పురస్కారం: హరగోవింద్ ఖొరానా .. జీవసాంకేతిక బ్రహ్మ | Great Scientist : Hargobind Khorana Nobel Prize winner | Sakshi
Sakshi News home page

పురస్కారం: హరగోవింద్ ఖొరానా .. జీవసాంకేతిక బ్రహ్మ

Published Sun, Nov 24 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

పురస్కారం:  హరగోవింద్ ఖొరానా .. జీవసాంకేతిక బ్రహ్మ

పురస్కారం: హరగోవింద్ ఖొరానా .. జీవసాంకేతిక బ్రహ్మ

నోబెల్ ఇండియా: హరగోవింద్ ఖొరానా 1952 లో ఎస్తర్ ఎలిజబెత్ సిబ్లర్ అనే స్విస్ వనితను పెళ్లాడారు. వారికి జూలియా ఎలిజబెత్, ఎమిలీయాన్ అనే ఇద్దరు కూతుళ్లు, దేవ్‌రాయ్ అనే కుమారుడు కలిగారు.
 
 అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో సర్. సి.వి.రామన్ తదనంతరం పేర్కొనదగిన శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా. ఈయన అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రదేశం పాకిస్తాన్‌లో ఉంది. ఈయనకు 1968వ సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రదానం జరిగింది. ఖొరానా ఫిజియాలజీ (శరీర ధర్మశాస్త్రం, మెడిసిన్ విభాగం)లో జన్యువులపై పరిశోధనలు చేశారు.
 
 హరగోవింద్ ఖొరానా జీవితం:
 హరగోవింద్ ఖొరానా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూర్ గ్రామంలో 1922వ సంవత్సరం జనవరి 9వ తేదీన జన్మించారు. వీరిది పేద కుటుంబం. హరగోవింద్ తండ్రి రాయపూర్ గ్రామంలో పన్ను వసూలు చేసే గుమాస్తా (ఫట్వాన్). ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. వారిలో ఖొరానా కడపటివాడు. చిన్న ఉద్యోగం మీద జీవిస్తూ కూడా పిల్లలకు మంచి చదువులు చెప్పించారాయన. ఆ ఊరిలో చదువుకున్న కుటుంబం వీరిది ఒక్కటే.
 
 విద్య... పరిశోధనలు:
 హరగోవింద్ ఖొరానా లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివారు. 1943లో బీఎస్సీ, 1945లో ఎమ్మెస్సీ పట్టాను పొందారు. అదే సంవత్సరంలో ఆయన స్కాలర్‌షిప్ (ఉపకారవేతనం)తో ఇంగ్లండు వెళ్లి, లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ కర్బన రసాయన శాస్త్రంలో పరిశోధనలు జరిపి, 1948వ సంవత్సరంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. వెంటనే ఆయన స్విట్జర్లాండ్‌లోని ‘జ్యూరిక్’ నగరంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా కొద్దికాలం పనిచేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తిరిగివచ్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేశారు. కేంబ్రిడ్జిలో పనిచేస్తున్న తరుణంలోనే ఖొరానా దృష్టి బయో కెమిస్ట్రీలో ప్రొటీన్లు, న్యూ క్లియర్ ఆమ్లాల రసాయన శాస్త్రంపై పడింది.
 
  ఈ దశలో 1952వ సంవత్సరంలో ఖొరానా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో ఆచార్యునిగా చేరి, న్యూక్లియర్ ఆమ్లాల ఫాస్ఫేట్ ఎస్టర్లపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయా వర్సిటీలలో ప్రయోగ పరికరాలు తన పరిశోధనలకు తగినట్లుగా లేకపోవటంతో 1960లో ఖొరానా విస్కాన్‌సిన్‌లోని ఎంజైమ్‌ల పరిశోధన సంస్థలో చేరారు. అక్కడ పది సంవత్సరాల పాటు పనిచేసిన ఖొరానా, ప్రతిష్టాత్మకమైన ఎమ్‌ఐటీలో బయాలజీ, రసాయన శాస్త్రాల విభాగంలో ఆల్‌ఫ్రెడ్.పి.స్లోన్ ఆచార్యునిగా స్థిరపడ్డారు.
 
 ఖొరానా ఆవిష్కరణలు:
 జీవ కణాలలోని ప్రొటీన్లు నిర్వహించే విధులను నిర్ణయించే జన్యువుల కోడ్‌ను సంకేతాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నారు హరగోవింద్ ఖొరానా. జన్యు ధర్మాలను నియంత్రించే న్యూక్లియర్ ఆమ్లాలలో ఉండే నాలుగు ప్రధానమైన బేస్ అణువులు 1. ఎడినీన్ 2. సైటోసిన్ 3. యూరసిల్ 4.గ్వానిన్. ఇవి ఒక్కొక్క క్రమంలో అమరి, ఒక్కొక్క ఎమైనో ఆమ్లానికి సంకేతంగా ఉంటాయి. ఈ అమరికలననుసరించి ఆయా ఎమైనో ఆమ్లాల వరుసలు ఏర్పడతాయి. ఉదాహరణకు, నిరేన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు న్యూక్లియర్ ఆమ్ల క్రమం U U U (3 యూరసిల్ యూనిట్లు)గా ఉంటే... అది ఫినైల్ ఎలనీన్ అనే ఎమైనో ఆమ్లానికి సంకేతమని నిర్థారించారు. హరగోవింద్ ఖొరానా పూర్తిగా కర్బన రసాయన సంశ్లేషణా విధానాలతో భిన్నమైన ఎమైనో ఆమ్లాలకు కోడ్‌లైన్ బేస్ అణువుల క్రమం (UCU CUCUCU) మొదలైన వాటిని తయారుచేసి చూపించారు. ఈ విధమైన మూడేసి యూనిట్లు (ఉదా: UCU, CUC మొదలైన పదాలు) మొత్తం 64 ఉన్నాయని, ఈ మూడేసి యూనిట్‌ల క్రమాన్ని బట్టి ఆయా ఎమైనో ఆమ్లాలు, వాటి వరుసలను నిర్థారించవచ్చునని కనుగొన్నారు. ఈ విధంగా ప్రయోగశాలలో డీఎన్‌ఏ (డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం) సంశ్లేషణ చేయగల్గిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడిగా హరగోవింద్ ఖొరానా పేరుపొందారు.
 
 నోబెల్ పురస్కారం:
 జన్యువులలోని కోడ్‌లను సమగ్రంగా వివరించగలగటంతో, జన్యువులలో తగు విధంగా మార్పులు చేయటం, జీవరాశులలో జన్యు మార్పిడి విధానాల ద్వారా జన్యువులలో అవాంఛిత లక్షణాలు తొలగించటం, అవసరమైనచోట్ల జన్యు మార్పిడి చేయగలగటం వంటి ఎన్నో విధానాలు అమలులోకి వచ్చాయి. ఖొరానా చేసిన ఈ పరిశోధనల ఫలితంగా ఈ రంగం ‘బయో టెక్నాలజీ’ అనే ప్రత్యేకమైన శాస్త్ర విభాగంగా ఏర్పడింది. జన్యువుల ఉత్పత్తి పారిశ్రామికంగా చేపట్టడానికి కూడా వీలు కలిగింది.
 
  ఈ ఆవిష్కరణలకు గాను ఖొరానాకు ఫిజియాలజీ (శరీర ధర్మ శాస్త్రం) విభాగంలో 1968వ సంవత్సరపు నోబెల్ పురస్కారం అందింది. ఈ పురస్కారాన్ని ఎమ్‌ఐటీకి చెందిన ఖొరానాకు, కార్నెల్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్. డబ్ల్యూ. హాలీ, ఎన్‌ఐహెచ్‌కి చెందిన  మార్షల్. డబ్ల్యూ. నిరేన్ బర్గ్‌లకు సంయుక్తంగా ప్రకటించారు. హరగోవింద్ ఖొరానాకు 1968లో లెస్టర్ పురస్కారం, 1987లో యూఎస్‌ఏ సైన్స్ మెడల్ కూడా లభించాయి. ఖొరానా ఎమ్‌ఐటీ నుంచి 2007లో పదవీ విరమణ చేశారు.  2011 నవంబర్ 9వ తేదీన కన్నుమూసేనాటికి ఆయన వయసు 89 ఏళ్లు.
 
 2013 నోబెల్ గ్రహీతలు నాస్తికుణ్ని కరుణించిన ‘దైవకణం’

 2013వ సంవత్సరంలో భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన నోబెల్ పురస్కారాన్నిఇంగ్లండులోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు పీటర్ హిగ్స్ అనే 84 ఏళ్ల శాస్త్రజ్ఞుడు, బెల్జియం దేశంలో బ్రస్సెల్స్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన ఫ్రాంకోయ్ ఎంగ్లెర్ట్ అనే మరో శాస్త్రవేత్తకు కలిపి ప్రకటించారు. విశ్వ నిర్మాణానికి ఆధారమైన పరమాణువులలోని సూక్ష్మ కణాలలోకెల్లా అతి సూక్ష్మమైన ‘బోసాన్’ వేదా హిగ్స్ కణాల ఉనికిని ప్రయోగాత్మకంగా నిరూపించినందుకు, తద్వారా విశ్వంలోని పదార్థాలు ఏర్పడే విధానం అవగాహన చేసుకునే సౌకర్యం కలిగించినందుకు వీరికి ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం అందజేశారు.
 
 బోసాన్‌లు (Bosons) లేదా హిగ్స్ కణాల ఉనికిని 1924వ సంవత్సరంలోనే సత్యేంద్రనాథ్ బోస్ అనే భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో కలిసి మొదటిసారిగా ప్రతిపాదించారు. అందుకే శ్రీ సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం హిగ్స్, ఎంగ్లెర్ట్ శాస్త్రవేత్తలు  వాటికి ‘బోసాన్’లు (ఆౌటౌ) అని పేరు పెట్టారు. అయితే సత్యేంద్రనాథ్ ప్రతిపాదన జరిగిన నాలుగు దశాబ్దాల తరువాత, 1964లో ఎంగ్లెర్ట్, హిగ్స్ శాస్త్రవేత్తలు విడివిడిగా పరిశోధనలు జరిపి, బోసాన్ కణాల ఉనికిని తమ సిద్ధాంతాల ద్వారా ప్రతిపాదించారు. అయితే 2010 సంవత్సరం తర్వాత మాత్రమే వారి ప్రతిపాదనలు ప్రయోగం ద్వారా నిరూపించటానికి అవకాశం కలిగింది.
 
 సృష్టి ప్రారంభంలో విశ్వమంతా శక్తితో నిండి ఉండేదని, ఈ శక్తి నాలుగు విధాలుగా ఉంటుందని వీరు నిరూపించారు (అవి 1. గురుత్వాకర్షణశక్తి 2. విద్యుదయస్కాంత శక్తి 3. బలహీనమైన రేడియో ధార్మిక విఘటన శక్తి (సూర్యునిలో సంభవించే అణు ప్రక్రియలకు ఈ శక్తి ఆధారం) 4. పరమాణువుల్లో ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లను దగ్గరగా పట్టి ఉంచే బలమైన శక్తి). విశ్వంలో ఈ శక్తి యొక్క అనూహ్యమైన మార్పుల వలన పదార్థ కణాలు ఏర్పడతాయి. వాటిలో అతి చిన్నదైన, అస్థిరమైన, ద్రవ్యరాశితో కూడిన కణమే బోసాన్.
 
 - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
 విశ్రాంత రసాయనాచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement