జీఎం పంటలు చేపట్టాలి
ఆకలి చావుల నివారణకు అదే మార్గం
నోబెల్ అవార్డు గ్రహీత సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆకలిచావులను తప్పించుకోవాలంటే జన్యుమార్పిడి(జీఎం) పంటలను పెద్ద ఎత్తున చేపట్టక తప్పదని నోబెల్ అవార్డు గ్రీహ త సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు, గ్రీన్‌పీస్ వంటి స్వచ్ఛంద సంస్థలు జన్యుమార్పిడి పంటల విషయంలో అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఇక్కడి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జీఎం పంటలు మంచివి కావన్న మాటలు నిజం కాదని, పేద దేశాల ఆహార భద్రతకు, మెరుగైన దిగుబడులకు ఇవి అత్యవసరమని చెప్పారు. జీఎం పంటల వల్ల మేలు జరుగుతుందన్న విషయం గ్రీన్‌పీస్ వారికీ తెలుసని, కానీ ఏటా అందే కోటానుకోట్ల నిధుల కోసం వీటిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
దిగుబడులు పెరిగితే జీవవైవిధ్యం సాధ్యమే..
జన్యుమార్పిడి పంటల ద్వారా దిగుబడులు 4 రెట్లు పెరిగితే అవసరాలు తీరతాయి కాబట్టి.. అప్పుడు రకరకాల పంటలు పెంచవచ్చని, తద్వారా జీవవైవిధ్యం పెరుగుతుందని రిచర్డ్స్ అన్నారు. గ్రీన్‌పీస్ వ్యవస్థాపకుడు ప్యాట్రిక్ మూర్ సైతం ఇప్పుడు జీఎం పంటలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు.
పాశ్చాత్య పోకడలు వద్దు
పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా పెట్టుబడుదారీ వ్యవస్థను ప్రచారం చేస్తూ ప్రపంచంలో అశాంతి పెరిగిపోయేందుకు కారణమవుతోందని రిచర్డ్స్ అన్నారు. వ్యవసాయంలో వారు తాము ఆహారంగా తీసుకునే పంటలనే ఎంచుకుని, వాటి దిగుబడులు పెంచి ప్రపంచానికి అందిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల పంటల్ని వీరు అభివృద్ధి చేయరన్నారు. కార్యక్రమంలో సీసీఎంబీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ పీఎం భార్గవ తదితరులు పాల్గొన్నారు.