
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.
ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.
యావత్మాల్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు.