రెక్కలు తొడిగిన బాల్యానికి నోబెల్ శాంతి బహుమతి
భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.
అతిపిన్న వయస్సులోనే:
పాక్‌లో బాలికల విద్యాహక్కుల కోసం ఉద్యమం సాగిస్తూ.. రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి.. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమె వయసు కేవలం 17ఏళ్లు. గతంలో ఈ రికార్డు సర్ విలియమ్ లారెన్స్ బ్రాగ్ పేరిట ఉంది. ఆయనకు 1915లో 25 ఏళ్ల వయసులో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. విలియమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. మలాలా నోబెల్ గెలుచుకున్న రెండో పాకిస్థాని. ఇంతకు ముందు 1979లో మహ్మద్ అబ్దుస్ సలామ్ అనే భౌతిక శాస్త్రవేత్తకు నోబెల్ పురస్కారం లభించింది. మలాలా యూసఫ్‌జాయ్ 1997 జూలై 12న వాయవ్య పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల ప్రాబల్యమున్న స్వాత్ జిల్లాలో జన్మించింది.
అక్కడి తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం విధించారు. అయితే దీన్ని వ్యతిరేకించి బాలికల విద్య కోసం ఉద్యమం ప్రారంభించింది. దీన్ని సహించని తాలిబన్లు 2012, అక్టోబర్ 9న మలాలాపై తూటాలు పేల్చారు. అప్పుడు ఒక బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. చికిత్స అనంతరం మలాలా 2013 మార్చిలో బర్మింగ్‌హామ్‌లోని ఒక స్కూల్‌లో చేరి ఇంగ్లండ్‌లోనే చదువుకుంటోంది. ఈ ఘటనతో మలాలా ప్రపంచం మొత్తానికి తెలిసింది. 2013 అక్టోబర్‌లో మలాలా ‘‘ఐ యామ్ మలాలా- ద గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబన్’’ అనే పేరుతో తన ఆత్మకథను ప్రచురించింది. దీన్ని ఆమె క్రిస్టినా ల్యాంబ్ అనే బ్రిటిష్ జర్నలిస్టుతో క లిసి రచించింది.
అవార్డులు:
మలాలా స్ఫూర్తిని గుర్తిస్తూ ఎన్నో అవార్డులు ఆమెకు లభించాయి. 2013లో కిడ్స్‌రైట్స్ ఫౌండేషన్ వారి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి, క్లింటన్ ఫౌండేషన్ వారి క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు, అన్నా పొలిటికొవ్‌స్కయా అవార్డు, యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే సఖరోవ్ పురస్కారం, అంతర్జాతీయ సమానత్వ బహుమతి, 2014లో లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది.
బచ్‌పన్ బచావో ఆందోళన్:
బాలల హక్కుల అణచివేతపై మూడు దశాబ్దాలుగా కైలాష్ సత్యార్థి పోరు సాగిస్తున్నారు. 80 వేల మంది బాలలను వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేశారు. భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మథర్ థెరిస్సా 1979లో మొదటి సారి భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు (ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో). జన్మతః భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే ప్రథమం. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.