Nobel Prize Committee
-
ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్ రచయిత అనీ అర్నాక్స్(82)కు లభించింది. అనీ అర్నాక్స్ పేరును నోబెల్ కమిటీ ప్రకటించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్ బహుమతి వరించింది. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారు అర్నాక్స్. 1940లో ఆమె నార్మాండీలోని యెవటోట్‌లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. నోబెల్ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. రచన అంటే ఓ రాజకీయ చర్య, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టడమే.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఇదీ చదవండి: Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో -
బలహీనతను బలంగా వినిపించే కవిత్వం
కవికీ కవిత్వానికీ ఏవో ఉన్నత లక్ష్యాలు ఉండాలన్నదానికి భిన్నంగా తన అస్తిత్వపు వేదననే కవిత్వంలోకి తెస్తున్నారు 77 ఏళ్ల అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లోక్. వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం ఆమెను వరించింది. -లూవీస్ గ్లోక్ కవి అనే వాడు దేనినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడు కావాలా? దేనికైనా రొమ్ము ఎదురొడ్డి నిలిచే సాహసి కావాలా? ఏం, కవి భయస్తుడు కాకూడదా? కవి బలహీనుడు కాకూడదా? ఆకాశం కిందిది ఏదైనా కవిత్వానికి అర్హమైనదే అయినప్పుడు, భయ బలహీనతలు మాత్రం కవితా వస్తువులు కావా? ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించిన అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లో్లక్ కవిత్వమంతా ఇలాంటి వ్యక్తిగత కలవరింతలే, పశ్చాత్తాపపు తలపోతలే. అయితే వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఆమెకు ఈ సర్వోన్నత గౌరవం దక్కింది. సంప్రదాయంగా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీకరించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా అదే రోజు తన ఇంటిలోనే దీన్ని అందుకుంటారు. ఆత్మకథాత్మక కవయిత్రి ఆమె తల్లిదండ్రులు హంగెరీ నుంచి అమెరికాకు బతుకుదెరువు కోసం వచ్చిన యూదులు. 1943లో ఆమె పుట్టకముందే ఒక అక్క చనిపోయింది. తన కంటే ముందు పుట్టిన ఒక ప్రాణి మరణించిన వాస్తవం రక్తంలో ఇంకించుకుని పెరిగింది. దీనికితోడు కౌమారంలో ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో అనే అసాధారణ భయం వెంటాడింది (అనరెక్సియా నెర్వోసా). సహజంగానే ఇది చదువుకు ఆటంకం కలిగించింది. ఏడేళ్ళ పాటు వైద్యం తీసుకున్నాక గానీ సాధారణం కాలేకపోయింది. ‘‘జీవితంలో ఒక దశలో నేను చచ్చిపోతున్నాను అని అర్థమైంది. కానీ అంతకంటే స్పష్టంగా, అంతకంటే బలంగా నేను చావాలని అనుకోవడం లేదు అని కూడా అనిపించింది’’ అంటారామె. ఈ జబ్బు కారణంగానే ఎలా ఆలోచించాలో నేర్చుకున్నానంటారు. రచన కూడా ఒక జబ్బు లాంటిదే. కాకపోతే మన వేదనని ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా స్వస్థత పొందుతాం. ప్రపంచం మాత్రం ఇలా చేయదా? మరి కవికి మాత్రం ఎందుకు మినహాయింపు? అందుకే గ్లో్లక్ ఎనిమిదో ఏట నుంచే కవిత్వాన్ని తన శోకానికి విరుగుడుగా భావించింది. ఆత్మకథాత్మకంగా రాస్తూ, తీవ్రమైన ఉద్వేగాలను పలి కిస్తూ ఆధునిక జీవితాన్ని చిత్రించింది. పాతికేళ్ల వయసులో 1968లో తన తొలి కవితా సంపుటి ఫస్ట్‌బర్న్ వెలువరిం చింది. దీనికి సానుకూల స్పందన వచ్చినప్పటికీ , అనంతరం సుదీర్ఘమైన రైటర్స్ బ్లాక్ వెంటాడింది. కవిత్వం రాయడం ద్వారా తన వేదన నుంచి బయటపడ్డట్టుగానే, కళాశాలలో చేరి కవిత్వాన్ని బోధించడం ద్వారా రైటర్స్ బ్లాక్ నుంచి బయటపడింది. (చదవండి: అమెరికా కవయిత్రికి నోబెల్) తిరిగి తిరిగి నిలబెట్టుకోవడం 1975లో వచ్చిన తన రెండో కవితా సంపుటి ద హౌజ్ ఆన్ మార్‡్షలాండ్స్ ద్వారా తనదైన ప్రత్యేకమైన గొంతును సాధించింది. ఇక 1980లో వచ్చిన డిసెండెంట్ ఫిగర్ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. ఇల్లు తగలబడి తన సర్వస్వం కోల్పోయినప్పుడు రాసిన కవిత్వం ద ట్రయంప్ ఆఫ్ ఎకిలీస్ (1985). ఈ సంపుటంలోని మాక్ ఆరెంజ్ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. అయినా తనను స్త్రీవాదిగా, యూదు కవిగా, ప్రకృతిగా కవిగా లేబుల్స్ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాటన్నింటికి అతీతమైనదేదో మనిషి అస్తిత్వం అని ఆమె నమ్మకం. తన మరణపు వాస్తవాన్ని గుర్తించడం వల్లే ఎకిలీస్ మరింత మనిషి అయినట్టుగా, ఆమె కూడా జీవితపు క్షణభంగురతను ఈ కాలంలో గుర్తిం చింది. తండ్రి మరణించిన దుఃఖంలోంచి పుట్టిన కవిత్వం అరారత్(1990). 1992లో వచ్చిన వైల్డ్ ఐరిస్, తరువాయి సంపుటం మీడోలాండ్స్(1996), వీటా నోవా(1999), ద సెవెన్ ఏజెస్(2001) అన్నీ తన జీవిత వైఫల్య సాఫల్య క్షణాల పట్టుపురుగులే. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కారాలు పొందడం, ఓటములు ఎదుర్కోవడం, నిలుపుకోలేని బంధాల్లో చిక్కుకోవడం, తనను తాను తిరిగి తిరిగి నిలబెట్టుకోవడమే ఈ కవిత్వం నిండా. (చదవండి: నోబెల్ ఉమెన్) నిశ్శబ్దపు ఉనికి మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. గ్రీకు పురాణాలన్నా, మొత్తంగా ధార్మిక గాథలన్నా ప్రత్యేకమైన ఇష్టం. కాగితం మీద కలం కదపడంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనే 77 ఏళ్ల గ్లోక్ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. అవెర్నో(2006), ఎ విలేజ్ లైఫ్(2009), ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్(2014)– కవితా సంపుటాలను వరుసగా తెస్తూనేవున్నా దీర్ఘ కాలావధులు తాను ఏమిరాయకుండా ఉండిపోతానని చెబుతారు. విస్తృతంగా రాస్తున్నప్పుడు పునరుక్తి దోషం అంటుకోవచ్చు, తాజాదనం కోల్పోవచ్చు. రోజూ పొద్దున లేచేసరికి అదే మనిషిగా ఉండటంలోని సానుకూలతను గుర్తిస్తూనే, నాది నేనులాగే కవిత్వంలో వినిపించడం ఒక శాపంగానే భావిస్తానంటారు. అందుకే ప్రతీ సంపుటికి గొంతు మార్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కవిత్వంలో ఆమె తోటలోని పువ్వులకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఆవి వివేకంతో భాషిస్తాయి, సందర్భోచితంగా కవయిత్రి శోకంతో గొంతు కూడా కలుపుతాయి. ప్రపంచపు సంగీ తాన్ని, దైవిక నిశ్శబ్దాన్ని కూడా ఆమె కవితలు వినిపిస్తాయి. పెద్ద పాఠకవర్గానికి చేరడంలో ఆమెకు ఉత్సాహం లేదు. కవిత్వం నోటి నుంచి చెవికి జరిగే సున్నితమైన మార్పిడి అని నమ్ముతారు. కానీ, కవిత్వం స్టేజీ మీద చదవడానికి కూడా ఇష్టపడదు. నోరు, చెవి అనేవి నిజార్థంలో కాకుండా ఒక మనసులో పుట్టిన భావాన్ని స్వీకరించేం దుకు సిద్ధంగా ఉన్న ఇంకో మనసుగా చూస్తారు. వినబడినప్పుడే ఉనికిలో ఉన్నట్టు కాకుండా, నిశ్శబ్దంలో కూడా అస్తిత్వంలో ఉండాలంటారు. – పి.శివకుమార్ -
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
ఎలెన్ జాన్సన్‌కు నేడు ఇందిర శాంతి బహుమతి
న్యూఢిల్లీ: లైబీరియా అధ్యక్షురాలు, నోబెల్ బహుమతి విజేత ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ గురువారం ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాన్సన్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుమతి ప్రదానం చేయనున్నారు. ఆఫ్రికాలో ఓ దేశానికి అధ్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళగా 74 ఏళ్ల ఎలెన్ చరిత్ర సృష్టించారు. ఎలెన్ ప్రస్తుతం భారత పర్యటనలోనే ఉన్నారు. ఆర్థికవేత్త కూడా అయిన ఆమె మహిళల హక్కుల కోసం, శాంతి కోసం విశేష కృషిచేశారు. 2011లో లేమా జిబోవీ, తవకెల్ కర్మాన్లతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.