
మలయాళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదక తర్వాత ఒక్కోక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారు. దీంతో అదే తరహా కమిటీని తమ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలకు చెందిన సినీ నటీనటులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ రియాక్ట్ అయ్యారు.
పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. దీనికి అంతం ఎప్పుడో అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా నటి సిమ్రాన్ కూడా తానూ వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. ఈ ఉత్తరాది భామ కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించారు. యువత కలల రాణిగా వెలుగొందిన సిమ్రాన్ వివాహానంతరం నటనకు దూరం అయినా, తాజాగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా ఈమె ఆ మధ్య పేట చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి రీ ఎంట్రీకి మార్గం వేసుకున్నారు.
తాజాగా ఒక భేటీలో సిమ్రాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నటీమణుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకే దారి తీస్తోందన్నారు. కాగా తానూ అలాంటి బాధితురాలినేనని చెప్పారు. ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణమన్నారు. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరు ? మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందన్నారు. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలం అని, అందుకు సమయం తప్పనిసరిగా అవసరం అన్నారు. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు.