Vol. Kishan
-
ప్రజలకు భరోసా కల్పించాలి
మెరుగైన వైద్య సేవలు అందించాలి ఏఎన్ఎంలకు కలెక్టర్ కిషన్ సూచన కేఎంసీలో జిల్లా స్థాయి సమీక్ష ఎంజీఎం : వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగులు గ్రామీణ ప్రజలతో మమేకమై... వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించేలా వైద్య సేవలందించాలని ఏఎన్ఎంలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలందించడాన్ని మన బాధ్యతగా గుర్తెరగాలన్నారు. ఇలాంటి పవిత్రమైన వృత్తి మీరు చేపట్టడం అదృష్టంగా భావించి పనిచేయాలన్నారు. సమాజంలో 75 శాతం మంది బలహీన వర్గాల వారున్నారని, వారందరూ పేదరికంలో ఉన్నారని గ్రహించి పనిచేయాలన్నారు. మనం కూడా ఆ స్థాయి నుంచే ఎదిగామని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు వేసుకున్న తెల్లని దుస్తులు శాంతికి, సేవకు, సహనానికి, నిబద్ధతకు చిహ్నాలని... వాటిని గుర్తెరిగి ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రసవాలకు సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 108 వాహన సేవలను 22 శాతం మందే వినియోగించుకుంటున్నారని , దీన్ని మరింత పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కాన్పులు జరిపేందుకు ఏర్పాట్లున్నాయని, ఈ విషయం గ్రామీణ ప్రజలకు తెలుపాలన్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు గర్భిణులు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకునేవిధంగా చూడాలన్నారు. వైద్య వృత్తిలో ఉన్న మీరు మీ సెల్‌ఫోన్ నంబర్‌ను మీ పరిధిలోని రోగులందరికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. తద్వారా వారికి వైద్య సేవలతోపాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు సైతం ఏఎన్ఎంలు కృషిచేయూలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పనిచేసే వారు తప్పనిసరిగా ప్రధాన కార్యస్థానంలో ఉండి పనిచేయాలన్నారు. తద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణ తేలికవుతుందన్నారు. జననీ సురక్షా యోజన కింద గర్భిణులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా ప్రారంభించడానికి బ్యాంకు అధికారులు సహకరించడం లేదని పలువురు ఏఎన్ఎంలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏయే బ్యాంకులు నిరాకరిస్తున్నాయని వివరాలు అడిగి ఆయన నోట్ చేసుకున్నారు. ఇక నుంచి మీకు రావాల్సిన వేతనాలు నెల మొదటి తేదీనాడే అందజేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి చెప్పారు. అనంతరం నూతన రాష్ట్రంలో వైద్య వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తామని ఏఎన్ఎంలు కలెక్టర్ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావుతోపాటు వేరుు మంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
పైసలపంచాయితీ !
పంపకాల్లో తేడాతో బట్టబయలు అధికారులపై సిబ్బంది ఫిర్యాదు కలెక్టర్ వద్దకు చేరిన రగడ పరిశీలించాలని డీఆర్వోకు ఆదేశం సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ప్రక్రియ ముగిసింది. విజయవంతంగా ఎన్నికలు పూర్తయినందున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ ఇటీవలే రెవెన్యూ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ విందు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇప్పుడు ఎన్నికల నిర్వహణ నిధుల పంచాయితీ మొదలైంది. అధికారుల తీరుతో ఇబ్బంది పడిన పోలింగ్ సిబ్బంది ఇప్పడు ఫిర్యాదుల పరంపరకు తెరతీశారు. మొత్తంగా ఎన్నికల నిధుల గోల్మాల్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. చాలా ప్రాంతాల్లో ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు ఉన్నతాధికారులకు లెక్కల నివేదికలు చేరాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కౌంటింగ్ పూర్తయిన దగ్గరి నుంచి చాలా నియోజకవర్గాల్లో చెల్లింపుల విషయంలో అధికారులు, సిబ్బంది మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈ పంచాయితీ శనివారం ఏకంగా కలెక్టర్ జి.కిషన్ వద్దకు చేరింది. దీనిపై స్పందించిన కలెక్టర్ నిధుల ఖర్చు విషయంలో ఏం జరిగిందో పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్‌ను ఆదేశించారు. జనగామ అసెంబ్లీకి సంబంధించి ఫిర్యాదు వచ్చినట్లు డీఆర్వో సురేంద్రకరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఖర్చుల కోసం ప్రభుత్వ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున కోటి రూపాయాలు కేటాయించింది. ఆ నిధులన్నీ పూర్తిగా ఖర్చు చేసినట్లు నియోజకవర్గ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 సెగ్మెంట్ల వివరాలు జిల్లా కేంద్రానికి అందాయి. ఎన్నికల నిధుల విషయంలో నియోజకవర్గ అధికారుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. పోలింగ్ బూత్‌ల వద్ద తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించడం... కోడ్ అమలు చేయడం వంటి పనుల కోసం వీఆర్వోలు డబ్బులు ఖర్చు చేశారు. వీటితోపాటు వీఆర్వోలకు ప్రయాణ, భోజన ఖర్చులు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇవ్వకుండా అధికారులు చోద్యం చూశారు. స్వయంగా కలెక్టర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు. దీంతో వీఆర్వోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో చివరి నిమిషంలో వీఆర్వోలు ఆందోళన విరమించుకున్నారు. ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌కు రూ.1300... మరికొన్ని చోట్ల రూ.300 చొప్పున అధికారులు చెల్లించారు. ప్రయాణ, భోజన ఖర్చుల విషయంలో ఇదే జరిగింది. ఇచ్చింది తీసుకోవాలని అధికారులు, ఖర్చు చేసినంత ఇవ్వాలని సిబ్బంది పట్టుబట్టారు. దీంతో పంచాయితీ కలెక్టర్ వద్దకు చేరింది. లెక్కల్లో తేడాలు... ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో అధికారులు చెప్పిందే లెక్క. వీటిపై ప్రత్యేకంగా ఆడిట్ అంటూ ఉండదు. అందుకే ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లే ఉంటారు. జనగామ నియోజకవర్గ పరిధిలో లెక్కల పంచాయితీతో వ్యవహారం బయటపడింది. రిటర్నింగ్ అధికారి (ఆర్వో), తహసీల్దార్ (ఏఆర్వో), డిప్యూటీ తహసీల్దారు (డీడీఓ) మధ్య లెక్కల్లో తేడాలు రావడంతో ఎవరి లెక్కలు వారు సరిచేసుకున్నారు. టెంట్ సామాన్లు, జీరాక్స్ విషయంలో పెద్దమొత్తంలో లెక్కలు చూపారు. చివరకు సిబ్బందికి చెల్లించే విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నారు. చేసేదిలేక నియోజకవర్గంలోని ఉద్యోగులందరూ శనివారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. నియోకజవర్గ ఆర్వో, ఏఆర్వో మధ్య రూ.10 లక్షల పంపకాల్లో తేడా రావడంతో పంచాయితీ కాగా... ఈ వ్యవహారం ఫిర్యాదుల వరకు చేరినట్లు వారు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలోనూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఫిర్యాదుల వచ్చాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఏఆర్వో తీరుపైనా ఇక్కడ సిబ్బంది ఇదే రకమైన ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
జిల్లా ఓటర్లు.. 2496622
పురుషులు 1249531..మహిళలు 1246906 వరంగల్ పశ్చిమలో ఎక్కువ.. పరకాలలో తక్కువ తుదిజాబితా విడుదల చేసిన కలెక్టర్ నేటి నుంచి మళ్లీ నమోదుకు అవకాశం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ శుక్రవారం ప్రకటించారు. తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 24,96,622 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 12,49,531 కాగా.. మహిళలు 12,46,906 మంది ఉన్నారు. వీరితో పాటు ‘ఇతరులు’ కేటగిరీలో 185 మంది నమోదయ్యారు. 1-1-2014 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండినవారందరికీ జాబితాలో చోటు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులకు.. ముసాయిదా జాబితా ప్రకటన తరువాత 1.50 లక్షలవరకు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపునకు దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ ద్వారా, నేరుగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హులందరికీ జాబితాలో చోటు కల్పించారు. శుక్రవారం తుది జాబితా ప్రకటన తరువాత ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం మళ్లీ ఆన్‌లైన్‌ద్వారా, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం జాబితాలో పేర్లున్న అందరూ ఆన్‌లైన్‌ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. అయితే నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా కన్నా.. శుక్రవారం ప్రకటించిన తుది జాబితాలో 19,731మంది ఓటర్లు తక్కువగా నమోదుకావడం విశేషం. జాబితాలోని కొన్ని ముఖ్య విషయాలు... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 23,3905 ఓటర్లతో అత్యధిక ఓట ర్లున్న నియోజకవర్గంగా మొదటిస్థానంలో ఉంది. తరువాత స్థానం లో భూపాలపల్లి నియోజక వర్గం ఉంది. పరకాలలో 18,7434 మంది ఓట ర్లతో జిల్లాలో అతి తక్కువ ఓట ర్లున్న నియోజకవర్గంగా ఉంది. తరువాత స్థానంలో డోర్నకల్ ఉం ది. రెండు నియోజక వర్గాల మధ్య 16ఓటర్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. జిల్లా ఓటర్లలో మహిళల కన్నా పురుషులు 2625 మంది ఎక్కువగా ఉన్నారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సం పేట, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో పురుషులకన్నా మహిళలు అధికంగా ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మహిళల కన్నా పురుషులు 10మంది ఎక్కువ ఉన్నారు. జాబితాలో ‘ఇతరుల’ కేటగిరీలో 185 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో అత్యధికంగా తూర్పులో 56మంది ఉన్నారు. తరువాత స్థానం భూపాలపల్లిది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయి దా జాబితాలో జిల్లా ఓటర్లు 25,16, 353 మంది వుండగా తుదిజాబితా ప్ర కారం 24,96,622 మంది ఉన్నారు.