దేవుని మాట వినబడనివ్వని సైరన్‌లు!
దైవికం
మాల్థస్ అనుకున్నట్లు మనిషినిక్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే.
బిల్ వాటర్సన్ అమెరికన్ చిత్రకారుడు, కార్టూనిస్ట్. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘కాల్విన్ అండ్ హాబ్స్’ 1985 నుంచి 1995 వరకు పదేళ్ల పాటు ప్రతిరోజూ ప్రపంచ పత్రికల్ని అలరించింది. సున్నితమైన హాస్యం, సునిశితమైన సామాజిక స్పృహ కలగలిసిన సెటైర్‌లు అవి. రాజకీయాలు, ఒపీనియన్ పోల్స్, పర్యావరణం, ప్రజావిద్య, ఫిలాసఫీ... దేన్నీ వదిలిపెట్టకుండా అన్ని అంశాలపైనా కాల్విన్ (ఆరేళ్ల బాలుడు), హాబ్స్ (ఒళ్లంతా వెటకారం నిండిన పులి) అనే రెండు పాత్రలను అడ్డుపెట్టుకుని కార్టూన్లు గీశారాయన. వాటిల్లోని ఓ కార్టూన్‌లో ఒక పిల్లవాడు తన తండ్రిని ఇలా అడుగుతాడు: ‘‘డాడ్, సోల్జర్లు ఒకళ్లనొకళ్లని చంపుకోవడం ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఎలా అవుతుంది?’’ అని! యుద్ధం మీద వాటర్సన్ ప్రయోగించిన క్షిపణి అది.
ప్రస్తుతం ప్రపంచమంతా రెండు యుద్ధాల గురించి మాట్లాడుకుంటోంది. మొదటిది: పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న ఏకపక్ష యుద్ధం. రెండోది: నూరేళ్లు నిండిన మొదటి ప్రపంచ యుద్ధం. మొ.ప్ర. యుద్ధంలో ముప్పై దేశాలు పాల్గొన్నాయి. దాదాపు కోటి మంది మరణించారు. అయినా ఆ యుద్ధం నుంచిగానీ, ఇంకే యుద్ధం నుంచి కానీ మనిషి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే, తర్వాతి యుద్ధానికి (నాలుగో ప్రపంచ యుద్ధానికి) మనుషుల దగ్గర కర్రలు, రాళ్లు తప్ప వేరేమీ ఉండవు’’ అని ఐన్‌స్టీన్ అన్నారు. మనిషి మళ్లీ ఆదిమ కాలానికి వెళ్లిపోతాడని దీని అర్థం.
అసలు మనుషులు యుద్ధాలు ఎందుకు చేసుకుంటారు? పొరపాటు. మనుషులు యుద్ధాలు చేసుకోరు. దేశాలు చేసుకుంటాయి. అమెరికన్లకు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించడానికి దేవుడు యుద్ధాన్ని సృష్టించాడని మార్క్ టై్వన్ అంటారు, సరదాగా. నేర్పించడానికి దేవుడి దగ్గర చిన్న చిన్నవి చాలానే ఉంటాయి. అంత పెద్ద యుద్ధమే అక్కర్లేదు. అయినా అన్ని మతాలూ శాంతినే ప్రవచించాయి కనుక దేవుడు యుద్ధ వ్యతిరేకి అనుకోవాలి. అయినప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయంటే దైవభీతిని మించిన దేశభక్తి ఏదో సోల్జర్ తలపైన కూర్చుని ఉండాలి. బ్రిటన్ తత్వరచయిత జి.కె.ఛెస్టర్‌టన్ ఏమంటారంటే, నిజమైన సిపాయి తన కళ్లెదుట కనిపించే వాటిపై ద్వేషం కారణంగా పోరాడడట, తన వెనుక ఉన్నదానిపై (దేశం) ప్రేమతో కదనరంగంలోకి దూకుతాడట!
బహుశా ఇప్పుడు పాలస్తీనాపై కురుస్తున్న బాంబుల వర్షంలో చిన్నారులు, స్త్రీలు, అమాయకులు మరణించడం వెనుక అలాంటి దేశభక్త సైనికులే ఉండి ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిందీ ఈ దేశభక్తులే కావచ్చు. ఏమైనా నాడు జరిగిన ఘోరాలు కానీ, నేడు జరుగుతున్న దారుణాలు గానీ దేవుడికి ప్రియమైనవని, దేవుని సంకల్పానుసారం జరుగుతున్నవనీ అనుకోలేం. అసలు దుష్టశక్తి అంశ ఉన్నది ఏదైనా దేవుడికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది?
ప్రముఖ ఆర్థికవేత్త, జనాభా సిద్ధాంతకర్త థామస్ రాబర్ట్ మాల్థస్ ఒకచోట ఆలోచనలో పడతాడు. లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా? అన్న సందేహం ఆయనకు కలుగుతుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా అనీ సందేహపడతాడు. కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అనుకుంటాడు. అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా అని తనకు తనే సమాధానం చెప్పుకుంటాడు. మాల్థస్ అనుకున్నట్లు మనిషిని క్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే.
1995లో ‘కాల్విన్ అండ్ హాబ్స్’ని ఆపేసే ముందు దాని సృష్టికర్త బిల్ వాటర్సన్, వార్తాపత్రికల సంపాదకులకు, పాఠకులు చిన్న ప్రకటన విడుదల చేశారు ‘‘ఈ కార్టూన్ స్ట్రిప్’ని ఆపవలసిన తరుణం వచ్చేసింది. దీని ద్వారా నేను చెప్పదలచుకుంది చెప్పేశాను’’ అని. ఎక్కడ ఆపాలన్న స్పృహ మనుషులకు ఉంటుంది తప్ప ఎక్కడ ఆగిపోవాలన్న స్పృహ యుద్ధాలకు ఉండదు. స్పృహలేని యుద్ధాలు దేవుని మాట వినబడనివ్వని సైరన్‌లు.
- మాధవ్ శింగరాజు