2022 నోబెల్ గ్రహీత ఆనీ ఎర్నౌ
ఆనీ ఎర్నౌ రచనలకు గానీ, శైలికి గానీ అంత ‘వాడి’ ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి ఎప్పటికప్పుడు పదును తేలుతూ ఉంటాయి! రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆమె రచనల సారం. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడి ఉన్న వాళ్ల కోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ!
సాహిత్యంలో ఇప్పటివరకు పదహారు మంది నోబెల్ గ్రహీతలతో అత్యధికంగా విజేతలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. వారిలో ఏకైక మహిళ ఆనీ ఎర్నౌ. 2022 సంవత్సరానికి గాను ఆనీ నోబెల్ విజేతగా నిలిచారు. ఆమె కంటే ముందు 2014లో ప్యాట్రిక్ మాడియానో, 2008లో జె.ఎం.జి. క్లెజియో ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో 1940లో జన్మించిన ఆనీ ఎర్నౌ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగారు. జీవిక కోసం ఆమె తల్లిదండ్రులు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకా ణాన్ని నడుపుతుండేవారు. తర్వాతి కాలంలో ఆ దుకాణం బార్‌గా, కెఫేగా విస్తరించింది. అక్కడికంతా శ్రామిక వర్గమే వస్తుండేది. తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఆనీ యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించి, అనంతరం టీచరుగా మారారు. రచయిత్రిగా మారారు. వర్గ వ్యత్యాసాలు, పితృస్వామ్య వ్యవస్థ, అసమానతలు వంటి విస్తృత సామాజిక అంశాలను తన రచనల్లో చర్చించారు.
ఆనీ ఎర్నౌ తొలి నవల ‘క్లీన్డ్ ఆఫ్’ (ఫ్రెంచిలో లెజ్ ఆర్మ్‌వార్ విడేస్) 1974లో వచ్చింది. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 1983లో వచ్చిన ‘ఎ మ్యాన్స్ ప్లేస్’తోనే. తల్లిదండ్రులు నడిపిన కెఫేలో తను ఎదుగుతున్నప్పటి జ్ఞాపకాలను అందులో రాసుకున్నారామె. తర్వాత 1987లో ‘ఎ ఉమన్ స్టోరీ’ అనే నవల రాశారు. అది ఆనీ తల్లి కథ. అక్కడి నుంచి అంతా రచనా ప్రవాహమే. 2008లో ‘ది ఇయర్స్’ పుస్తకం వచ్చే నాటికి కాలానుక్రమ వైయక్తిక స్మృతుల సమ్మేళనంగా అనేకానేక రచనల్ని చేశారు. ‘ది ఇయర్స్’ ఆనీ స్వీయ గాథ. ఆ నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం కాగానే (లెజ్ అన్నీస్ అన్నది ఫ్రెంచి టైటిల్) ఆనీ పేరు సాహితీ ప్రపంచంలో మార్మోగిపోయింది. 1940లు, 90ల మధ్య కాలంలో ఒక స్త్రీ జీవితంలోని ఉత్థాన పతనాలను కథనపరచిన ఈ రచన... మూడో మనిషి చెబుతున్నట్లుగా ముందుకు సాగుతుంది. పాత ఫొటోలను, సినిమా జ్ఞాపకాలను జత పరుస్తూ బాల్యం నుంచి తల్లి అయ్యేవరకు తన జీవితాన్ని అందులో అక్షరబద్ధం చేశారు ఆనీ.
1960లలో తమ కుటుంబం ఎలా జీవించిందీ చెబుతూ, ‘‘మేమెంత సమయాన్ని పొదుపు చేశామో చూసుకుని ఆశ్చర్యపోయే వాళ్లం. సిద్ధంగా అందుబాటులో ఉండే మిరప పొడులతో మా సూప్ తయారయ్యేది. ప్రెస్టో ప్రెషర్ కుక్కర్‌తో త్వరత్వరగా వంట చేసే వాళ్లం. ‘యమోనైజ్’ అయితే రెడీమేడ్‌గా ట్యూబులలో దొరికేసేది. గుడ్డు పచ్చసొన, నూనె, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ మసాలా సాస్‌ను మేమెప్పుడూ సమయం వెచ్చించి సొంతంగా సిద్ధం చేసు కున్నది లేదు. బఠాణీలను తోటలోంచి తెంపుకొచ్చే పని లేకుండా క్యాన్‌లలో లభించేవాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్లం. చెట్టుపై పండే బేరీ పండ్లను కాకుండా బేరీ పండ్ల సిరప్‌ను వాడేవాళ్లం. జీవితం ఎంత సరళం అయిపోయింది! అదంతా కూడా శతాబ్దాల ప్రయాసలను తుడిచిపెట్టేసే అద్భుతమైన ఆవిష్కరణల ఫలితమే. ఒకరోజు వస్తుంది.. మనమిక ఏదీ చేసుకునే పని లేకుండా’’ అని రాశారు ఆనీ. 1967 గురించి, గర్భ నిరోధక మాత్రల చట్టబద్ధత గురించి చెబుతూ– ‘‘ఆ మాత్రలు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయని మేము భావించాం. భీతిగొలిపే మా దేహాల నుంచి మాకు విముక్తి లభిస్తుం దనీ, మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆ మాత్రలతో మాకూ వచ్చేస్తుందనీ అనుకున్నాం’’ అని రాసుకున్నారు. తన దేశ పౌరురాలికి సాహిత్యంలో నోబెల్ వచ్చిందని తెలియగానే, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘గత యాభై ఏళ్లుగా ఆనీ ఎర్నౌ దేశ క్రమానుగతులతో పాటు దేశంలోని ప్రజా సమూహాల చారిత్రక జ్ఞాపకాలను అక్షరీకరిస్తున్నారు’’ అని ప్రశంసించారు.
