అమ్మ ఇక లేరు..
అమ్మ ఇక లేరు..
Published Sun, Mar 26 2017 10:45 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పీఠాధిపతి గాడ్ సతీమణి సీతామహాలక్ష్మి కన్నుమూత
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, భక్తులు
వెదురుపాక(రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సతీమణి సీతామహాలక్ష్మి(70) ఆదివారం కన్నుమూశారు. ఉదయం పది గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), కుటుంబ సభ్యులు సీతయ్యమ్మను రాయవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం పీఠానికి తీసుకుని వచ్చారు. పీఠాధిపతి గాడ్ సీతయ్యమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సీతయ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి వెళ్లే సమయంలో నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కిన సీతమ్మ అమ్మవారు కొద్ది నిమిషాల్లోనే తిరిగి మృతదేహమై రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సీతయ్యమ్మను గాడ్‌తో సమానంగా భక్తులు పూజిస్తారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే అధిక సంఖ్యలో భక్తులు పీఠానికి తరలివచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు.
కోటిపల్లిలో అంత్యక్రియలు..
సీతమ్మ అమ్మవారి మృతదేహానికి రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవులో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. గాడ్ సోదరుడు, పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు.
పలువురు ప్రముఖులు గాడ్‌ను స్వయంగాను, ఫోన్‌లోనూ పరామర్శించారు. మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సర్పంచ్ కొండిపూడి సత్యప్రభ ఏసురత్నం, సొసైటీ అధ్యక్షుడు సత్తి వీరవెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి హిమరాణిసావిత్రిదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కొవ్వూరి సరోజాదేవి, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, పలువురు సాహితీవేత్తలు మేడసాని మోహన్, చిలకపాటి రాఘవాచార్యులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement