భయం మంచిదే!
ప్రతిమనిషికీ ఎంతో కొంత భయం అవసరం. అయితే ఈ భయం కేవలం భయంగా కాక గౌరవంతో కూడి ఉండాలి. అలా గౌరవం ఉన్నప్పుడు తప్పు చేయకూడదనే ఆలోచన కలగడమే కాక, తప్పు చేసి పెద్దల మనసు నొప్పించకూడదనే భావన ఏర్పడుతుంది. భయం అనేది మనిషి సక్రమమార్గంలో నడవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భావన కలిగినప్పుడు ఆ వ్యక్తి తప్పు చేయడానికి వెనకాడతాడు. ‘పెద్దలను తూలనాడితే నరకానికి పోతావు’ అని ఎవరైనా అన్నప్పుడు, ‘నరకం అనేదే లేదు కదా, ఇంక అక్కడికి ఎలా పోతామనే భావన ఉంటే ఆ వ్యక్తి తçప్పు చేయడానికి వెనకాడడు.
అలా కాక... ‘నరకం ఉంది, అక్కడ భయంకరమైన శిక్షలు పడతాయి’ అనే భయం ఉన్నప్పుడు తప్పు చేయడానికి జంకుతాడు. ఇతరుల సొమ్మును హరిస్తే రెట్టింపు సొమ్మును పోగొట్టుకుంటామనే భయం ఉన్నప్పుడు పరుల సొమ్మువైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయరు. తల్లిదండ్రులను గౌరవించకుండా, వారిని వీధిన పడేసేవారికి ముందుముందు మన పిల్లలు కూడా మనలను ఈ విధంగానే చూస్తారు అనే భయం ఉంటే పెద్దలను జాగ్రత్తగా చూస్తారు. కేవలం భయం లేకపోవడం వల్లే భ్రష్టుపట్టి పోయిన వారు... సీతను అపహరించిన రావణుడు; ఇంకా కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు... చెప్పుకుంటూ పోతే ఎందరో. వీరందరికీ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోవడం వల్లే అలా భ్రష్టుపట్టిపోయారు. అందుకే గురువులు విద్యార్థులకు భయంతో కూడిన గౌరవాన్ని, సన్మార్గాన్ని అలవరుస్తారు.