
విజయ్ ఏసుదాస్‌కు నో చెప్పా
మారి చిత్రంలో ప్రఖ్యాత గాయకుడు ఏసుదాస్ వారసుడు విజయ్ ఏసుదాస్‌ను నటుడిగా ఎంపిక చేద్దాం అంటే నేను వద్దు అన్నానని నటుడు ధనుష్ తెలిపారు. ఈయన నటించిన తాజా చిత్రం మారి. మ్యాజిక్ ప్రేమ్స్ ఉండర్‌బార్ ఫిలింస్ సంస్థలపై శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో నటుడు ధనుష్ పాలు పంచుకోవడం గమనార్హం. వాయై మూడి పేసవుం చిత్రం ఫేమ్ బాలాజీ మోహన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా గురువారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు ధనుష్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం దర్శకుడు బాలాజీ మోహన్ మూడు స్క్రిప్టులను తనకు ఇచ్చి ఏదినచ్చితే ఆ కథతో చిత్రం చేద్దాం అన్నారన్నారు. అందులో తాను ఎంపిక చేసుకున్న కథే ఈ మారి చిత్రం అన్నారు. బాలాజి మోహన్ ఇంతకుముందు లవ్ తదితర చిత్రాలు చేశారన్నారు. అయితే ఆయనతో పూర్తి కమర్షియల్ దర్శకుడు ఉన్నాడన్నది మారి చిత్రంతో రుజువవుతుందన్నారు. నిజం చెప్పాలంటే తాను ఇంటి కథ కోసం చాలాకాలంగా ఎదురు చూశానని అన్నారు. అనిరుధ్ సంగీతం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు.
పాటల కన్నా నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ కాజల్‌కు నటనకు అవకాశం ఉన్న పాత్ర అని ఆమె చక్కగా నటించారని కితాబిచ్చారు. ఇక ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రకు దర్శకుడు విజయ్ ఏసుదాస్‌ను ఎంపిక చేద్దాం అన్నప్పుడు తానువద్దని చెప్పానన్నారు. ఆయన తనకు చాలా కాలంగా తెలుసు. చాలా సాఫ్ట్‌గా ఉంటారు. చిత్రంలో పాత్రకు నప్పుతారని అన్నారన్నారు. అయినా ఒకసారి ఆలోచించండి అని దర్శకుడు అన్నారన్నారు. అయితే చిత్రం చూసిన తరువాత దర్శకుడి ఆలోచనలు ఎంత కరెక్ట్‌గా ఉంటాయో అర్థమైంది. చిత్రంలో విజయ్ ఏసుదాస్ చాలా బాగా నటించారని ఆయన తెలిపారు. సమావేశంలో దర్శకుడు బాలాజీమోహన్, విజయ్ ఏసుదాస్, అనిరుధ్, శరత్ కుమార్ పాల్గొన్నారు.