the medical profession
-
వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం
గుంటూరు మెడికల్: వైద్యవృత్తి దేవుడిచ్చిన వరం అని, వైద్య వృత్తిలో ఉన్న వారు రోగుల పట్ల జాలి, దయ కల్గి ఉండాలని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో బుధవారం వైద్య కళాశాల 2009 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ కెరీర్ కోసం పరుగులు తీస్తున్న నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ కోసం ఒకరోజు కేటాయించుకుని తమకు నచ్చిన విధంగా ఉండాలని సూచించారు. జీవితంలో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని, జీవితమే పెద్ద కళాశాల అని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా విలువలు పాటించాలన్నారు. వైద్యుడు నిరంతరం విద్యార్థిగా ఉండాలని తెలిపారు. సంపాదనలో కొంత తప్పనిసరిగా సమాజానికి విరాళంగా ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న వారికి డిగ్రీ పట్టాలను అందజేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బోధన చేసిన గురువులకు, వృత్తి ఎదుగుదలకు తోడ్పడుతున్న రోగులకు కృతజ్ఙత కల్గి ఉండాలని చెప్పారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరికపర్తి శైలబాల మాట్లాడుతూ వృత్తిలో ఎదుగుదలకు మెడికల్ ఎతిక్స్ పాటించాలని చెప్పారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.ఎస్.రాజునాయుడు మాట్లాడుతూ ఆదర్శ వైద్యులుగా ఉండాలన్నారు. ఆర్థోపెడిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ మద్దెల ప్రశాంత్ ఇతర వైద్యులు వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో యువవైద్యులతోపాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ డిగ్రీలను అందుకున్న పిదప వైద్యులంతా గ్రూప్‌ఫోటో దిగి ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ తల్లిదండ్రులతో, గురువులతో, స్నేహితులతో కలిసి ఫొటోలు దిగి తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. -
ప్రజలకు భరోసా కల్పించాలి
మెరుగైన వైద్య సేవలు అందించాలి ఏఎన్ఎంలకు కలెక్టర్ కిషన్ సూచన కేఎంసీలో జిల్లా స్థాయి సమీక్ష ఎంజీఎం : వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగులు గ్రామీణ ప్రజలతో మమేకమై... వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించేలా వైద్య సేవలందించాలని ఏఎన్ఎంలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలందించడాన్ని మన బాధ్యతగా గుర్తెరగాలన్నారు. ఇలాంటి పవిత్రమైన వృత్తి మీరు చేపట్టడం అదృష్టంగా భావించి పనిచేయాలన్నారు. సమాజంలో 75 శాతం మంది బలహీన వర్గాల వారున్నారని, వారందరూ పేదరికంలో ఉన్నారని గ్రహించి పనిచేయాలన్నారు. మనం కూడా ఆ స్థాయి నుంచే ఎదిగామని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు వేసుకున్న తెల్లని దుస్తులు శాంతికి, సేవకు, సహనానికి, నిబద్ధతకు చిహ్నాలని... వాటిని గుర్తెరిగి ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రసవాలకు సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 108 వాహన సేవలను 22 శాతం మందే వినియోగించుకుంటున్నారని , దీన్ని మరింత పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కాన్పులు జరిపేందుకు ఏర్పాట్లున్నాయని, ఈ విషయం గ్రామీణ ప్రజలకు తెలుపాలన్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు గర్భిణులు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకునేవిధంగా చూడాలన్నారు. వైద్య వృత్తిలో ఉన్న మీరు మీ సెల్‌ఫోన్ నంబర్‌ను మీ పరిధిలోని రోగులందరికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. తద్వారా వారికి వైద్య సేవలతోపాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు సైతం ఏఎన్ఎంలు కృషిచేయూలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పనిచేసే వారు తప్పనిసరిగా ప్రధాన కార్యస్థానంలో ఉండి పనిచేయాలన్నారు. తద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణ తేలికవుతుందన్నారు. జననీ సురక్షా యోజన కింద గర్భిణులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా ప్రారంభించడానికి బ్యాంకు అధికారులు సహకరించడం లేదని పలువురు ఏఎన్ఎంలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏయే బ్యాంకులు నిరాకరిస్తున్నాయని వివరాలు అడిగి ఆయన నోట్ చేసుకున్నారు. ఇక నుంచి మీకు రావాల్సిన వేతనాలు నెల మొదటి తేదీనాడే అందజేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి చెప్పారు. అనంతరం నూతన రాష్ట్రంలో వైద్య వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తామని ఏఎన్ఎంలు కలెక్టర్ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావుతోపాటు వేరుు మంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ప్రకృతికి మచ్చ తేకండి
దైవికం కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం? ముప్పై రెండు అంటే పెద్ద వయసేం కాదు. వైద్య వృత్తి అంటే చిన్న బాధ్యతేం కాదు. కానీ ఆ క్షణాన ఆ యువకుడికి ఇవేవీ గుర్తుకు రాలేదు. రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఎటైనా పారిపోదాం అనుకున్నాడు. డాక్టర్ కదా, వెంటనే దారి కనిపించింది. చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి మళ్లీ బతక్కుండా ఉండేందుకు గుప్పెడు మాత్రలు మింగేశాడు. అవి పని చేయవేమోనని, మెదడును దెబ్బతీసి ఖాయంగా చావును ప్రసాదించే ఇంజెక్షన్‌ను కూడా తనకు తాను ఇచ్చుకున్నాడు. మెల్లిగా మరణావస్థలోకి జారుకున్నాడు. అలా జారిపోతున్నప్పుడు... అప్పుడు అనిపించిందతడికి ఎలాగైనా బతకాలని! ఒళ్లూ, కళ్లూ తేలిపోతున్నాయి. ‘‘ప్లీజ్ నన్ను బతికించండి’’ అని ప్రాధేయపడినట్లుగా సంజ్ఞ చేశాడు. ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఎవరో అతడి బంధువులకు తెలియజేశారు. రెండు గంటలు గడిచాయి. సర్ గంగారామ్ ఆసుపత్రి (ఢిల్లీ) వైద్యులు శాయశక్తులా అతడిని బతికించడానికి కృషి చేస్తున్నారు. ఆ యువకుడు ఏదో తెలివితక్కువగా రెండు మూడు మాత్రలు మింగలేదు. ఇది కాకపోతే అది అన్నట్లు తనపై రెండు మూడు రకాల ప్రయోగాలు చేసుకున్నాడు... ఏ దారిలోనైనా చావక పోతానా అనే ఆశతో! కానీ ఆసుపత్రిలో అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి... ఏ దారిలోనైనా బతికిపోలేనా అని! వైద్యులకు ఆశ్చర్యపోవడానికి కూడా సమయం చిక్కలేదు. మొత్తానికి అతడి ఒంట్లోంచి విషాన్ని లాగేశారు. తిరిగి అతడికి ఆయువు పోశారు. ‘‘నా పాతికేళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదు’’ అన్నారు వారిలో ఒక డాక్టర్. ‘‘విరుగుడుగా అసలు ఏ మందు ఇవ్వాలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాం’’ అన్నారు ఇంకో డాక్టర్. మొత్తానికైతే ఇచ్చారు. అది పని చేసింది. ఆ యువకుడికి ఇచ్చిన ‘విరుగుడు వైల్’ ఒక్కోటి 1600 డాలర్లు. రూపాయల్లో లక్ష! అలాంటి వైల్స్ 15 నుంచి 20 వరకు (అంటే 15-20 లక్షలు) ఇస్తే కానీ ఒక ప్రాణం నిలువలేదు. పైగా అది ఇండియాలో చాలా అరుదుగా దొరికే మందు. ఎలాగో సంపాదించారు. కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు... ఇంత మంది కలసి ఆ యువడాక్టర్ని కాపాడారు. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. తర్వాత ఒక సైకాలజిస్టును కూడా అతడి ఇంటికి పంపారు. ఇదొక అరుదైన కేసుగా ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్’ మార్చి నెల సంచికలో అచ్చయింది. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యను సమస్యగా చూస్తే ఇదిగో ఈ కుర్రడాక్టర్లాగే ఎక్కడికో వెళ్లిపోవాలనిపిస్తుంది. సవాలుగా తీసుకుంటే సమస్యలోంచే పరిష్కారం తడుతుంది. జీవితం అన్నివిధాలా మోడువారిందీ అనుకుందాం. శూన్యం తప్ప ఇంకేమీ మిగల్లేదనుకుందాం. ఆ శూన్యాన్నే కొంతకాలం ఉండనివ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చూడకుండానే ‘వెళ్లిపోయి’ ఓడిపోవడం ఎందుకు? ఏమో గెలుస్తామేమో! మన గెలుపు అవకాశాలను మనమే కాలదన్నుకుని, కాదనుకుని తొందరపడడం ఎందుకు? శిశిరం తర్వాత వసంతం రాక తప్పదు. కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం? ప్రకృతి ఏనాడూ ఏ రుతువు కోసమూ తొందరపడదు. ఏ రుతువునూ కాదనుకోదు. కాలంతో పాటు కొన్ని వదిలించుకుని, కొన్ని తగిలించుకుని, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మనిషి ఆ కొత్తదనం నుంచి స్ఫూర్తి పొందాలి తప్ప... బతకలేని క్షణాల్లోంచి పారిపోయి, బతుకే లేదనుకుని భయపడిపోయి, బతకవలసిన అవసరాన్ని మర్చిపోయి మతిని గతి తప్పించకూడదు. ప్రకృతికి మచ్చ తేకూడదు.