చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే, కొద్దిమంది అధిక సమానులు! సుప్రసిద్ధ ఆంగ్ల సూక్తి ఇది. ఆ అధిక సమానులైన ‘మోర్ ఈక్వల్’ వర్గం ఎవరు? పేరుప్రతిష్ఠలు ఉన్నంత మాత్రాన ఎవరైనా సరే, సమాజంలోని తోటివారి కన్నా ఏ రకంగా ఎక్కువ అవుతారు? తమిళనాట ఇప్పుడు ఇదే చర్చ. అక్కడి సినీస్టార్లు తాము కొనుక్కున్న ఖరీదైన కార్ల మీద పన్ను మినహాయింపు కోరడం, ఈ వివాదంలో న్యాయమూర్తుల తాజా వ్యాఖ్యలతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతూ ఆ తరహా ఇతివృత్తాలతో సినిమాలు చేస్తున్న విజయ్, ఆ వెంటనే జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ లాంటి హీరోలు ఈ పన్ను మినహాయింపు వివాదంలో ఉండడం గమనార్హం.
కోట్లల్లో పారితోషికం తీసుకొని ఖరీదైన కార్లు కొన్నవాళ్ళు... ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను విషయంలో బీద అరుపులు అరవడం విచిత్రమే. తెరపై దేశోద్ధారకులుగా ప్రచారం పొందాలని తపించేవారు... తీరా నిజజీవితంలో ఇలా చేయడం ఆశ్చర్యకరమే. కోర్టూ ఆ మాటే అంది. హీరో విజయ్ 2012లో ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకున్నారు. అప్పట్లో ఆ కారు రూ.1.2 కోట్లనీ, ఖరీదు కన్నా 150 శాతం ఎక్కువ రూ. 1.8 కోట్లు కస్టమ్స్ కింద కట్టామనీ, కారుపై అసాధారణ ‘ఎంట్రీ ట్యాక్స్’ వేస్తున్నారనీ, ఆ పన్ను మినహాయించాలనీ కోరారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులోనే ఉంది. ఇటీవలే ఆ అభ్యర్థనను మద్రాసు హైకోర్టు కొట్టివేస్తూ, ప్రాథమిక వసతులు కల్పించాలంటే పన్నులు కట్టాలని గుర్తు చేసింది. ‘‘రీల్ హీరోలం’’ మాత్రమే అన్నట్టు ప్రవర్తించడాన్ని తప్పుపట్టింది. వెంటనే పన్ను కట్టమనీ, ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి రూ. లక్ష అపరాధ రుసుము కట్టమనీ ఆదేశించింది. దానిపై మళ్ళీ కోర్టుకెళ్ళి, విజయ్ స్టే తెచ్చుకోవడం వేరే కథ. హీరో ధనుష్ సైతం ఇలానే తన రోల్స్ రాయిస్ కారు కోసం 2015 నుంచి కోర్టులో పన్ను మినహాయింపు కోరుతున్నారు. 2018లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చినా, వినలేదు. చివరకు ఈనెల మొదటి వారంలో మద్రాసు హైకోర్టు ఆగ్రహానికి గురై, ధనుష్ వెనక్కి తగ్గారు.
లగ్జరీ కార్లను కొంటున్నవాళ్ళు మాత్రం అసలీ ఎంట్రీ ట్యాక్స్ సరైనది కాదని వాదిస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం 2017 జూలై 1 నుంచి దేశంలో ‘వస్తువులు – సేవల పన్ను’ (జీఎస్టీ) వచ్చింది. దానిలోనే ఎంట్రీ ట్యాక్స్ కలసిపోయిందని కొనుగోలుదార్ల అభిప్రాయం. ‘విదేశాల నుంచి కార్లు తెప్పించుకున్నప్పుడు దిగుమతి, కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తున్నాం. విడిగా ఎంట్రీ ట్యాక్స్ అనవసరం’ అన్నది వారి వాదన. ఆ మాట కొట్టిపారేయలేం. ఒక రకంగా జీఎస్టీ వచ్చాక ఇతర పన్నుల విధింపులో జరగాల్సిన హేతుబద్ధీకరణను ఇది గుర్తుచేస్తోంది. మన జీడీపీలో ఆరేడు శాతం ఆటో ఇండస్ట్రీదే! దేశంలో వాహనాల అమ్మకాల్లో లగ్జరీ కార్ల వంతు ఒక శాతం లోపలే! వీటికి దేశమంతటా ఒకే విధమైన పన్ను విధానం ఉండాలని బెంజ్ తదితర సంస్థల భారతీయ శాఖలు అభ్యర్థిస్తున్నాయి.
అయితే, జీఎస్టీ లాంటివి లేనప్పుడు కూడా విదేశీ లగ్జరీ కార్లు తెచ్చుకున్న ప్రముఖులు గతంలో ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు పొందడం గమనార్హం. ఉదాహరణ – క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రసిద్ధ ‘ఫార్ములా వన్’ రేసర్, జర్మనీ దేశీయుడు అయిన మైఖేల్ షూమేకర్ 2002లో తన ఫెరారీ కారును సచిన్‌కు కానుకగా ఇచ్చారు. ఆ లగ్జరీ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టే పని లేకుండా ఆ రోజుల్లో సచిన్‌కు మినహాయింపు నిచ్చారు. ఇప్పుడు పన్ను మినహాయింపు కోరుతున్న కొందరు ఆ పూర్వోదాహరణను ఎత్తి చూపుతున్నారు. ఇలా కావాల్సిన కొందరికి మాత్రం మినహాయింపులిచ్చి, మిగిలినవాళ్ళకు ‘చట్టం – న్యాయం’ అంటూ ధర్మపన్నాలు వల్లిస్తేనే చిక్కు!
స్థానిక ప్రాంతాలలోకి మోటారు వాహనాల ప్రవేశంపై తమిళనాడు పన్ను (సవరణ) చట్టం కొన్నేళ్ళుగా అక్కడ అమలులో ఉంది. ఏవైనా ప్రజాప్రయోజనాలుంటేనే – కారు దిగుమతిదార్ల ఎంట్రీ ట్యాక్స్‌ను పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మాఫీ చేయవచ్చని 2015 నాటి ఆ చట్టం చెబుతోంది. సినీతారలు సొంత కార్లకు చెల్లించాల్సొచ్చే పన్నుకు ప్రజాప్రయోజనాలు ఏముంటాయి! నాలుగేళ్ళ క్రితం మలయాళ హీరో, అప్పట్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సురేశ్ గోపి సైతం ఇలాంటి పనే చేశారు. రూ. 20 లక్షల పైన ఖరీదుండే లగ్జరీ కారుకు 20 శాతం పన్ను కట్టాలనే ఆ రాష్ట్ర చట్టాన్ని తప్పించుకొనేందుకు ఆ కారును కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించారు. అందుకోసం అక్కడ ఓ తప్పుడు ఇంటి చిరునామా ఇచ్చారని కేరళ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు.
లగ్జరీ కార్ల పన్ను చెల్లింపు వివాదం పక్కన పెట్టినా, పలు సందర్భాల్లో ఆదాయపన్ను ఎగ్గొట్టిన తారలూ అనేకులు కనిపిస్తారు. ఇక, ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్లకు రెట్టింపు రేట్లతో ఓపెనింగ్ వసూళ్ళు తెచ్చుకొనే మాస్ హీరోలూ, టికెట్ అమ్మిన రేటుకూ – కట్టే వినోదపు పన్నుకూ పొంతన లేని సినీ వ్యాపారులూ మన తెలుగుతో సహా అన్నిచోట్లా తారసపడతారు. ఆ బాక్సాఫీస్ వాపును బలుపుగా చూపి, పారితోషికాలు పెంచుకొనే బడాబాబులు సామాన్యులకు తెరపై సుద్దులు చెబుతుంటారు. తీరా కట్టాల్సిన పన్ను దగ్గర తటపటాయిస్తున్నారు. ఓ పాత సూపర్‌హిట్ పాటలో అగ్రహీరో గారే అన్నట్టు, ‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అంటే ఇదేనేమో! న్యాయమూర్తి మాటల్లో చెప్పాలంటే, ‘పన్ను చెల్లింపు దేశాభివృద్ధికి తప్పనిసరి. అంతే తప్ప, అది తోచింది ఇచ్చే విరాళమో, దాతృత్వమో కాదు. పన్ను ఎగవేతంటే– దేశానికి ద్రోహం చేసే అలవాటు, ఆలోచన. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం!’ అది ‘హీరోలం’ అనుకొనేవాళ్ళు చేయదగిన పనేనా?
Comments
Please login to add a commentAdd a comment