లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు.
ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment