Suresh Gopi (actor)
-
ఎవరూ రాలేదని నన్ను పట్టుకుని ఏడ్చేశాడు: నటుడు
కళాభవన్ మణి.. ఈ మలయాళ నటుడు తెలుగువారికీ సుపరిచితుడే! జెమిని, ఆయుధం, అర్జున్, నరసింహుడు, నగరం.. ఇలా పలు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు. ప్లేబ్యాక్ సింగర్‌గానూ తన టాలెంట్ చూపించాడు. మలయాళ చిత్రపరిశ్రమలోనే తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా సత్తా చాటాడు. రక్తం కక్కుకుని.. విభిన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతడు మద్యం అతిగా తాగడం వల్లే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఫోరెన్సిక్ టెస్ట్‌లో పురుగుమందు ఆనవాళ్లు కూడా లభించడంతో అప్పట్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. చూడగానే నచ్చేశాడు ఈ విషయాన్ని పక్కన పెడితే కళాభవన్ మణితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నటుడు సురేశ్ గోపి. 'ఫస్ట్ టైం మణిని చూడగానే నచ్చేశాడు. ఇప్పటికీ తనపై నాకు ఆ ప్రేమ, అభిమానం అలాగే ఉంది. అతడి పేరు ఎత్తగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటేమో.. అరేబియన్ డ్రీమ్స్ అని ఓ షో కోసం మేమంతా దుబాయ్ వెళ్లాము. నా గది పెద్దదిగా ఉంటుంది. మర్చిపోలేని జ్ఞాపకం.. మేమంతా కలిసి ఒకే గదిలో కింద కార్పెట్ వేసుకుని నిద్రించాము. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం.. ఇంకోటి.. అతడి పెళ్లి రోజు. నన్ను చూడగానే సంతోషంతో ఏడ్చేశాడు. తన పెళ్లికి ఎవరూ రాలేదని, నేనొక్కడినైనా వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే మనసు భావోద్వేగానికి లోనవుతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చాయ్ తాగేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితి.. ఆ హీరో ఆదుకోవడం వల్లే.. -
ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి..
-
సింపుల్‌గా గుడిలో నటుడి కూతురి పెళ్లి.. ఆశీర్వదించిన మోదీ
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్.. శ్రేయాస్ మోహన్‌తో ఏడడుగులు నడిచింది. వీరి వివాహం బుధవారం (జనవరి 17) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాన నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 జంటలకు మోదీ ఆశీర్వాదాలు ఈ సందర్భంగా అక్కడున్న అందరినీ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం మోదీ.. తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. తర్వాత కొత్త జంట.. తమను ఆశీర్వదించండంటూ మోదీ పాదాలకు నమస్కరించింది. వీరితో పాటు అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను మోదీ ఆశీర్వదించారు. స్టార్ సెలబ్రిటీల సందడి కాగా సినీతారలు మమ్ముట్టి, మోహన్‌లాల్, దిలీప్, ఖుష్బూ, జయరాం తదితర సెలబ్రిటీలు కుటుంబంతో సహా విచ్చేసి ఈ పెళ్లి మండపంలో సందడి చేశారు. వివాహ వేడుకల అనంతరం రిసెప్షన్ కోసం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వారి కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులంతా వేరే ఆడిటోరియానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సురేశ్ గోపి కూతురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #Malayalam superstars arriving for #SureshGopi daughter wedding in #GuruvayoorAmbalaNadayil, in the presence of #PM @narendramodi ji! pic.twitter.com/BErxC23saa — Sreedhar Pillai (@sri50) January 17, 2024 చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం ఇదా! -
జర్నలిస్ట్‌తో ప్రముఖ నటుడి అసభ్య ప్రవర్తన.. ఆపై క్షమాపణ చెబుతూ ట్వీట్
సురేష్ గోపీ భారతీయ సినీ నటుడు, మాజీ ఎంపీ, గాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం నాడు జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మహిళా విలేకరి భుజంపై రెండుసార్లు చేయి వేసి ఆమెతో సంభాషించడంపై వివాదం చెలరేగింది. మొదట మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన ఆమె కాస్త దూరం జరిగింది. (ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్) కొంత సమయం తర్వాత ఆమె మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను అదే విధంగా తాకారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎంపీ సురేష్ గోపి నేడు సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ' ఆమెను నేనొక కుమార్తెగా భావించా. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశా. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా.' అని ఆయన తెలిపారు. -
ఇది హీరోలకు తగిన పనేనా?
చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే, కొద్దిమంది అధిక సమానులు! సుప్రసిద్ధ ఆంగ్ల సూక్తి ఇది. ఆ అధిక సమానులైన ‘మోర్ ఈక్వల్’ వర్గం ఎవరు? పేరుప్రతిష్ఠలు ఉన్నంత మాత్రాన ఎవరైనా సరే, సమాజంలోని తోటివారి కన్నా ఏ రకంగా ఎక్కువ అవుతారు? తమిళనాట ఇప్పుడు ఇదే చర్చ. అక్కడి సినీస్టార్లు తాము కొనుక్కున్న ఖరీదైన కార్ల మీద పన్ను మినహాయింపు కోరడం, ఈ వివాదంలో న్యాయమూర్తుల తాజా వ్యాఖ్యలతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతూ ఆ తరహా ఇతివృత్తాలతో సినిమాలు చేస్తున్న విజయ్, ఆ వెంటనే జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ లాంటి హీరోలు ఈ పన్ను మినహాయింపు వివాదంలో ఉండడం గమనార్హం. కోట్లల్లో పారితోషికం తీసుకొని ఖరీదైన కార్లు కొన్నవాళ్ళు... ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను విషయంలో బీద అరుపులు అరవడం విచిత్రమే. తెరపై దేశోద్ధారకులుగా ప్రచారం పొందాలని తపించేవారు... తీరా నిజజీవితంలో ఇలా చేయడం ఆశ్చర్యకరమే. కోర్టూ ఆ మాటే అంది. హీరో విజయ్ 2012లో ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకున్నారు. అప్పట్లో ఆ కారు రూ.1.2 కోట్లనీ, ఖరీదు కన్నా 150 శాతం ఎక్కువ రూ. 1.8 కోట్లు కస్టమ్స్ కింద కట్టామనీ, కారుపై అసాధారణ ‘ఎంట్రీ ట్యాక్స్’ వేస్తున్నారనీ, ఆ పన్ను మినహాయించాలనీ కోరారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులోనే ఉంది. ఇటీవలే ఆ అభ్యర్థనను మద్రాసు హైకోర్టు కొట్టివేస్తూ, ప్రాథమిక వసతులు కల్పించాలంటే పన్నులు కట్టాలని గుర్తు చేసింది. ‘‘రీల్ హీరోలం’’ మాత్రమే అన్నట్టు ప్రవర్తించడాన్ని తప్పుపట్టింది. వెంటనే పన్ను కట్టమనీ, ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి రూ. లక్ష అపరాధ రుసుము కట్టమనీ ఆదేశించింది. దానిపై మళ్ళీ కోర్టుకెళ్ళి, విజయ్ స్టే తెచ్చుకోవడం వేరే కథ. హీరో ధనుష్ సైతం ఇలానే తన రోల్స్ రాయిస్ కారు కోసం 2015 నుంచి కోర్టులో పన్ను మినహాయింపు కోరుతున్నారు. 2018లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చినా, వినలేదు. చివరకు ఈనెల మొదటి వారంలో మద్రాసు హైకోర్టు ఆగ్రహానికి గురై, ధనుష్ వెనక్కి తగ్గారు. లగ్జరీ కార్లను కొంటున్నవాళ్ళు మాత్రం అసలీ ఎంట్రీ ట్యాక్స్ సరైనది కాదని వాదిస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం 2017 జూలై 1 నుంచి దేశంలో ‘వస్తువులు – సేవల పన్ను’ (జీఎస్టీ) వచ్చింది. దానిలోనే ఎంట్రీ ట్యాక్స్ కలసిపోయిందని కొనుగోలుదార్ల అభిప్రాయం. ‘విదేశాల నుంచి కార్లు తెప్పించుకున్నప్పుడు దిగుమతి, కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తున్నాం. విడిగా ఎంట్రీ ట్యాక్స్ అనవసరం’ అన్నది వారి వాదన. ఆ మాట కొట్టిపారేయలేం. ఒక రకంగా జీఎస్టీ వచ్చాక ఇతర పన్నుల విధింపులో జరగాల్సిన హేతుబద్ధీకరణను ఇది గుర్తుచేస్తోంది. మన జీడీపీలో ఆరేడు శాతం ఆటో ఇండస్ట్రీదే! దేశంలో వాహనాల అమ్మకాల్లో లగ్జరీ కార్ల వంతు ఒక శాతం లోపలే! వీటికి దేశమంతటా ఒకే విధమైన పన్ను విధానం ఉండాలని బెంజ్ తదితర సంస్థల భారతీయ శాఖలు అభ్యర్థిస్తున్నాయి. అయితే, జీఎస్టీ లాంటివి లేనప్పుడు కూడా విదేశీ లగ్జరీ కార్లు తెచ్చుకున్న ప్రముఖులు గతంలో ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు పొందడం గమనార్హం. ఉదాహరణ – క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రసిద్ధ ‘ఫార్ములా వన్’ రేసర్, జర్మనీ దేశీయుడు అయిన మైఖేల్ షూమేకర్ 2002లో తన ఫెరారీ కారును సచిన్‌కు కానుకగా ఇచ్చారు. ఆ లగ్జరీ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టే పని లేకుండా ఆ రోజుల్లో సచిన్‌కు మినహాయింపు నిచ్చారు. ఇప్పుడు పన్ను మినహాయింపు కోరుతున్న కొందరు ఆ పూర్వోదాహరణను ఎత్తి చూపుతున్నారు. ఇలా కావాల్సిన కొందరికి మాత్రం మినహాయింపులిచ్చి, మిగిలినవాళ్ళకు ‘చట్టం – న్యాయం’ అంటూ ధర్మపన్నాలు వల్లిస్తేనే చిక్కు! స్థానిక ప్రాంతాలలోకి మోటారు వాహనాల ప్రవేశంపై తమిళనాడు పన్ను (సవరణ) చట్టం కొన్నేళ్ళుగా అక్కడ అమలులో ఉంది. ఏవైనా ప్రజాప్రయోజనాలుంటేనే – కారు దిగుమతిదార్ల ఎంట్రీ ట్యాక్స్‌ను పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మాఫీ చేయవచ్చని 2015 నాటి ఆ చట్టం చెబుతోంది. సినీతారలు సొంత కార్లకు చెల్లించాల్సొచ్చే పన్నుకు ప్రజాప్రయోజనాలు ఏముంటాయి! నాలుగేళ్ళ క్రితం మలయాళ హీరో, అప్పట్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సురేశ్ గోపి సైతం ఇలాంటి పనే చేశారు. రూ. 20 లక్షల పైన ఖరీదుండే లగ్జరీ కారుకు 20 శాతం పన్ను కట్టాలనే ఆ రాష్ట్ర చట్టాన్ని తప్పించుకొనేందుకు ఆ కారును కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించారు. అందుకోసం అక్కడ ఓ తప్పుడు ఇంటి చిరునామా ఇచ్చారని కేరళ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు. లగ్జరీ కార్ల పన్ను చెల్లింపు వివాదం పక్కన పెట్టినా, పలు సందర్భాల్లో ఆదాయపన్ను ఎగ్గొట్టిన తారలూ అనేకులు కనిపిస్తారు. ఇక, ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్లకు రెట్టింపు రేట్లతో ఓపెనింగ్ వసూళ్ళు తెచ్చుకొనే మాస్ హీరోలూ, టికెట్ అమ్మిన రేటుకూ – కట్టే వినోదపు పన్నుకూ పొంతన లేని సినీ వ్యాపారులూ మన తెలుగుతో సహా అన్నిచోట్లా తారసపడతారు. ఆ బాక్సాఫీస్ వాపును బలుపుగా చూపి, పారితోషికాలు పెంచుకొనే బడాబాబులు సామాన్యులకు తెరపై సుద్దులు చెబుతుంటారు. తీరా కట్టాల్సిన పన్ను దగ్గర తటపటాయిస్తున్నారు. ఓ పాత సూపర్‌హిట్ పాటలో అగ్రహీరో గారే అన్నట్టు, ‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అంటే ఇదేనేమో! న్యాయమూర్తి మాటల్లో చెప్పాలంటే, ‘పన్ను చెల్లింపు దేశాభివృద్ధికి తప్పనిసరి. అంతే తప్ప, అది తోచింది ఇచ్చే విరాళమో, దాతృత్వమో కాదు. పన్ను ఎగవేతంటే– దేశానికి ద్రోహం చేసే అలవాటు, ఆలోచన. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం!’ అది ‘హీరోలం’ అనుకొనేవాళ్ళు చేయదగిన పనేనా? -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సురేష్ గోపి (నటుడు); అర్జున్ కపూర్ (నటుడు) ఈ రోజుపుట్టిన వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించినది. పుట్టిన తేదీ శనికి సంబంధించినది. ఈ సంవత్సరం మంచి ఆదాయాన్ని కళ్లజూస్తారు. వ్యాపారం చేయాలనే కోరిక నెరవేరుతుంది! అన్నింటా అభివృద్ధి సాధిస్తారు. స్థలాలు, పొలాలు కొంటారు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడులు మీకు బంగారు బాట వేస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నెరవేరతాయి. ఉద్యోగులు ప్రమోషన్తోబాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటారు. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు మంచి పేరు ప్రతిష్ఠలు వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా ఆశావహంగా ఉంది. ప్రతి విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడటం, ఆరునూరైనా సరే, నమ్మిన సిద్ధాంతం మీదే నిలబడటం వలన మొండివాళ్లన్న పేరు తెచ్చుకుంటారు. లక్కీ నంబర్స్: 1,4,5,6,8; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: బ్లూ, వయోలెట్, క్రీమ్, గోల్డెన్; సూచనలు: నవగ్రహారాధన, పవిత్ర గ్రంథాలను పఠించడం, వృద్ధులకు, అనాథలకు సాయం చేయడం, వాదప్రతివాదనలను నేర్పుగా తప్పించుకోవడం. - డా. మహమ్మద్ దావూద్ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు