పైసలపంచాయితీ !
- పంపకాల్లో తేడాతో బట్టబయలు
- అధికారులపై సిబ్బంది ఫిర్యాదు
- కలెక్టర్ వద్దకు చేరిన రగడ
- పరిశీలించాలని డీఆర్వోకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ప్రక్రియ ముగిసింది. విజయవంతంగా ఎన్నికలు పూర్తయినందున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ ఇటీవలే రెవెన్యూ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ విందు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇప్పుడు ఎన్నికల నిర్వహణ నిధుల పంచాయితీ మొదలైంది.
అధికారుల తీరుతో ఇబ్బంది పడిన పోలింగ్ సిబ్బంది ఇప్పడు ఫిర్యాదుల పరంపరకు తెరతీశారు. మొత్తంగా ఎన్నికల నిధుల గోల్‌మాల్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. చాలా ప్రాంతాల్లో ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు ఉన్నతాధికారులకు లెక్కల నివేదికలు చేరాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
కౌంటింగ్ పూర్తయిన దగ్గరి నుంచి చాలా నియోజకవర్గాల్లో చెల్లింపుల విషయంలో అధికారులు, సిబ్బంది మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈ పంచాయితీ శనివారం ఏకంగా కలెక్టర్ జి.కిషన్ వద్దకు చేరింది. దీనిపై స్పందించిన కలెక్టర్ నిధుల ఖర్చు విషయంలో ఏం జరిగిందో పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్‌ను ఆదేశించారు. జనగామ అసెంబ్లీకి సంబంధించి ఫిర్యాదు వచ్చినట్లు డీఆర్వో సురేంద్రకరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఖర్చుల కోసం ప్రభుత్వ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున కోటి రూపాయాలు కేటాయించింది. ఆ నిధులన్నీ పూర్తిగా ఖర్చు చేసినట్లు నియోజకవర్గ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 సెగ్మెంట్ల వివరాలు జిల్లా కేంద్రానికి అందాయి. ఎన్నికల నిధుల విషయంలో నియోజకవర్గ అధికారుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది.
పోలింగ్ బూత్‌ల వద్ద తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించడం... కోడ్ అమలు చేయడం వంటి పనుల కోసం వీఆర్వోలు డబ్బులు ఖర్చు చేశారు. వీటితోపాటు వీఆర్వోలకు ప్రయాణ, భోజన ఖర్చులు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇవ్వకుండా అధికారులు చోద్యం చూశారు. స్వయంగా కలెక్టర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు. దీంతో వీఆర్వోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో చివరి నిమిషంలో వీఆర్వోలు ఆందోళన విరమించుకున్నారు. ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌కు రూ.1300... మరికొన్ని చోట్ల రూ.300 చొప్పున అధికారులు చెల్లించారు. ప్రయాణ, భోజన ఖర్చుల విషయంలో ఇదే జరిగింది. ఇచ్చింది తీసుకోవాలని అధికారులు, ఖర్చు చేసినంత ఇవ్వాలని సిబ్బంది పట్టుబట్టారు. దీంతో పంచాయితీ కలెక్టర్ వద్దకు చేరింది.
లెక్కల్లో తేడాలు...
ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో అధికారులు చెప్పిందే లెక్క. వీటిపై ప్రత్యేకంగా ఆడిట్ అంటూ ఉండదు. అందుకే ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లే ఉంటారు. జనగామ నియోజకవర్గ పరిధిలో లెక్కల పంచాయితీతో వ్యవహారం బయటపడింది. రిటర్నింగ్ అధికారి (ఆర్వో), తహసీల్దార్ (ఏఆర్వో), డిప్యూటీ తహసీల్దారు (డీడీఓ) మధ్య లెక్కల్లో తేడాలు రావడంతో ఎవరి లెక్కలు వారు సరిచేసుకున్నారు. టెంట్ సామాన్లు, జీరాక్స్ విషయంలో పెద్దమొత్తంలో లెక్కలు చూపారు.
చివరకు సిబ్బందికి చెల్లించే విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నారు. చేసేదిలేక నియోజకవర్గంలోని ఉద్యోగులందరూ శనివారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. నియోకజవర్గ ఆర్వో, ఏఆర్వో మధ్య రూ.10 లక్షల పంపకాల్లో తేడా రావడంతో పంచాయితీ కాగా... ఈ వ్యవహారం ఫిర్యాదుల వరకు చేరినట్లు వారు తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలోనూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఫిర్యాదుల వచ్చాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఏఆర్వో తీరుపైనా ఇక్కడ సిబ్బంది ఇదే రకమైన ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.