దేవుడు తప్ప ఎవ్వరూ పర్‌ఫెక్ట్ కాదు..!
భక్తి పాట, సినిమా పాట... ఏ పాటకైనా ఏసుదాస్ గాత్రం ఇట్టే ప్రాణం పోసేస్తుంది. ఇక ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఆయన ఉచ్చారణ ఉంటుంది. స్వతహాగా క్రైస్తవుడు అయినా, ఆయన పాడిన హైందవ భక్తి గీతాలను వింటే, ఎవరికైనా భక్తిభావం పుట్టుకు రావాల్సిందే. 16 భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఏసుదాస్‌ది. గత 50 ఏళ్లుగా సంగీత ప్రపంచంలో తిరుగులేని గాయకునిగా విరాజిల్లుతున్న ఈ గంధర్వ గాయకుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఏసుదాస్ మనోభావాలు ఈ విధంగా...
1961 నవంబర్ 14ని నేనెప్పటికీ మర్చిపోలేను. చెన్నయ్‌లోని భరణి స్టూడియోలో నా తొలి సినిమా పాట రికార్డ్ చేసిన రోజది. సంగీతదర్శకుడు ఎం.బి. శ్రీనివాసన్‌గారు స్వరపరచిన పాటను పాడాను. అదొక ప్రేమ పాట. ఎవరైనా సులువుగా పాడొచ్చు. కానీ, నాకంత ఈజీ అవ్వలేదు. ఎందుకంటే, అప్పుడు నాకు టైఫాయిడ్. దానివల్ల గొంతులో సన్నని వణుకు. దాంతో శ్రీనివాసన్‌గారు రిహార్సల్ చేయమన్నారు. అప్పటికి నాకు రిహార్సల్ అంటే ఏంటో కూడా తెలియదు. అది ఓ శ్లోకంలా ఉంది. మళ్లీ పాడాను. అద్భుతంగా వచ్చింది. శ్రీనివాసన్‌గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మొదటిసారి పాడుతున్నట్లు నాకనిపించలేదు. అందుకని పాడేశాను. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది.
నాకు చిన్నప్పట్నుంచీ ‘కల్యాణి’ రాగం అంటే ఇష్టం. ఎవరైనా పాట పాడమని అడిగితే, అదే పాడేవాణ్ణి. కానీ, ప్రతి రాగానికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుందని ఆ తర్వాత తెలుసుకున్నాను. అప్పట్నుంచీ అన్ని రాగాలూ పాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు నేనెలాంటి భయం లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో 72 మేళకర్త రాగాలు పాడగలను. దేవుడు తప్ప ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. కానీ, ఓ సింగర్‌కి పర్‌ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే.. ఓ పాట పాడుతున్నప్పుడు తను పాడుతున్నానని మర్చిపోగలిగినప్పుడు. ఓ పాట పాడుతున్నప్పుడు నేను స్వరాలలో లీనమైపోతాను. ఓ పర్టిక్యులర్ వైబ్రేషన్ నాలో కలుగుతుంది. ఆ సమయంలో నేనా దేవుడికి దగ్గరవుతా. అప్పుడు లభించే సంతృప్తిని దేనితోనూ వెలకట్టలేం.
మనమంతా భారతీయులం. మానవులుగా పుట్టాం. నేను పుట్టినప్పుడు ఏమీ కాను. ఒక పసిపిల్లాణ్ణి. ఓసారి మా అమ్మానాన్న నన్ను చర్చికి తీసుకెళితే, ఫాదర్ నన్ను ఆశీర్వదించారు. ఓసారి మా చర్చి ఫాదర్ క్రిస్టియన్లు మాత్రమే స్వర్గానికి వెళతారని చెప్పారు. అప్పుడు చంద్రన్, తిలకన్.. ఇలా ఇతర మతాలకు చెందిన నా స్నేహితులు స్వర్గానికి వెళ్లరా? అనిపించింది. కాలక్రమేణా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే, ఏ మతమైతే ఏంటి? అనిపించేంత మానసిక పరిపక్వత వచ్చింది. కేరళలోని తిరుపునితురాలో మధురై మణిగారి కచ్చేరీలు జరిగేవి. అప్పుడు నాకు శబరి టెంపుల్‌కి వెళ్లి ఆయన పాటలు వినాలని ఉండేది.
కానీ, గుడి లోపలికి అడుగుపెట్టకూడదని ఓ స్నేహితుడు అనడంతో బయట నిలబడే పాటలు విన్నాను. ఆ తర్వాత గుడి అధికారులకు నేను గుడిలోకి రావాలనుకుంటున్నానని లేఖ రాశాను. ఉపవాస దీక్షలు చేసినవారెవరైనా రావచ్చన్నారు. ఆ అయ్యప్ప ఓ అద్వైత మూర్తి. తనకు భేదభావాలు లేవు. అందుకేనేమో నేను ఆయన గుడికి వెళ్లగలిగాను. నేను నిత్యవిద్యార్థిని. సంగీతానికి సంబంధించిన సమస్తమూ నేర్చుకోవడానికి ఒక్క జన్మ సరిపోదు. నాకు మరుజన్మ ఉంటే అప్పుడూ సంగీత సాధనలోనే ఉండాలని కోరుకుంటున్నా. అదికూడా ఈ జన్మలో ఎక్కడైతే నా సంగీతం ముగిసిందో అక్కణ్ణుంచి మరుజన్మ మొదలవ్వాలి. అలా కాకుండా మళ్లీ మొదట్నుంచీ మొదలుపెట్టేలా ఆ దేవుడు నిర్ణయిస్తే ఇంకో జన్మ వద్దనుకుంటున్నా.