- మెరుగైన వైద్య సేవలు అందించాలి
- ఏఎన్‌ఎంలకు కలెక్టర్ కిషన్ సూచన
- కేఎంసీలో జిల్లా స్థాయి సమీక్ష
ఎంజీఎం : వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగులు గ్రామీణ ప్రజలతో మమేకమై... వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించేలా వైద్య సేవలందించాలని ఏఎన్‌ఎంలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలందించడాన్ని మన బాధ్యతగా గుర్తెరగాలన్నారు. ఇలాంటి పవిత్రమైన వృత్తి మీరు చేపట్టడం అదృష్టంగా భావించి పనిచేయాలన్నారు. సమాజంలో 75 శాతం మంది బలహీన వర్గాల వారున్నారని, వారందరూ పేదరికంలో ఉన్నారని గ్రహించి పనిచేయాలన్నారు. మనం కూడా ఆ స్థాయి నుంచే ఎదిగామని గుర్తుంచుకోవాలని సూచించారు.
మీరు వేసుకున్న తెల్లని దుస్తులు శాంతికి, సేవకు, సహనానికి, నిబద్ధతకు చిహ్నాలని... వాటిని గుర్తెరిగి ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రసవాలకు సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 108 వాహన సేవలను 22 శాతం మందే వినియోగించుకుంటున్నారని , దీన్ని మరింత పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కాన్పులు జరిపేందుకు ఏర్పాట్లున్నాయని, ఈ విషయం గ్రామీణ ప్రజలకు తెలుపాలన్నారు.
స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీల వద్దకు గర్భిణులు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకునేవిధంగా చూడాలన్నారు. వైద్య వృత్తిలో ఉన్న మీరు మీ సెల్‌ఫోన్ నంబర్‌ను మీ పరిధిలోని రోగులందరికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. తద్వారా వారికి వైద్య సేవలతోపాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు సైతం ఏఎన్‌ఎంలు కృషిచేయూలని పిలుపునిచ్చారు.
గిరిజన ప్రాంతంలో పనిచేసే వారు తప్పనిసరిగా ప్రధాన కార్యస్థానంలో ఉండి పనిచేయాలన్నారు. తద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణ తేలికవుతుందన్నారు. జననీ సురక్షా యోజన కింద గర్భిణులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా ప్రారంభించడానికి బ్యాంకు అధికారులు సహకరించడం లేదని పలువురు ఏఎన్‌ఎంలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏయే బ్యాంకులు నిరాకరిస్తున్నాయని వివరాలు అడిగి ఆయన నోట్ చేసుకున్నారు.
ఇక నుంచి మీకు రావాల్సిన వేతనాలు నెల మొదటి తేదీనాడే అందజేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి చెప్పారు. అనంతరం నూతన రాష్ట్రంలో వైద్య వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తామని ఏఎన్‌ఎంలు కలెక్టర్ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావుతోపాటు వేరుు మంది ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.