లోపల - బయట
దైవికం
జీవితంలో ఎన్నో రంగులుంటాయి. రకరకాల కోణాలుంటాయి. మంచి మనుషులు ఉంటారు. మంచి మాటలు ఉంటాయి. అయినా జీవితం విసుగెత్తిపోతోందంటే?!
జీవితం చిన్న మాట. అది విసుగెత్తడం పెద్ద మాట! అంత పెద్ద మాటని దుబారాగా అనేస్తుంటాం. జీవితం ఊరికే ఎందుకు విసుగెత్తుతుంది? జీవితంలో ఎన్నో రంగులుంటాయి. రకరకాల కోణాలుంటాయి. మంచి మనుషులు ఉంటారు. మంచి మాటలు ఉంటాయి. అయినా జీవితం విసుగెత్తిపోతోందంటే... జీవితం అని మనం అనుకుంటున్న దాంట్లో ఉండిపోయి, అందులోంచే జీవితాన్ని చూస్తుంటాం కనుక.
ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకో, పెళ్లయ్యాక కొన్నేళ్లకో జీవితంలో ఇంకేం లేదని మనకు తెలిసిపోతుంది! ఆ క్షణం నుంచి జీవించడం మానేస్తాం. జీవితానికి గౌరవం ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోతాం. గ్రాసు, నెట్టు తప్ప జీవితం అంటే మరేం లేదని; భర్త, పిల్లలు తప్ప జీవితానికి మరే పరమార్థం లేదనీ అనిపిస్తుంటే విసుగెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. పారిపోయాక అక్కడా విసుగెత్తితే! ఆ నిస్తేజం, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, నీరసం (అన్నీ కలిసిందే విసుగు) జీవితంలో లేవని, అవి మనలోనివి మాత్రమేనని అర్థం.
‘‘దేవుడు చేసే పనేమిటంటే... మనల్ని గమనిస్తూ ఉండడం, మనకు బోర్ కొట్టినప్పుడు మనల్ని చంపేస్తుండడం. అందుకే మనం ఎప్పుడూ బోర్ కొడుతున్నట్లు కనిపించకూడదు’’ అంటాడు ఛక్ పలనిక్ అనే అమెరికన్ రచయిత తన ‘ఇన్‌విజిబుల్ మాన్‌స్టర్’ పుస్తకంలో. సరదాగా మనల్ని భయపెట్టేందుకు అని ఉంటాడీమాట అతడు.
దేవుడంటే భయం ఉండడం కూడా మంచిది. జీవితం బోర్ కొట్టదు. ఎందుకంటే పాపపుణ్యాల గురించి ఆలోచిస్తాం. క్రమం తప్పకుండా దేవుడి పటానికి దండం పెట్టుకుంటాం. గుడికి వెళ్లొస్తుంటాం. దానధర్మాలు చేస్తుంటాం. పండగలకి సిద్ధం అవుతుంటాం. దర్శన ప్రయాణాలు చేసొస్తుంటాం. భయంతోనే కాకుండా భక్తితో కూడా ఇవన్నీ చేస్తుంటాం. అయితే దేవుడి సమక్షంలో భయమూ భక్తీ రెండూ ఒకటే. ఈ రెండూ కూడా మనిషిని క్షణం కూడా తీరిగ్గా ఉంచవు, తీరిగ్గా లేనిపోనివి ఆలోచించనివ్వవు. చేతిలో పని ఉంటుంది, చెయ్యబోయే పనుల క్రమం ఉంటుంది. ఇక విసుగెత్తడానికి సమయం ఎక్కడ?
మనిషి తనకైతాను జీవితం నుండి విడిపోయి విసుగ్గా ముఖం పెడతాడేమో కానీ, దైవత్వం ఎప్పుడూ జీవితంలో కలిసే ఉంటుంది. జీవితంలోని ప్రతి అంశంలో, ప్రతి అడుగులో, ప్రతి నిమిషం దైవత్వాన్ని వీక్షించాలి మనిషి. అప్పుడు మాత్రమే జీవితేచ్ఛ కలుగుతుంది. జీవితేచ్ఛ ఉన్నచోట ‘విసుగు’ అనే మాట ఉండదు. ఆంగ్ల రచయిత జి.కె.ఛెస్టర్‌టన్ అంటారు, అనాసక్తంగా ఉండే మనుషులు తప్ప, లోకంలో ఎక్కడా ఆసక్తి కలిగించని విషయాలు ఉండవని.
ఈసారి జీవితంపైన నెపం వేసే ముందు మీరెక్కడుండి ఆ మాట అంటున్నారో ఆలోచించండి. జీవితం లోపల ఉండి అంటున్నారో, జీవితం బయట నిలబడి అంటున్నారో చూసుకోండి. జీవితం లోపల ఉన్నవారికి విసుగు అనేదే అనిపించదు. జీవితం బయట ఉన్నవారికి విసుగుతప్ప మరేదీ కనిపించదు.
- భావిక