ప్రకృతికి మచ్చ తేకండి | Nature spot tekandi | Sakshi
Sakshi News home page

ప్రకృతికి మచ్చ తేకండి

Published Thu, Mar 27 2014 10:59 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

Nature spot tekandi

దైవికం
 
 కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం?
 
ముప్పై రెండు అంటే పెద్ద వయసేం కాదు. వైద్య వృత్తి అంటే చిన్న బాధ్యతేం కాదు. కానీ ఆ క్షణాన ఆ యువకుడికి ఇవేవీ గుర్తుకు రాలేదు. రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఎటైనా పారిపోదాం అనుకున్నాడు. డాక్టర్ కదా, వెంటనే దారి కనిపించింది. చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి మళ్లీ బతక్కుండా ఉండేందుకు గుప్పెడు మాత్రలు మింగేశాడు. అవి పని చేయవేమోనని, మెదడును దెబ్బతీసి ఖాయంగా చావును ప్రసాదించే ఇంజెక్షన్‌ను కూడా తనకు తాను ఇచ్చుకున్నాడు.

మెల్లిగా మరణావస్థలోకి జారుకున్నాడు. అలా జారిపోతున్నప్పుడు... అప్పుడు అనిపించిందతడికి ఎలాగైనా బతకాలని! ఒళ్లూ, కళ్లూ తేలిపోతున్నాయి. ‘‘ప్లీజ్ నన్ను బతికించండి’’ అని ప్రాధేయపడినట్లుగా సంజ్ఞ చేశాడు. ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఎవరో అతడి బంధువులకు తెలియజేశారు. రెండు గంటలు గడిచాయి. సర్ గంగారామ్ ఆసుపత్రి (ఢిల్లీ) వైద్యులు  శాయశక్తులా అతడిని బతికించడానికి కృషి చేస్తున్నారు.

ఆ యువకుడు ఏదో తెలివితక్కువగా రెండు మూడు మాత్రలు మింగలేదు. ఇది కాకపోతే అది అన్నట్లు తనపై రెండు మూడు రకాల ప్రయోగాలు చేసుకున్నాడు... ఏ దారిలోనైనా చావక పోతానా అనే ఆశతో! కానీ ఆసుపత్రిలో అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి... ఏ దారిలోనైనా బతికిపోలేనా అని!
 
వైద్యులకు ఆశ్చర్యపోవడానికి కూడా సమయం చిక్కలేదు. మొత్తానికి అతడి ఒంట్లోంచి విషాన్ని లాగేశారు. తిరిగి అతడికి ఆయువు పోశారు. ‘‘నా పాతికేళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదు’’ అన్నారు వారిలో ఒక డాక్టర్. ‘‘విరుగుడుగా అసలు ఏ మందు ఇవ్వాలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాం’’ అన్నారు ఇంకో డాక్టర్. మొత్తానికైతే ఇచ్చారు. అది పని చేసింది. ఆ యువకుడికి ఇచ్చిన ‘విరుగుడు వైల్’ ఒక్కోటి 1600 డాలర్లు.

రూపాయల్లో లక్ష! అలాంటి వైల్స్ 15 నుంచి 20 వరకు (అంటే 15-20 లక్షలు) ఇస్తే కానీ ఒక ప్రాణం నిలువలేదు. పైగా అది ఇండియాలో చాలా అరుదుగా దొరికే మందు. ఎలాగో సంపాదించారు. కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు... ఇంత మంది కలసి ఆ యువడాక్టర్‌ని కాపాడారు. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. తర్వాత ఒక సైకాలజిస్టును కూడా అతడి ఇంటికి పంపారు. ఇదొక అరుదైన కేసుగా ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్’ మార్చి నెల సంచికలో అచ్చయింది.
 
సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యను సమస్యగా చూస్తే ఇదిగో ఈ కుర్రడాక్టర్‌లాగే ఎక్కడికో వెళ్లిపోవాలనిపిస్తుంది. సవాలుగా తీసుకుంటే సమస్యలోంచే పరిష్కారం తడుతుంది. జీవితం అన్నివిధాలా మోడువారిందీ అనుకుందాం. శూన్యం తప్ప ఇంకేమీ మిగల్లేదనుకుందాం. ఆ శూన్యాన్నే కొంతకాలం ఉండనివ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చూడకుండానే ‘వెళ్లిపోయి’ ఓడిపోవడం ఎందుకు? ఏమో గెలుస్తామేమో!

మన గెలుపు అవకాశాలను మనమే కాలదన్నుకుని, కాదనుకుని తొందరపడడం ఎందుకు? శిశిరం తర్వాత వసంతం రాక తప్పదు. కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం? ప్రకృతి ఏనాడూ ఏ రుతువు కోసమూ తొందరపడదు. ఏ రుతువునూ కాదనుకోదు. కాలంతో పాటు కొన్ని వదిలించుకుని, కొన్ని తగిలించుకుని, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మనిషి ఆ కొత్తదనం నుంచి స్ఫూర్తి పొందాలి తప్ప...  బతకలేని క్షణాల్లోంచి పారిపోయి, బతుకే లేదనుకుని భయపడిపోయి, బతకవలసిన అవసరాన్ని మర్చిపోయి మతిని గతి తప్పించకూడదు. ప్రకృతికి మచ్చ తేకూడదు.       

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement