వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం | God's gift to the medical profession | Sakshi
Sakshi News home page

వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం

Published Thu, Mar 26 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

God's gift to the medical profession

గుంటూరు మెడికల్: వైద్యవృత్తి దేవుడిచ్చిన వరం అని, వైద్య వృత్తిలో ఉన్న వారు రోగుల పట్ల జాలి, దయ కల్గి ఉండాలని ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో బుధవారం వైద్య కళాశాల 2009 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ  కెరీర్ కోసం పరుగులు తీస్తున్న నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ కోసం ఒకరోజు కేటాయించుకుని తమకు నచ్చిన విధంగా ఉండాలని సూచించారు. జీవితంలో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని, జీవితమే పెద్ద కళాశాల అని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా విలువలు పాటించాలన్నారు.

వైద్యుడు నిరంతరం విద్యార్థిగా ఉండాలని తెలిపారు. సంపాదనలో కొంత తప్పనిసరిగా సమాజానికి విరాళంగా ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న వారికి డిగ్రీ పట్టాలను అందజేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బోధన చేసిన గురువులకు, వృత్తి ఎదుగుదలకు తోడ్పడుతున్న రోగులకు కృతజ్ఙత కల్గి ఉండాలని చెప్పారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరికపర్తి శైలబాల మాట్లాడుతూ  వృత్తిలో ఎదుగుదలకు మెడికల్ ఎతిక్స్ పాటించాలని చెప్పారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.ఎస్.రాజునాయుడు మాట్లాడుతూ ఆదర్శ వైద్యులుగా ఉండాలన్నారు.

ఆర్థోపెడిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్  మద్దెల ప్రశాంత్ ఇతర వైద్యులు వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో యువవైద్యులతోపాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ డిగ్రీలను అందుకున్న పిదప వైద్యులంతా గ్రూప్‌ఫోటో దిగి ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ తల్లిదండ్రులతో, గురువులతో, స్నేహితులతో కలిసి ఫొటోలు దిగి తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు.

Advertisement
Advertisement