ఆనీ రచనా శైలి కత్తిలా పదునైనది. ‘కత్తి పదునులా రాయడం’ పేరుతో 2003లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు. ఆమె రచనలకు గానీ, శైలికి గానీ అంత పదును ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి పదునెక్కుతాయి. రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆనీ రచనల్లోని పోరాటం కూడా. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. ఫ్రాన్స్‌లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో ఆమె ‘హ్యాపెనింగ్’ నవల రాశారు. ఆ నవలను అదే పేరుతో ఆడ్రీ దివాన్ సినిమాగా తీశారు. గత ఏడాది విడుదలైన ఆ సినిమా 2021 వెనిస్ చలన చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ అవార్డు గెలుచుకుంది. సూపర్ మార్కెట్ సంస్కృతి దృక్కోణం నుంచి ఆనీ 2014 లో రాసిన నవల ‘రిగార్డ్‌లెస్ ల్యూమినరీస్’ సామాజిక అసమానతల్ని సునిశి తంగా పరిశీలించింది. ఈ ఏడాదే విడుదలైన ఆమె కొత్త పుస్తకం ‘జ్యాన్ ఓమె’ తన కన్నా 30 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి దాపరికం లేకుండా చెబుతుంది. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడిపోయిన వాళ్ల కోసం, అసమానతలపై మూగ సాక్షులుగా మిగిలిపోయిన బాధితులకోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ ఎర్నౌ.
ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత మార్సెల్ ప్రూస్ట్ రచనా సంవిధానానికి ప్రూస్టియన్ స్టెయిల్ అని పేరు. కోల్పోయిన గతాన్ని పునరుద్ధరించే, అపస్మారక జ్ఞాపకశక్తిని ప్రేరేపించే గుణం కలిగి ఉండే ఆయన ధోరణే ఆనీ రచనల్లోనూ కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ కనుమరుగైపోయే జ్ఞాపకాలను అంటి పెట్టుకుని ఉండేందుకు తన రచనను ఒక మార్గంగా ఆమె నిర్మించుకున్నారు. ‘‘ఒక్క సెకనులో అంతా తుడిచి పెట్టుకు పోతుంది. ఊయలకు, మరణశయ్యకు మధ్య పేరుకుపోయిన పదాల నిఘంటువు పక్కకు ఒరిగిపోతుంది. ఇక మిగిలింది నిశ్శబ్దం. మాటలకు పదాలు ఉండవు. ‘నేను’, ‘నాకు’ అనేవి నోటిలోంచి బయ టికి రావు. నలుగురు చేరి నవ్వుకునే వేళ తరాల విస్తారమైన అనామ కత్వంలోకి అదృశ్యం అయ్యే వరకు మనం మన పేరు తప్ప మరేమీ కాదు... మన పేరును ఎవరైనా ఒక కాగితం మీద పెట్టేవరకు’’ అని రాస్తారామె.
ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డ్యూ ‘‘కళంకానికి గురైనవారికి జ్ఞాపకశక్తి అధికం’’ అంటారు. అవమానం జరిగిన జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేము. 1997లో ఆనీ రాసిన ‘షేమ్’ పుస్తకంలోని కథాంశం ఇదే. భారతీయ దళిత రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను కూడా ఆమె చదివారు. ఓం ప్రకాశ్ వాల్మీకి రాసిన ‘జూఠన్ : యాన్ అన్‌టచబుల్ లైఫ్’ వాటిలో ఒకటి. ఇటీవలే ఈ పుస్తకం ఫ్రెంచిలోకి తర్జమా అయింది. అదొక ప్రామాణికమైన అత్మకథ. ముల్క్ రాజ్ అనంద్ రచనలు కూడా ఆమెకు సుపరిచితమే.
మరికొన్ని నెలల్లో ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ జరగబోతోంది. ఆనీ ఎర్నౌ నోబెల్ గెలుచుకున్న సందర్భం ఒక్కటే కాదు... ఇండియా గౌరవ అతిథిగా ఫ్రాన్స్ ఆ పుస్తక ప్రదర్శనకు వస్తుండటం, 20 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి రచయితల బృందం హాజరవుతుండటం కూడా బుక్ ఫెయిర్‌కు మరింత ప్రాధ్యాన్యం తెచ్చింది. ‘పి.ఎ.పి. (పబ్లికేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్) టాగోర్’ పేరుతో ఇండియా, రొమెయిన్ రోలాండ్ అవార్డ్’ (అపీజే ఆక్స్‌ఫర్డ్ బుక్ స్టోర్స్ భాగస్వామ్యంతో ఉత్తమ అనువాదానికి ప్రదానం చేసే అవార్డు)తో ఫ్రాన్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చుకోబోయే పరస్పర ప్రచురణ సహకారంతో మరిన్ని ఫ్రెంచి పుస్తకాలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే అవకాశం కలుగుతుందని మనం ఆశించవచ్చు. యాదృచ్ఛికమే అయినా ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. టాగోర్ (1913), రొమెయిన్ రోలాండ్ (1915) ఇద్దరూ సాహిత్యంలో నోబెల్ గ్రహీతలే.
ఎమ్మాన్యుయేల్ లెనెయిన్
వ్యాసకర్త ఇండియాకు ఫ్రాన్స్ రాయబారి
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment