అమెరికా కవయిత్రికి నోబెల్‌ | American poet Louise Gluck awarded Nobel Prize in Literature | Sakshi
Sakshi News home page

అమెరికా కవయిత్రికి నోబెల్‌

Published Fri, Oct 9 2020 3:35 AM | Last Updated on Fri, Oct 9 2020 3:43 AM

American poet Louise Gluck awarded Nobel Prize in Literature - Sakshi

స్టాక్‌హోమ్‌: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్‌(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్‌ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్‌ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్‌ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్‌ మామ్‌ పేర్కొన్నారు. 2006లో గ్లుక్‌ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్‌ సాహిత్య కమిటీ చైర్మన్‌ ఆండెర్స్‌ ఒల్సన్‌ పేర్కొన్నారు.

1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్‌ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్‌ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్‌ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్‌ గెలుచుకున్న అమెరికన్‌ బాబ్‌ డైలాన్‌(2016).  హంగేరియన్‌–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్‌ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్‌ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్‌ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్‌’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్‌ ఫిగర్స్, ది ట్రయంఫ్‌ ఆఫ్‌ అచిల్స్, అరారట్‌ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు.  

వివాదాల్లో నోబెల్‌ ‘సాహిత్యం’
సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్‌ రచయితకు స్వీడిష్‌ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్‌ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్‌ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు.

గత ఏడాది సాహిత్య నోబెల్‌ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్‌ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్‌ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్‌ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది.  

లూయిసీకి దక్కిన పురస్కారాలు
► నేషనల్‌ హ్యుమానిటీ మెడల్‌(2015)
► అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ గోల్డ్‌ మెడల్‌
► ‘ది వైల్డ్‌ ఐరిస్‌’కవితకు పులిట్జర్‌ ప్రైజ్‌(1993)
► ‘ఫెయిత్‌ఫుల్‌ అండ్‌ విర్చువస్‌ నైట్‌’ కవితకు నేషనల్‌ బుక్‌ అవార్డు(2014)
► 2003, 2004 సంవత్సరాల్లో  ‘యూఎస్‌ పోయెట్‌ లారియేట్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement