ఆమె పోరాటం ఊరికే పోలేదు! | Nobel Malala Yousafzai wants to become a doctor | Sakshi
Sakshi News home page

ఆమె పోరాటం ఊరికే పోలేదు!

Published Fri, Mar 31 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

ఆమె పోరాటం ఊరికే పోలేదు!

ఆమె పోరాటం ఊరికే పోలేదు!

అక్కడి ఆడపిల్లల మీద ఎన్నో ఆంక్షలు. మతం పేరుతో బాలికలపై ఎన్నో అరాచకాలు.. బాలికలను విద్యకు దూరం చేయాలన్న తాలిబన్ల ఫత్వా ఆమె ఖాతరు చేయలేదు. బాలిక విద్యకోసం కృషి చేస్తున్న ఆ చిన్నారిపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆ బాలిక విద్య కోసం నేటికి ఉద్యమిస్తూనే ఉంది. తాలిబన్ల తూటాలను ధైర్యంగా ఎదుర్కొంది. బాలిక హక్కుల కోసం మరణం అంచుల దాకా వెళ్లి ఆమె చేసిన పోరాటం ఊరికే పోలేదు. ఆమె సేవలకు గుర్తుగా నోబెల్‌ శాంతి బహుమతికి వరించింది. ఆమె మరెవరో కాదు.. పాక్‌ బాలిక యూసఫ్‌జాయ్‌ మలాలా... మరి ఆమెపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...!

మలాలా ఎక్కడి అమ్మాయి? పదహారణాల తెలుగింటి అమ్మాయి కాదే. పోనీ పొరుగింటి అమ్మాయా? అసలే కాదు. పోనీ మన దేశానికి చెందిన అమ్మాయా? కానే కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఏదైనా ఆశయం కోసం చిన్నగా పిడికిళ్లు బిగిస్తే.. ఆ పిడికిళ్ల ప్రభంజనాన్ని అందుకునేందుకు కోట్లాది చేతులు పైకిలేస్తాయి. అంతే ఉద్విగంగా ఆ పిడికిళ్లు ఆకాశమంత ఎత్తులో ‘‘మేము ఆడపిల్లలం ఆత్మస్ధైర్యానికి ప్రతీకలం’’ అంటూ నినదిస్తాయి.

డాక్టర్‌ కావాలనుకున్నా...
జూలై 12, 1997న పాకిస్థాన్‌కి చెందిన ఒక సున్నీ ముస్లిం కుటుంబంలో మలాలా జన్మించింది. చిన్నప్పటినుంచి మలాలాకు డాక్టర్‌ కావాలని కోరిక ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకుంది. ఇద్దరు తమ్ముళ్లు నిద్రపోయినా కూడా అర్ధరాత్రి వరకు తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. రాజకీయాలపై అవగాహన పెంచుకున్న 11 సంవత్సరాల మలాలా 2008 పెషావర్‌ క్లబ్‌లో అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చింది. ‘‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కును లాక్కోవడానికి మీరెవరు? అంటూ ఉపన్యాసంలో తాలిబన్లను ప్రశ్నించింది. ఈ ఉపన్యాసం స్వాత్‌లోయ మొత్తం ప్రతిధ్వనించింది. ఇక అప్పటినుంచి తాలిబన్లకు మలాలా, ఆమె కుటుంబ సభ్యులు శత్రువులయ్యారు.

ఉగ్రవాదుల హుకుం
స్వాత్‌లోయలో ఆడపిల్లలకు అక్షరం నిషిద్ధమైంది. బాలిక పాఠశాలలన్ని మూసేయాలని హుకుం జారీచేశారు. ఉగ్రవాదుల ఆదేశాలను ఖతారు చేయని వందకుపైగా బాలిక పాఠశాల భవనాలను పేల్చివేశారు. బడికి వెళ్లే బాలికలను చంపడంతోపాటు ఉపాధ్యాయులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి బడికి వెళుతున్న ఉపాధ్యాయిని కొడుకు ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. కరాచిలోని క్వెట్టాలో ఆత్మాహుతి దళసభ్యుడు 40 బాలికలు ఉన్న పాఠశాల బస్సులోకి వెళ్లి తనను తాను పేల్చివేసుకున్నాడు. టీవీలు మూగబోయాయి. స్త్రీలు గడపదాటిరావడం మీద ఆంక్షలు మొదలయ్యాయి. తాలిబన్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోసాగాయి.  

మలాలా సొంత ఊరు మింగోరా పట్టణంలో కూడా పాఠశాల భవంతిని ఉగ్రవాదులు పేల్చివేసారు. అయినప్పటికీ మలాలా ఏ మాత్రం భయపడకుండా బడికి వెళుతూనే ఉంది. ఒకరోజు పాఠశాలకు వెళ్లివస్తున్న మలాలాకు ఎదురుగా ముసుగు వేసుకున్న వ్యక్తి వెళ్లి చంపుతానని బెదిరించాడు. తమ మాట వినటం లేదన్న కారణంతో అక్టోబర్‌ 9, 2012, స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా మలాలాపై ముష్కరులు దాడిచేశారు. తలలోకి బుల్లెట్లు దూసుకపోయాయి. చనిపోయారనుకుని వదిలివెళ్లిపోయారు. కానీ, అదృష్టవశాత్తూ బాలిక ఇంకా ప్రాణాలతోనేఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కానీ, పాకిస్థాన్‌లో సరైన వైద్య సదుపాయాలు లేనందున బ్రిటన్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రికి తరలించారు.

సర్జరీల మీద సర్జరీలు చేయాలి బతకడం కష్టం అన్నారు. బతికినా ఏదో సమస్య జీవితాంతంవెంటాడుతూనే ఉంటుందన్నారు. మలాలా బతకాలని ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న ప్రతిబాలిక దేవుడిని ప్రార్థించింది. వెట్టిచాకిరీ, వేధింపులకు గురవుతున్న ప్రతి మహిళా మలాలా కోలుకోవాలని పూజలు చేశారు. వీరందరి పూజలు, మలాలా సంకల్పం ఫలించాయి. మొత్తానికి  కానీ, మలాలా కళ్లు తెరిచింది. బాలికల హక్కుల కోసం పోరాడేందుకు లేచినిలబడింది. తీవ్రవాదుల తూటాల గాయాల నుంచి 6 నెలల్లోనే కోలుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి, 2013న మలాలా చిరునవ్వుల చిందిస్తూ బ్రిటన్‌ స్కూల్లో అడుగుపెట్టింది.

నోబెల్‌ శాంతి బహుమతి
బాలిక విద్యావ్యాప్తికోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. బాలకార్మిక నిర్మూలనకోసం కృషిచేసిన కైలాశ్‌ సత్యార్థితో నోబెల్‌ బహుమతిని పంచుకుంది. ఈ బహుమతికి ఎంపికైన అతిపిన్న వయస్కురాలు మలాలా. ఆడపిల్లలకు పెన్ను, నోట్‌బుక్‌ ఇస్తే పరిస్థితులు మారిపోతాయని మలాలా బలంగా నమ్ముతుంది. ‘‘సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్‌ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను.

గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్, మదర్‌ థెరిసాలే నాకు ఆదర్శ’’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఉపన్యాసంలో పేర్కొంది. పది మంది కోసం పనిచేస్తే వంద మంది గుర్తుపెట్టుకుంటారు. భవిష్యత్‌ తరాల కోసం ఆలోచిస్తే కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఆడపిల్లలకు కూడా చదువు కావాలంటూ గళమెత్తిన మలాలా ఇప్పుడు ప్రపంచంలోని ఎంతోమంది బాలికలకు, యువతులకు మార్గదర్శకమైంది. అందుకే ఇప్పుడు ఆమెను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు ప్రపంచ దేశాల యువతులు.
– సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement