చాలామంది ఈ అంశం గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. ఆపై మోహన్‌లాప్‌పై కూడా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటి మల్లికా.. మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ అని తెలిసిందే.. సుమారు ఆమె 60కి పైగా సినిమాల్లో రాణించారు. కతర్ దేశంలో ఆమెకు ఆరు రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమకు దూరంగా వ్యాపారవేత్తగా ఆమె ఉన్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. 'అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో విని మౌనంగా ఉండే వారు మాత్రమే ఇక్కడ ఇమడగలరు. నిరుపేద నటీనటులకు ఆర్థిక సహాయం అందించే చేయూత పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇదే విషయం ఒకసారి మా అబ్బాయితో కూడా చెప్పాను.
పథకాలకు అర్హులైనవారు, వెనుకబడినవారు చాలామంది ఉన్నారు. నెలలో 15 రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నవారికి చేయూత పథకాలు అందుతున్నాయి. ఇదీ ముమ్మాటికి నిజం. మందులు కొనుక్కోవడానికి డబ్బు లేని నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వారికి ఆపన్న హస్తం అందించాలి. మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు. సంస్థలో కొన్ని తప్పులు దొర్లాయని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్‌కు కూడా బాగా తెలుసు. ఇక్కడ చాలా మంది తమ స్వంత ఇష్టాలకు నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ తొలినాళ్లలో కూడా చాలా తప్పులు జరిగాయి. దాన్ని అప్పట్లో నటుడు సుకుమారన్ (ఆమె భర్త) ఎత్తి చూపారు. చట్టబద్ధంగా ప్రతి విషయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఇది కొందరికి ఈగోల గొడవతో ముగిసింది. సుకుమారన్ చనిపోయిన తర్వాతే వారికి అది అర్థమైంది.
హేమ కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టిన భూతంలా ఉందని మల్లికా అన్నారు. చిత్రపరిశ్రమకు చెందిన ఒక నటిపై దాడి కేసు విషయంలో ఈ ప్రభుత్వం ఏమేరకు న్యాయం చేసిందో చెప్పాలని ఆమె కోరారు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆ హీరోయిన్ మీద హింస జరిగిన మాట వాస్తవమే అని అందరికీ తెలుసు. కానీ, ఒక్కరు నోరెత్తరని ఆమె అన్నారు. ఆ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తుందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. అన్యాయం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే మళ్లీ జరగవు కదా అని మల్లిక ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment