స్టాక్‌హోం: సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్ రచయిత అనీ అర్నాక్స్(82)కు లభించింది. అనీ అర్నాక్స్ పేరును నోబెల్ కమిటీ ప్రకటించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్ బహుమతి వరించింది. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారు అర్నాక్స్. 1940లో ఆమె నార్మాండీలోని యెవటోట్‌లో జన్మించారు.
చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. నోబెల్ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. రచన అంటే ఓ రాజకీయ చర్య, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టడమే.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది.
ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
ఇదీ చదవండి: Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో
Comments
Please login to add a commentAdd a comment