దేవుడికి దగ్గరవడం ఎలా?! | How close to God ?! | Sakshi
Sakshi News home page

దేవుడికి దగ్గరవడం ఎలా?!

Published Thu, Aug 21 2014 11:24 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

దేవుడికి దగ్గరవడం ఎలా?! - Sakshi

దేవుడికి దగ్గరవడం ఎలా?!

దైవికం
 
క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్‌టు గాడ్‌లీనెస్. పరిశుభ్రత అనేది దాదాపుగా దైవత్వమేనట! అంటే నిర్మాలిన్యం మనిషిని దేవుడికి చేరువ చేస్తుందని అర్థం. ఎవరన్నారు ఈ మాట? మదర్ థెరిస్సానా? అనే ఉంటారు. రోగులను ఆమె శుభ్రం చేశారు. రోగగ్రస్థ హృదయాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. పరిశుద్ధ గ్రంథాలలో కూడా ఈ మాట ఉండే ఉంటుంది. సరిగ్గా ఇవే మాటలతో  కాకున్నా, ఇదే అర్థం వచ్చేలా. జాన్ వెస్లీ అనే మత బోధకుడు తొలిసారి 1778లో ఒకానొక తన ప్రసంగంలో  ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్‌లీనెస్’ అన్నట్లు అక్కడక్కడ రిఫరెన్సులు ఉన్నాయి. అలాగే ఈ మాట అతి ప్రాచీనమైన బాబిలోనియా, హీబ్రూ మత సంప్రదాయాలలోనిదని సూచించే ఉటంకింపులూ కనిపిస్తుంటాయి.

నిజానికి ఈ మాట పుట్టవలసింది ఇప్పుడు! చెత్తను చుట్టూ కొండలా పేర్చుకుని మనిషి ‘హాయిగా’ జీవిస్తున్న ఈ ఆధునిక కాలానికి చెందవలసిన  సామెత ఇది. చేతులకో, చెవులకో, కళ్లకో కాస్తయినా చెత్త అంటుకోనిదే మనిషిని మనిషిగా పోల్చుకోలేనంతగా రోజులు చెత్త దిబ్బలై కదిలిపోతున్నాయి.

చుట్టూ సెల్‌ఫోన్‌లు.. మధ్యలో మనిషి! చుట్టూ టీవీ ఛానళ్లు.. మధ్యలో మనిషి. చుట్టూ యాప్‌లు, ఆన్‌లైన్ షాపులు, ఈఎమ్మయ్ సదుపాయాలు... వీటన్నిటి మధ్యా మనిషి! వస్తు వ్యామోహం ఇంటిని, ఒంటినీ చెత్తతో నింపేస్తోంది. ఇక దేవుడికి చోటెక్కడ? మనతో పాటు వచ్చి టీవీ ముందు కూర్చుంటానంటేనే భగవంతుడికైనా ఇంత ప్లేస్ దొరుకుతుందేమో! దేవుణ్ణి కూడా కలుపుకుపోయేంత ఉదారత్వాన్ని మనలో కలిగించే ప్రోగ్రామ్‌లే అన్నీ! అసుర సంధ్య వేళ దాటాక  మొదలయ్యే దయ్యపు సీరియళ్లు, క్రైమ్ కహానీలైతే మన బుర్రకు కావలసినంత చెత్త.

దేవుడు వచ్చిందీ, పోయిందీ కూడా తెలియనంత ఎంటర్‌టైన్‌మెంట్! మనిషి కారణంగా భూమి నిండా ఇంత చెత్త పేరుకుపోతుందని ఏ యుగంలోని దైవమూ ఊహించి ఉండకపోవచ్చు. మనిషిని నడిపిస్తున్నది ఇప్పుడు ప్రాణం కాదు, పరిసరాల్లోని చిందరవందర! బట్టలతో, అవి పాతబడిపోకుండానే వచ్చి చేరే కొత్త బట్టలతో, బజార్ నుంచి కట్టుకొచ్చిన పాలిథీన్ కవర్లతో,  ఎలక్ట్రానిక్ భూతాలను ఇంటికి చేర్చిన కార్టన్ బాక్సులతో సహజీవనం చేస్తుంటే తప్ప ఊపిరి ఆడని స్థితిలోకి మనిషి వెళ్లిపోయాడు.

షెల్ఫులో చిన్న కాగితం ముక్క లాగితే మొత్తం అక్కడున్న వస్తువులన్నీ పడిపోవాలి. వంటింట్లో చక్కెర డబ్బా మూత తెరుస్తుంటే, మోచేయి తగిలి మిక్సీ పైకప్పు ఎగిరిపడి వంటింట్లో అడుగుతీసి అడుగు వేసే దారే లేకుండా పోవాలి. అటకల మీద ఎన్నటికీ అవసరం పడని అమూల్యమైన మూటలుండాలి. స్టోర్ రూమ్ తలుపులను తోసుకుని విరిగిన కుర్చీలు, దూది రేగుతుండే పరుపులు వచ్చిపడుతుండాలి. అప్పుడే జీవితం నిండుగా ఉన్నట్లు!
 
పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ఇలా అంటారు. దేవునికి ధన్యవాదాలు. మనిషికి గనుక రెక్కలు ఉండి ఉంటే ఈ భూమిని చెత్తతో నింపిన విధంగా, ఆకాశంలోనూ తన అమూల్యమైన చెత్తను పోగేసుకునేవాడు-అని. మనిషి పైన, మనిషి కింద, మనిషి పక్కన ఉన్న చెత్త గురించి మాత్రమే థోరో మాట్లాడారు. మనిషి లోపల ఉండే చెత్త గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించినట్లు లేకున్నా, ఫిలాసఫర్ కాబట్టి తప్పకుండా ఆలోచించే ఉంటారు.
 
మనిషి లోపలి చెత్త.. మనిషి చుట్టుపక్కల చెత్త కన్నా దుర్గంధభూయిష్టమైనది. అసలు బయటి చెత్తకు.. లోపలి చెత్తే కదా మూల పదార్థం. లోపల, బయట ఇంత చెత్త ఉంటే దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం అయ్యే పనేనా? ‘‘ఎక్కడ చెత్త ఉంటే అక్కడ శుభ్రం చేసే ప్రయత్నాన్ని ఇవాళే మొదలు పెట్టి చూడండి. మీరు శుభ్రం చేసిన చోటుకు మీ ప్రయత్నం లేకుండానే దివ్యత్వం వచ్చి చేరుతుంది’’ అంటారు జాన్ వెస్లీ.  ఇది బయటి చెత్తకు. మరి లోపలి చెత్త ఎలా పోవాలి? గాంధీజీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ‘‘మురికి పాదాలతో నా మనసును తొక్కుకుంటూ వెళ్లే అవకాశాన్ని నేనెవరికీ ఇవ్వను’’ అన్నారాయన. చెత్త మాటలను వినకపోవడం కూడా దేవుడికి దగ్గరయ్యేందుకు ఒక మార్గమే.
 
- మాధవ్ శింగరాజు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement